బుధవారం 20 జనవరి 2021
Khammam - Aug 12, 2020 , 02:42:00

ఈ దోంగకు తాళం ఇవ్వకండి

ఈ దోంగకు తాళం ఇవ్వకండి

ఆన్‌లైన్‌లో డెబిడ్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండటంతో ఆర్థిక నేరగాళ్ల పని సులభం అవుతున్నది. వీళ్లు ఎక్కడుంటారో తెలియదు.. వీరిపైన కేసులు నమోదు చేసినా, రివకరీ కూడా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఆర్థిక నేరాల పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం వారికి మరింత కలిసొచ్చింది. నగదే కాకుండా ఫోన్లను హ్యాక్‌ చేసి, వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తూ.. బాధితులను భయపెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫ్రీ ల్యాప్‌టాప్‌లని, 5జీబీ డేటా ఉచితమని, స్క్రాచ్‌ కార్డులతో డబ్బులని ప్రలోభపెట్టి.. వాటిని మిగతా స్నేహితులకు షేర్‌ చేయాలని చెప్పి.. చైన్‌లింక్‌ మాదిరి డబ్బులు దోచుకుంటున్నారు. ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ వంటి వెబ్‌సైట్లలో కొనుగోలుదారులమని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో భారీగా వెలుగు చూస్తున్నాయి.

ఫేస్‌"బుక్‌ చేస్తుంది’ జాగ్రత్త

ఆర్థిక నేరాల కోసం ఫేస్‌బుక్‌ నుంచి ఖాతాదారుల వివరాలను సేకరిస్తారు. అందులో పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌ సహా ఉంటుంది. పైగా అందులో పెట్టే ఫొటోలతో వారి ఆర్థిక స్థితిని అంచనావేసి నేరాలకు ప్రణాళిక వేసుకుంటారు. అలాగే ఇన్‌కం ట్యాక్స్‌ సైట్‌లోకి వెళ్లి, ఆ వివరాల ఆధారంగా డూప్లికేట్‌ పాన్‌కార్డు, మొబైల్‌ నెంబర్‌ సంపాదిస్తున్నారు. దాని నుంచి డూప్లికేట్‌ పాన్‌కార్డు ద్వారా మరో సిమ్‌కార్డు తీసుకొని, కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసి సులభంగా డబ్బులు దోచేస్తున్నారు. తమ ఖాతాలోని డబ్బులు డ్రా అవుతున్నట్లు గుర్తించే లోపునే పని పూర్తి చేస్తారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది.


జిరాక్స్‌ సెంటర్లే కేంద్రంగా..

జిరాక్స్‌ సెంటర్ల వద్ద కూడా విలువైన పాన్‌కార్డు, ఐడీకార్డు, బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ కార్డు వంటి వాటిని జిరాక్స్‌ తీయించడం జరుగుతున్నది. అక్కడ మనం జిరాక్స్‌ తీయమన్నప్పుడు వినియోగదారుని అన్ని రకాల సర్టిఫికెట్లను స్కాన్‌ చేస్తారు. లేకపోతే తెలివిగా రెండు కాపీలు జిరాక్స్‌ తీస్తారు. దీంతో వారి వద్ద ఉన్న విలువైన సమాచారాన్ని సైబర్‌ దొంగలకు అమ్మి.. సొమ్ము చేసుకుంటున్నారు కొందరు జిరాక్స్‌ సెంటర్ల నిర్వాహకులు. విద్యార్థులు సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, రూల్‌ నెంబర్లు, తదితర సంబంధించిన వాటిని ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు కొన్ని విద్యాసంస్థలు కూడా కొన్ని నిర్దిష్టమైన సెంటర్లను ఎంచుకొని, పనులు చేయించుకుంటారు. వారివద్ద నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లను సేకరించి బ్యాంక్‌ ఖాతాలను కొల్లగొడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.  

అవగాహన ఒక్కటే మార్గం..

సైబర్‌ నేరాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే అవగాహన ఒక్కటే మార్గం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడకుండా డబ్బులు వస్తాయని ఎవరైనా ఫోన్‌ చేసినా, మెసేజ్‌ చేసినా అత్యాశకుపోవద్దు. మీ బ్యాంక్‌ ఖాతా, డెబిట్‌ కార్డు, ఓటీపీల వివరాలు ఎవ్వరితోనూ చెప్పకండి. మీ అకౌంట్‌ నంబర్‌ చెప్పి,  బ్యాంక్‌ మేనేజర్‌ అని నమ్మించినా వివరాలు చెప్పొదు. డబ్బులు విత్‌ డ్రా అయినట్లు మీకు మెసేజ్‌ వచ్చినా, ఎవరైనా బ్యాంక్‌ సిబ్బంది అంటూ ఫోన్‌ చేసినా.. మీరే నేరుగా బ్యాంక్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇక మీ మెయిల్స్‌, మొబైల్స్‌ వచ్చే లింక్‌లను గుడ్డిగా ఓపెన్‌ చేయకండి. వాటిని ఫార్వర్డ్‌ చేయడం వల్ల మీతో పాటు మీ బంధువులు, స్నేహితులు వారి ఉచ్చులో పడతారు తస్మాత్‌ జాగ్రత్త.

వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు కృషి

సైబర్‌ మోసగాళ్ల ఆట కట్టించేందుకు అత్యాధునిక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. నేరగాళ్లను గుర్తించి బాధితులకు న్యాయం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఖమ్మంలో సైబర్‌ లాబ్‌ను ఏర్పాటు చేసి, నేరాల పాల్పడేవారిని గుర్తించి బాధితులకు న్యాయం చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఇతర వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వకపోవడం మంచిది. ఆన్‌లైన్‌లో, ఏటీఎం సెంటర్లు, దుకాణాల్లో వ్యక్తిగత సమాచారం ఇతరులకు లభించకుండా జాగ్రత్తపడండి. - తఫ్సీర్‌ ఇక్బాల్‌, ఖమ్మం నగర పోలీసు కమిషనర్‌

ఆ వివరాలను తొలగించండి..

ప్రజలు అప్రమత్తతోనే సైబర్‌ నేరాల నియంత్రణ సాధ్యమవుతుంది. మీ వివరాలు ఉండే ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పూర్తి వివరాలను తక్షణమే తొలగించండి. బ్యాంకు వారు ఖాతాదారుని వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగరు. దాన్ని గుర్తించి మెలగాలి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల పిన్‌, సీవీవీ కోడ్‌లు తస్కరించే అవకాశముంది. జిరాక్స్‌ సెంటర్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్త. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల చిత్రాలు పంపడం, కించపర్చేలా సందేశాలు పంపడం, అభ్యంతరకర దృశ్యాలు పెట్టడం వంటివి కూడా సైబర్‌ నేరాలే. 

- రంజిత్‌ కుమార్‌, ఖమ్మం నగర సైబర్‌లాబ్‌ ఇన్‌చార్జ్‌


logo