మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Khammam - Aug 11, 2020 , 03:27:29

రేపు సాగర్‌ జలాల విడుదల

రేపు సాగర్‌ జలాల విడుదల

  • పెరుగుతున్న పాలేరు నీటి మట్టం
  • నీటిని విడుదల చేయనున్న మంత్రి పువ్వాడ

కూసుమంచి: పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్‌ జలాలను జిల్లా ఆయకట్టుకు బుధవారం రాష్ట్ర రావాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విడుదల చేయనున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి జలాశయానికి నీరు వస్తుండటంతో  నీటి మట్టం పెరుగుతూ వస్తున్నది. ఈ ప్రాజెక్టు నీటిమట్టం 23 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 21 అడుగులకు చేరుకుంది. సాగర్‌ జలాలు ఆదివారం ఉదయం నుండి రావటంతో అప్పటి వరకు  19.40 అడుగులు ఉన్న నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. రిజర్వాయర్‌కు మొదటగా 1,100 క్యూసెక్కులు సాగర్‌ నీరు రాగా క్రమంగా పెరిగి రాత్రి వరకు 2,100 క్యూసెక్కుల వరకు వచ్చి చేరుతున్నాయి. దీనికి తోడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వర్షాలు పడుతుండటంతో మర్రిపెడబంగ్లా, మహబూబాబాద్‌ నుండి వచ్చే వరద సుమారు 450 క్యూసెక్కులు రావడంతో రిజర్వాయర్‌లో మొత్తం 2,550 క్యూసెక్కుల నీరు పాలేరుకు వచ్చి చేరింది.

దీంతో పాలేరు జలాశాయం నీటితో కళకళలాడుతుతున్నది. జిల్లా ఆయకట్టుకు మంగళవారం నీటిని విడుదల చేయాలని అధికారికంగా నిర్ణయించారు. ఒకవేళ వరంగల్‌ జిల్లా నుండి సోమవారం రాత్రికి వరద ఎక్కువగా వస్తే నీటి విడుదలను ఒక రోజు ముందుకు మార్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండితే అలుగుల వద్ద ఆటోమేటిక్‌ షర్టర్లు పడిపోయి కిందకు వృథాగా నీరు పోతుందనే ఉద్దేశంతో నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం జరిగే సాగర్‌ జలాల నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి అజయ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఎన్నెస్పీ అధికారులు హాజరు కానున్నారు. 

పాలేరు నీటి మట్టం వివరాలు  

(సోమవారం రాత్రి  వరకు)

పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం 21 అడుగులు

ఎడమ కాలువ ద్వారా ఇన్‌ ఫ్లో 2,100 క్యూసెక్కులు 

వరంగల్‌ జిల్లా నుంచి వరద 450 క్యూసెక్కులు 

పాలేరు అవుట్‌ ఫాల్‌కు నిల్‌  

పాత కాలువకు 100 క్యూసెక్కులు 

భక్త రామదాసుకు ప్రాజెక్టుకు 150 క్యూసెక్కులు logo