శనివారం 26 సెప్టెంబర్ 2020
Khammam - Aug 05, 2020 , 01:45:15

నిండిన కిన్నెరసాని, లంకాసాగర్‌ రిజర్వాయరు

నిండిన కిన్నెరసాని, లంకాసాగర్‌ రిజర్వాయరు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మేజర్‌ ప్రాజెక్టులు, రిజర్వాయర్లన్నీ నెండాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి వరదనీరు అధికంగా చేరడంతో 5 వేల క్యూసెక్కుల నీటిని మంగళవారం దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రిజర్వాయర్‌ నీటిమట్టం 404.8 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 2700 క్యూసెక్కులు ఉండటంతో 5 వేల క్యూసెక్కుల నీటిని డ్యామ్‌సైట్‌ అధికారులు దిగువకు వదిలారు. అలాగే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెనుబల్లి మండలంలోని లంకాసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 16 అడుగులు. మంగళవారం అది పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. ఖమ్మం రూరల్‌ మండలంలోని మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంగళవారం ఒక్కసారిగా మున్నేరు పొంగి ప్రవహించడంతో పరీవాహక గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మున్నేరు, ఆకేరు మీద ఉన్న చెక్‌డ్యాంలు నిండాయి.  

లింగాల-డోర్నకల్‌ మధ్య నిలిచిన రాకపోకలు

కామేపల్లి మండలంలోని పొన్నేకల్‌ బుగ్గవాగు, ముచ్చర్ల నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పొన్నేకల్‌ బుగ్గవాగు వద్ద రహదారిపై వరద నీరు బాగా ప్రవహిస్తుండడంతో మంగళవారం లింగాల-డోర్నకల్‌ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామేపల్లి పెద్దచెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. అలాగే కారేపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలోని బాణోతు భీముడుకు రేకుల ఇల్లు కూలిపోయింది. 

-ఖమ్మం రూరల్‌/ పెనుబల్లి/ 

పాల్వంచ రూరల్‌/ కామేపలి/ కారేపల్లి రూరల్‌logo