బుధవారం 30 సెప్టెంబర్ 2020
Khammam - Aug 11, 2020 , 03:13:53

రవాణాశాఖలో మార్పులకు శ్రీకారం

రవాణాశాఖలో మార్పులకు శ్రీకారం

  • ఖైరతాబాద్‌ తరహాలో ఖమ్మం జిల్లా కార్యాలయంలో సేవలు
  • వాహనదారులకు ‘సిమ్యూలేటర్‌' ద్వారా డ్రైవింగ్‌ శిక్షణ
  • ఇకపై ఈ-బిడ్డింగ్‌ ద్వారానే ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు
  • సిమ్యూలేటర్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్‌ 

తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్‌ ప్రభుత్వం రవాణాశాఖలో సరికొత్త మార్పులకు శ్రీకారంచుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా రవాణాశాఖకార్యాలయం వేదికగా వాహనదారులకు డ్రైవింగ్‌ శిక్షణ అందించేందుకు ఏర్పాటుచేసిన సిమ్యూలేటర్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాహనదారులు కార్యాలయానికి రాకుండానే రవాణా సేవలు పొందే విధంగా ఆన్‌లైన్‌ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటికే ఎంవ్యాలెట్‌ యాప్‌ను 70లక్షల మంది వినియోగిస్తున్నారని, త్వరలోనే కోటికి చేరుకోనుందనేఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆరో విడత హరితహార కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. 

-రఘునాథపాలెం 


రఘునాథపాలెం : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్ర రవాణాశాఖలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయం వేదికగా వాహనదారులకు డ్రైవింగ్‌ శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన సిమ్యూలేటర్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ను మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సిమ్యూలేటర్‌పై కూర్చుని డ్రైవింగ్‌ నేర్చుకునే విధానాన్ని మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం 6వ విడుత హరితహారంలో కార్యాలయ ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఖైరతాబాద్‌ రవాణాశాఖ కార్యాలయంలో ఉన్న ఆధునిక సౌకర్యాలను ఖమ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు కార్యాలయానికి రాకుండానే రవాణాశాఖ సేవలు పొందే విధంగా ఆన్‌లైన్‌ ప్రక్రియను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పటికే రవాణాశాఖ తీసుకువచ్చిన ‘ఎం-వ్యాలెట్‌' యాప్‌ మంచి సత్ఫలితానిస్తోందన్నారు.

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో రవాణాశాఖ కీలకమైందని పేర్కొన్న మంత్రి, ప్రతి నెలా రూ.350కోట్ల రూపాయలు రవాణాశాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో మూడు నెలలుగా ఆదాయం కొంతమేర తగ్గిందని..ఇప్పుడిప్పుడే తిరిగి మెరుగుపడుతుందని తెలిపారు. కార్లు, ఇతర భారీ వాహనాల డ్రైవింగ్‌ నేర్చుకోవడంతో పాటు లెర్నింగ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి ముందుగా సిమ్యూలేటర్‌పై తప్పనిసరిగా శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు.  వాహనదారులు కార్యాలయం ద్వారా పొందే ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఈ బిడ్డింగ్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. ఇకపై మధ్య దళారులు, రాజకీయ ఫైరవీలు లేకుండానే వాహనదారులు తమకు కావాల్సిన ఫ్యాన్సీ నెంబర్లను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల వాహనాలకు సంబంధించిన ట్యాక్స్‌ బకాయిల చెల్లింపును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ ఎం.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ..

మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ రవాణాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో రెండో సిమ్యూలేటర్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, నగరపాలక కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అసిస్టెంట్‌ కమిషనర్‌ మల్లీశ్వరి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, వల్లభనేని రామారావు, కార్పొరేటర్‌ నాగరాజు, జిల్లా రవాణాశాఖాధికారి తోట కిషన్‌రావు, ఎంవీఐ శంకర్‌నాయక్‌, ఏఎంవీఐలు కిశోర్‌బాబు, వరప్రసాద్‌, వంశీధర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం ఇన్‌చార్జ్‌ ఆర్జేసీ కృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


logo