సోమవారం 28 సెప్టెంబర్ 2020
Khammam - Aug 09, 2020 , 04:02:15

అదిగో జలాల జాడ

అదిగో జలాల జాడ

  • నేడు ఖమ్మం జిల్లాకు చేరుకోనున్న సాగర్‌ జలాలు 
  • దిగువ ఆయకట్టుకూ పుష్కలంగా సాగునీరు
  • సాగర్‌ జలాల విడుదలతో రైతుల హర్షం
  •  మంత్రి అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎన్నెస్పీ రెండో జోన్‌లోని ఆయకట్టుకు సాగర్‌ జలాలు అందనుండడంతో జిల్లాలోని రైతుల్లో ఆనందోత్సాహాలు  వెల్లివిరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియంత్రిత సాగు అమలవుతుండడం, సాగర్‌ కాల్వ చివరి ప్రాంతాల్లోని భూములకు కూడా సాగునీరు సమృద్ధిగా అందనుండడంతో జిల్లాలో అధిక దిగుబడులు రానున్నాయి. ఖమ్మం జిల్లాలో సాగునీటి కొరతను పూర్తిస్థాయిలో అధికమించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చర్యలు తీసుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సాగర్‌ జలాలను సాగర్‌ పరిధిలోని ఆయకట్టు భూములకు అందించాలని కోరారు. గతంలో సాగర్‌ ఆయకట్టు పరిధిలో మొదటి జోన్‌ వరకు మాత్రమే సాగునీరు అందేది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మంత్రి పువ్వాడ రెండేళ్లుగా ముందుగానే నీటి విడుదలకు చొరవ తీసుకుంటున్నారు. ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి సాగర్‌ జలాలను రెండో జోన్‌లోని ఖమ్మం జిల్లాకు విడుదల చేయాలని కోరారు. దీని వల్ల జిల్లాలోని మేజర్‌, మైనర్‌ కాల్వల ద్వారా అన్ని ప్రాంతాలకూ సాగునీరు అందనుంది. దీంతో వానకాలం పంటకు నీటి ఎద్దడి నివారణకు మార్గం సుగమమైంది. జిల్లాలోని సుమారు మూడున్న లక్షల ఎకరాలకు సాగర్‌ జలాలు అందనున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని చెరువులను ఈ ఏడాది వేసవిలోనే సాగర్‌ జలాలతో నింపారు. దిగువ ప్రాంతాల్లోని పలు గ్రామాల పరిధిలో తాగునీటితోపాటు సాగునీటి ఎద్దడిని ముందుగానే నివారించారు. 

సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీజన్‌కు ముందుగానే పంటలు వేసేందుకు  జంకేవారు. దిగువ ప్రాంతానికి నీరు చేరుతుందన్న నమ్మకం ఉండేది కాదు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం జిల్లాలో తాగునీటి కొరతను తీర్చడంతోపాటు సేద్యానికి అవసరమైన జలవరులనూ పెంపొందించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి అమ లు చేయడంతో ఇక్కట్లు తొలగాయి. వర్షాలు కూడా సమృద్ధిగానే కురవడంతో జిల్లాలో ఇప్పటికే వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు సాగర్‌ జలాలు కూడా ముందుగానే విడుదల అవుతుండడంతో పంట పూర్తయ్యే వరకూ సాగునీటికి ఇబ్బందులుండవని అన్నదాతలు భరోసాగా ఉన్నారు. నీరు విడుదల కావడానికి మంత్రి పువ్వాడ చొరవ తీసుకోవడంతో జిల్లాలోని రైతులందరూ ఆయనను అభినందింస్తున్నారు. శుక్రవారం అధికారులందరూ నాగార్జునసాగర్‌ వద్దకు వెళ్లారు. సాగర్‌ ఎమ్మెల్యే నర్సింహయ్య నీటిని విడుదల చేశారు. సాగర్‌ రెండో జోన్‌లోని పలు ప్రాంతాల్లోని చెరువుల నీటి ఆధారంగా ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నప్పటికీ మున్ముందు నీటి ఎద్దడి లేకుండా సాగర్‌ నీటిని విడుతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. జిల్లాలో ప్రధాన చెరువులైన పాలేరు, వైరా, చెరువుమాదారం తదితర చెరువలతోపాటు చిన్న చెరువులను కూడా నింపుతారు. 23 అగుడుల సామర్థ్యం కలిగిన పాలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 19.5 అడుగుల నీటిమట్టం ఉంది. కృష్ణా నదికి ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి కూడా వరద నీరు చేరుతున్నది.  

రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌


కేసీఆర్‌ రైతుల బాధలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అన్నదాతల అదృష్టం. కర్షకులను అన్ని విధాలా ఆదుకుంటానని, సాగుకు ముందుగానే సమాయత్తం కావాలని సీఎం పిలుపునిచ్చారు. అదేవిధంగా రైతులు కూడా ముందుగానే నార్లు పోసుకొని నాట్లు వేస్తున్నారు. మున్ముందు ఇబ్బంది రాకుండా సాగర్‌ ఇప్పుడు సాగునీరు అందించడం ఎంతో హర్షణీయం. 

-చింతనిప్పు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్‌, పాతకారాయిగూడెం

సారు మాటంటే మాటే..


‘సారు నీరు ఇస్తా. ముందుగా పంటలు వేయండి’ అని సీఎం కేసీఆర్‌ సార్‌ అన్నారు. ఆ మాటపై నమ్మకం పెట్టుకొని ముందుగానే నాట్లు వేశాం. ఇచ్చిన మాట ప్రకారం సీఎం సార్‌ ఇప్పుడు సాగు నీళ్లు ఇచ్చారు. నీళ్లు ఉంటే పైరును ఏ విధంగానైనా బతికించుకోవచ్చు. నారు పోసిన దగ్గర నుంచీ పంటకు నీళ్లు ఎంతో అవసరం. సాగర్‌ నీరు విడుదల కావడంతో చాలా సంతోషంగా ఉంది. 

-బాణోతు అంజనేయులు, రైతు, వీఎం బంజరు


logo