బుధవారం 30 సెప్టెంబర్ 2020
Khammam - Aug 11, 2020 , 03:06:02

జలధార

జలధార

  • ఉమ్మడి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం..
  • నిండిన చెరువులు..  పొంగుతున్న వాగులు
  • భద్రాద్రి జిల్లాలో సగటున 32.1 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదు
  • అత్యధికంగా భద్రాచలంలో 58.8 మి.మీ. వర్షం
  • ఖమ్మం జిల్లాలో సగటున  20.5 మి.మీ. నమోదు
  • ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు
  • భద్రాచలం వద్ద 22.5 అడుగులకు  చేరిన గోదావరి
  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీ  వరద.. 18 గేట్లు ఎత్తివేత

ఆకాశానికి చిల్లు పడిందేమో అన్నట్లుగా రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవడంతో తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీరు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమై 18 గేట్లు ఎత్తి 61,152 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దుమ్ముగూడెం హెడ్‌లాకుల వద్ద గోదావరి నీరు 9 అడుగులకు, భద్రాచలం స్నానఘట్టాల వద్ద 22.5 అడుగులకు చేరుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా ఇప్పటికే 406 అడుగులకు చేరుకోవడంతో మూడు గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఖమ్మం నగర పరిధిలోని మున్నేరుకు వరద నీరు భారీగా రావడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 

 -ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ


ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం: అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి వర్షం కురిసింది. కొద్ది రోజుల నుంచి నాట్లు వేసుకుంటున్న రైతులకు ప్రయోజనం చేకూరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా సరాసరి 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామేపల్లి మండలంలో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావడం విశేషం. గత రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఖమ్మం నగరంలో జనజీవనానికి స్వల్ప అంతరాయం కలిగింది. సోమవారం ఉదయం సైతం నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కరిసింది. మధిర, వైరా, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే వానకాలం సాగుకు సంబంధించి దాదాపు 95 శాతం పనులు, నాట్లు పూర్తయ్యాయి. మరో 48 గంటల్లోనూ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

ఒక్కరాత్రిలోనే 20.5 మి.మీ వర్షం

కొద్ది రోజుల నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదివారం రాత్రి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సరాసరి 20.5 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదైంది. 1- 3 సెంటీమీటర్ల వర్షపాతం 18 మండలాలలో నమోదైందంటే ఎంత మేర విస్తారంగా వర్షం కురిసిందో అర్థం చేసుకోవచ్చు. కామేపల్లి మండలంలో 41 మిల్లీమీటర్లు, వైరాలో 22.8 మి.మీ, బోనకల్లులో 22.4 మి.మీ, ముదిగొండలో 19.6 మి.మీ, తిరుమలయపాలెంలో 18.6 మి.మీ, ఎర్రుపాలెంలో 17.8 మి.మీ, పెనుబల్లిలో 18.4 మి.మీ, కూసుమంచిలో 18.6 మి.మీ, ఏన్కూరులో 31.2 మి.మీ, తల్లాడలో 17.4 మి.మీ, చింతకానిలో 19.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. సోమవారం నాటికి ఈ సీజన్‌లో 12 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో వర్షపాతం నమోదైంది.

వర్షపాతం నమోదులో అధిక రికార్డులు

ఈ ఏడాది పంటల సీజన్‌ ఆరంభం నుంచి సోమవారం వరకు సాధారణం కంటే అధిక మొత్తంలో వర్షపాతం నమోదు కావడం విశేషం. నిరుడు ఆగస్టులో వర్షాలు ప్రారంభం కాగా నైరుతీ రుతుపవనాలు సకాలంలో రావడంతో ఈ సంవత్సరం జూన్‌ నెల ఆరంభంలోనే వర్షాలు మొదలయ్యాయి. దీంతో పంటల సాగుకు ఇబ్బంది లేకుండా పోయింది. జిల్లాలో జూన్‌ నెల సాధారణ వర్షపాతం 105.2 మి.మీ. కాగా ఈ ఏడాది 189.2 మి.మీ నమోదైంది. 79 శాతం అధికంగా ఉంది. జూలైలో సాధారణ వర్షపాతం 272 మి.మీ కాగా ఈ ఏడాది జూలైలో 323.2 మి.మీ నమోదైంది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 253 మి.మీ కాగా సోమవారం నాటికి 70.1 మి.మీ నమోదైంది. 

95 శాతానికి చేరిన వానకాలం సాగు

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రిత సాగు ప్రణాళిక ప్రకారం సోమవారం వరకు 95 శాతం సాగు పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 5.18 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 4,96,721 ఎకరాల్లో సాగులో ఉన్నాయి. 

భద్రాద్రి జిల్లాలో32.1 మి.మీ వర్షం

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. భద్రాచలంలో అత్యధికంగా 58.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా చండ్రుగొండలో అత్యల్పంగా 10.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పినపాకలో 28.6 మి.మీ, చర్లలో 24.2 మి.మీ, అశ్వాపురంలో 31.4 మి.మీ, మణుగూరులో 33.6 మి.మీ, గుండాలలో 40.6 మి.మీ, ఇల్లెందులో 43.6 మి.మీ, టేకులపల్లిలో 46.4 మి.మీ, జూలూరుపాడులో 30.0 మి.మీ, చండ్రుగొండలో 10.6 మి.మీ, కొత్తగూడెంలో 28.4 మి.మీ, పాల్వంచలో 43.4 మి.మీ, బూర్గంపాడులో 52.4 మి.మీ, ములకలపల్లిలో 28.2 మి.మీ, దమ్మపేటలో 22.6 మి.మీ, దుమ్ముగూడెం, అశ్వారావుపేటల్లో 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సరాసరి 32.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

జలాశయాలకు భారీ వరద..

ఉమ్మడి జిల్లాలోని పలు జలాశయాలకు భారీగా వరదనీరు చేరింది. ఖమ్మంలో మున్నేటిపై చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. తీర్థాల వద్ద నూతనంగా నిర్మిస్తున్న చెక్‌డ్యాం సముద్రాన్ని తలిపిస్తోంది. ఇక పాలేరు జలాశయానికి కృష్ణా నది నీళ్లు రావడం, అదే సమయంలో వర్షాలు కూడా అధికంగా కురుస్తుండడంతో క్రమంగా నీటి ప్రవాహం పెరుగుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు అధికారులు 18 గేట్లు ఎత్తివేసి 61,152 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదిలారు. దుమ్ముగూడెం హెడ్‌లాకుల వద్ద సోమవారం సాయంత్రానికి 9 అడుగుల మేర గోదావరి నీటిప్రవాహం చేరుకుంది. కిన్నెరసాని రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా, సోమవారం ఇన్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులు ఉండటంతో నీటి మట్టం 406 అడుగులకు చేరింది. దీంతో అధికారుల మూడు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. దీంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
logo