ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Khammam - Aug 09, 2020 , 03:51:32

సామ్యవాదులకూ సన్నిహితుడు

సామ్యవాదులకూ సన్నిహితుడు

  • సోషలిస్టు తరహా సంస్కర్తగా పీవీకి పేరు
  • స్వతహాగా భూస్వామి.. భూసంస్కరణల వైపు మొగ్గు 
  • అన్ని రాజకీయ పక్షాలకు సన్నిహితుడు
  • కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం
  • గత చరిత్రను వివరించిన సీపీఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు

‘నీరు, నిప్పు కలిసి ఉంటాయా..? భూస్వామి, సామ్యవాది ఒక్కటిగా ఉండగలరా..? మొదటిది అసాధ్యం.. రెండవది సుసాధ్యం.. మాజీ ప్రధాని రాష్ట్ర నేత నుంచి ప్రధానిగా ఎదిగే వరకు ఆయనకు ఎంతోమందితో సత్సంబంధాలు ఉండేవి..  ఆ కాలంలో కమ్యూనిస్టులు, కాంగ్రేసోళ్లు ఉప్పూ నిప్పులా ఉండేవాళ్లు.. అయితే.. వేళ్లపై లెక్కపెట్టగలిగినంత మంది భూస్వాములు మాత్రమే సంస్కరణవాదులుగా సామ్యవాదులతో సన్నిహితంగా మెలిగేవారు.. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి పీవీ నరసింహారావు.. ఆయనకు కమ్యూనిస్టు కీలక నేత చండ్ర రాజేశ్వరరావుకు ప్రత్యేక అనుబంధం ఉండేది..’ అని ఆయనకు తెలిసిన విషయాలను వెల్లడించారు సీపీఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు.. వివరాలు ఆయన మాటల్లోనే.

    -ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ


పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయనను ప్రత్యక్షంగా కలుసుకున్నాను. అప్పుడు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మన రాష్ర్టానికే చెందిన చండ్ర రాజేశ్వరరావు(సీఆర్‌) ఉన్నారు. ఆయనకు, పీవీ నరసింహారావుకు మధ్య అత్యంత సాన్నిహిత్యం, అనుబంధం ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికి హైదరాబాద్‌కు పీవీ వచ్చారు. లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో ఉన్నారు. అప్పుడు నేను సీపీఐ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నాను. సీఆర్‌ను పీవీ కలుసుకోవాలని అనుకుంటున్నారని వర్తమానం వచ్చింది. చండ్ర రాజేశ్వరరావు గారు, నేను కలిసి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు వెళ్లాం. ముఖ్యమంత్రి నేదురుమెల్లి జనార్ధన్‌ రెడ్డి అక్కడే ఉన్నారు. సీఆర్‌ (చండ్ర రాజేశ్వరరావు) వచ్చారని తెలుసుకుని గెస్ట్‌హౌస్‌ నుంచి ఆయన బయటకు వచ్చి మా ఇద్దరినీ తోడ్కొని పీవీ వద్దకు తీసుకెళ్లారు. వయస్యురీత్యా పీవీ నరసింహారావుకన్నా కూడా చండ్ర రాజేశ్వరరావే పెద్దవారు. అలా కూడా ఆయనంటే పీవీకి గౌరవభావం ఉండేది. అక్కడ పీవీ, సీఆర్‌ సుమారు 30 నిమిషాలపాటు సమావేశమయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చించారు.

నంద్యాలలో పోటీకి మద్దతు..

తెలుగు రాష్ట్రం నుంచి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన పీవీపై అన్ని రాజకీయ పక్షాలకు (కమ్యూనిస్టులు సహా) సానుకూల భావన ఉండేది. ఆయన కూడా రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులతో సన్నిహితంగా ఉండేవారు. అప్పటికే ప్రధానిగా ఎన్నికైన పీవీ పార్లమెంట్‌ ఉభయ సభల్లో సభ్యుడు కాదు. లోక్‌సభకు పోటీ చేయాల్సిన అవసరమొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచే పోటీ చేస్తే బాగుంటుందని అన్ని పార్టీలు భావించాయి. రాజకీయ సమీకరణాల్లో భాగంగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి కొనసాగుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పీవీని పోటీ చేయిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఆయన ఉన్నారు. పీవీని హైదరాబాద్‌లో చండ్ర రాజేశ్వరరావు, నేను కలిశామని ఇందాక చెప్పాను కదా.. ఇప్పడు మళ్లీ అక్కడికే వస్తాను. “ప్రధానిగా ఉన్న పీవీ గారిని నంద్యాల నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నాం” అని చండ్ర రాజేశ్వరరావుతో సీఎం నేదురుమల్లి చెప్పారు. అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు సాగుతున్న ప్రయత్నాలను వివరించారు. పీవీ, సీఆర్‌ సమావేశమయ్యారన్న  వార్తను సీఎం నేదురుమల్లి మరోవిధంగా వాడుకున్నారు. ‘భూసామ్యవాదిగా పేరొందిన పీవీకి సీపీఐ కూడా మద్దతు ఇస్తున్నది. వారిద్దరి సుదీర్ఘ సమావేశ సారాంశం ఇదే’ అన్నట్లుగా ప్రసార మాధ్యమాల ద్వారా జనంలోకి సంకేతాలను పంపించాలన్నది సీఎం జనార్దన్‌రెడ్డి ప్లాన్‌. ముఖ్యమంత్రిగా ఉన్న పీవీని కాంగ్రెస్‌ అధిష్ఠానం గతంలో అర్ధాంతరంగా తొలగించిందని, ఆయనకు అన్యాయం చేసిందని రాష్ట్రంలోని చాలా రాజకీయ పక్షాల్లో అప్పట్లో బలమైన అభిప్రాయం ఉండేది. సాధారణంగా సీపీఐ నాయకుల్లోనూ ఇదే భావన ఉంది. ఈ నేపథ్యంలో, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ మేం నలుగురం (పీవీ, సీఆర్‌, సీఎం, నేను) సుమారు అరగంటపాటు సమావేశమవడంతో, పీవీకి సీపీఐ మద్దతు తెలపనుందని అప్పట్లో ప్రసార మాధ్యమాల్లో వార్తలొచ్చాయి.


తెలంగాణ ఉద్యమంపై మమకారం

తెలంగాణ తొలి దశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. అప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు ఉన్నారు. తెలంగాణ బిడ్డగా ఆ ఉద్యమాన్ని అణచివేయాలన్న కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశాలను అమలు చేసేందుకు ఆయన మనసు అంగీకరించలేదేమో..! ఆ ఉద్యమంపై ఆయన ఉదాసీనంగా ఉన్నారు. సహజంగానే ఇది అధిష్టానానికి నచ్చనట్టుంది. సీఎం కుర్చీ నుంచి పీవీని తొలగించింది. ఆ తరువాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. కేంద్రంలో అనేక పదవులు చేపట్టి, వాటికి వన్నెలు అద్దడం ద్వారా తెలుగు వారికి ఖ్యాతిని తీసుకొచ్చారు. కొన్నాళ్ల తరువాత రాజకీయాల నుంచి విరమించుకోవాలని, లోకసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు. ఆ తరుణంలోనే, రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. ఆ తరువాతి రాజకీయ పరిణామాల్లో అనివార్యంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ప్రధానిగా ఎన్నికయ్యారు. నేను ముందే చెప్పినట్లుగా.. ఆయన అందరి మనిషి. కాంగ్రెస్‌ పార్టీలో అగ్ర నేతగా, సీఎంగా ఉంటూనే కష్టజీవుల పక్షపాతిగా నిలిచారు. స్వపక్షంలో ఎంతోమంది, ఎంత గట్టిగా వ్యతిరేకించినా కూడా లెక్కచేయకుండా భూసంస్కరణలు తీసుకొచ్చారు. ఇదొక్కటే కాదు, ఇంకా అనేక విషయాల్లో కూడా ఆయన పురోగామి శక్తిగా నిలిచారు. ఈ మొత్తం నేపథ్యం ఫలితంగానే ఆయన కమ్యూనిస్టు నేతలకు దగ్గరయ్యారు. ఆయనలోని సుగుణాలు ఎప్పటికీ ఆదర్శప్రాయం, ఆయన ఎన్నటికీ                                                                            సంస్మరణీయుడు.

logo