మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Khammam - Aug 10, 2020 , 01:02:13

కృష్ణమ్మకు పంటతల్లి స్వాగతం

కృష్ణమ్మకు పంటతల్లి స్వాగతం

  • ఖమ్మం జిల్లాకు చేరిన సాగర్‌ జలాలు
  • నాయకన్‌గూడెం కాలువకు జలకళ
  • లక్షలాది మంది రైతుల ఆనందోత్సాహాలు
  • రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది.. ‘సాగర్‌' నుంచి బిరాబిరా కృష్ణమ్మ కదిలి వచ్చింది.. పంటతల్లి దాహం తీర్చేందుకు   వడివడిగా తరలివచ్చింది.. రైతన్న కష్టం తీర్చేందుకు నురుగలెత్తుతూ     పరుగులు పెడుతోంది.. ఆదివారం ఖమ్మం జిల్లాలోని నాయకన్‌గూడేనికి     సాగర్‌ జలాలు చేరిన నేపథ్యంలో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నది. 

  

కూసుమంచి: కృష్ణా జలాలు జిల్లాకు చేరడంతో ఆయకట్టు కింద లక్షలాది మంది రైతుల్లో సంతోషం తొణికిసలాడుతున్నది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తో సాగర్‌ నీటిని ముందస్తుగా విడుదల చే యించారు. దీంతో సకాలంలో పంటలు వేసుకోవటానికి  అంతా సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నగదు ఖాతాల్లో జమ కావడం, ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉండటం తో నీటికోసం పొలాలు సిద్ధం చేసుకున్నారు. పాలే రు కింద వరి, ఆరుతడి పంటలకు రెండు, మూడు జోన్‌ల కింద మొత్తం 4.5 లక్షల ఎకరాల్ల్లో పంటలు పండిస్తారు. ఈ నెల 12వ తేదీ జిల్లా ఆయకట్టుకు పాలేరు నుంచి నీరు విడుదల చేయనున్నారు.

ఎడమ కాలువ ద్వారా కృష్ణా జలాలు ఆదివారం ఉదయం పాలేరు రిజర్వాయర్‌ ఇన్‌ ఫాల్‌ కాలువ నాయకన్‌గూడెం వద్ద జిల్లాలో ప్రవేశించాయి. గత శుక్రవారం సాగర్‌ డ్యాంలో ఎడమ కాలువకు నీరు విడదల చేయడంతో 40 గంటల తరువాత పాలేరుకు 11 క్యూసెక్కుల నీరు చేరింది. రాత్రి  వరకు క్రమంగా పెరిగి 2,000 క్యూసెక్కుల నీరు పాలేరుకు వచ్చి చేరుతున్నాయి. వానకాలం ఆయకట్టు నీటి విడుదల కోసం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ను కలువగా వెంటనే సీఎం స్పందించి నీటి విడుదలకు అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రానికి పాలేరు రిజర్వాయర్‌ నీటి మట్టం 20 అడుగులకు చేరుకుంది. కిందకు నీరు వదిలే వరకు ఒకటి రెండు రోజుల్లో పాలేరు నీటి మట్టం పూర్తి స్థాయిలో పెరగనుంది. ఎడమ కాలవ మొదటి జోన్‌ పాలేరు ఎగువన సోమవారం నుంచి ముక్తాల బ్రాంచ్‌ కెనాల్‌, యూటీలు వజీరాబాద్‌, మేజర్లు జాన్‌పాడ్‌, కొత్తగూడెం, పాలారం వంటి మేజర్లను ఓపెన్‌ చేసి నీరు విడుదల చేయనున్నారు

2.5 లక్షల ఎకరాల సాగుకు నీరు

ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచి 142 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సాగర్‌ ఎడమ కాలువ రెండో జోన్‌ 17 మండలాల్లోని సుమారు 2.5 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు  నీరు అందించనుంది. జిల్లాలో ప్రవేశించే కృష్ణా జలాలు 140.01 కి.మీ పాలేరు అవుట్‌ ఫాల్‌ నుంచి జిల్లాలో ఆయకట్టుకు విడదల చేస్తారు. పాలేరు నుంచి ఖమ్మం మున్నేరు వరకు 40 కి.మీ తరువాత 102 కి.మీ దూరం మొత్తం 142 కి.మీలు జిల్లాలో సాగర్‌ ఎడమ కాలువ రెండో జోన్‌ ద్వారా  పంటలకు నీరు అందనుంది. చివరి ఆయకట్టు వరకు నీటిని ఇవ్వటానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. చెరువు మాధారం, బోనకల్లు 16, 17 మేజర్లు, మైనర్లు, వైరా లంకాసాగర్‌ పెద్ద చేరువులతోపాటు సాగర్‌ కాలువకు అనుసంధానంగా ఉన్న అన్ని చెరువులు నింపటానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

రిజర్వాయరే జీవనాధారం  

జిల్లాలోని మండలాల్లో పూర్తి స్థాయిలో నీరందించే ఏకైక జల వనరు పాలేరు రిజర్వాయర్‌ కావడం విశేషం. 1975 వర కు పాలేరు చెరువుగా ఉన్న సమయంలో సాగర్‌ డ్యాం నిర్మాణం తరువత రిజర్వాయర్‌గా మారింది. మా జీ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావు హయాంలో పాలేరు  జలాశయంగా మార్చారు. పాలేరు నుంచి కల్లూరు వరకు రెండో జోన్‌గా ఖమ్మం జిల్లాలో సాగునీరు అందుతుంది. కల్లూ రు నుంచి కృష్ణా జిల్లా న్యూజివీడు వరకు మూడో జోన్‌ కింద సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు పండిస్తారు. అధికారికంగా పాలేరు కింద మాత్రం 4.5 లక్షల ఎకరాలకు నీరు పాలేరు ద్వారానే అందిస్తున్నారు. దీంతో పాలేరు ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా ఉంది.

రైతు ఖాతాల్లో నగదు జమ 

గతంలో వానకాలం వచ్చిదంటే ఎరువులు పంటల పెట్టుబడుల కోసం రైతులు నానా తంటాలు పడేవారు. కానీ నేడు ఎరువులు విత్తనాలు, పూర్తిస్థాయిలో తొలకరి మొదలు కాగానే అందుబాటులో ఉంచడం, ఆయకట్టు రైతులకు సమృద్ధిగా ఎరువులు ఇవ్వడంతో సేద్యానికి ఇబ్బంది లేకుండా పోయింది. తెలంగాణ సర్కార్‌ వానకాలం పంటల పెట్టుబడికి రైతుబంధు కింద ఎకరానికిరూ .5 వేలు నగదు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇక పంట పెట్టుబడికి ఢోకా లేదు. జిల్లాకు సాగర్‌ జలాలు రావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
logo