శనివారం 08 ఆగస్టు 2020
Khammam - Aug 02, 2020 , 01:31:08

వాహ్ తీజ్‌

వాహ్ తీజ్‌

  • పల్లెల్లో ప్రారంభమైన వేడుకలు
  • గిరిజన సంస్కృతికి ప్రతీక
  • అవివాహిత యువతుల ఆశల వేదిక
  • తండాల్లో మొదలైన సందడి
  • తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు

అదొక చిన్న పల్లెటూరు. పెళ్లీడుకొచ్చిన అక్కడి అమ్మాయిలంతా అందంగా అలంకరించుకుని అలా.. అలా సరదాగా పంట చేలల్లోకి షికారుకెళ్లారు. అక్కడక్కడ రేగు చెట్లు. వాటిపై నిగనిగలాడుతున్న పండ్లు. ఒక్కో అమ్మాయి ఒక్కో చెట్టు వద్దకు వెళ్లి, ఒడుపుగా పండ్లను పట్టుకోబోతున్నది.

అంతలోనే అబ్బాయిలు వచ్చారు. ఆ అమ్మాయిలు పండ్లను పట్టుకోబోతుంటే.. చెట్టును ఊపేస్తున్నారు. పండ్లు అందకుండా ఆటంకం కలిగిస్తున్నారు.. ఆట పట్టిస్తున్నారు.

పాపం.. ఆ అమ్మాయిలు అలిసిపోయారు..! ‘బాబ్బాబు.. ప్లీజ్‌.. ప్లీజ్‌..’ అంటూ బతిమిలాడారు. అసలే అమ్మాయిలు.. అంతగా అడిగితే ఆ అబ్బాయిలు కాదనకుండా ఉంటారా..?! సరేనంటూ వదిలేశారు. ‘హమ్మయ్య..’ అనుకుంటూ ఆ పడతులంతా ఛెంగు ఛెంగున లేడి పిల్లల్లా గెంతుకుంటూ వెళ్లారు..!

భలే.. భలేగా ‘టీజ్‌' చేశామని ఆ అబ్బాయిలు సంబరపడ్డారు..!!

సరదా.. సరదాగా ఉందీ ‘తీజ్‌' అని ఆ అమ్మాయిలు చిరునవ్వులు పూయించారు...!!!

వారి అల్లరిని.. ఆటపాటలను చూస్తున్న ఆ పల్లెటూరి పెద్దలంతా పట్టరాని సంతోషంతో మనసులోనే ఇలా అనుకున్నారు..

సుజాతనగర్‌/లక్ష్మీదేవిపల్లి: ‘కన్నాయిలోలరా... నాయక్‌ బాపు హుస్సురా... బేటీకి తీజ్‌ బోరాయేరో... బేటీకి అస్సయిస్స లీదిరో నాయక్‌ బాపూ హుస్సురా...’ అంటూ మొదటి పాటతో మొదలైన తీజ్‌ పండుగ తొమ్మిది రోజులపాటు (బతుకమ్మ తరహాలో) కనువిందుగా సాగనుంది. ఇప్పటికే ప్రారంభమైన ఉత్సవాలతో తండాలు సందడిగా మారాయి. గిరిజన సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలు, లండాడీ యువతుల ఆటపాటలతో హోరెత్తుతున్నాయి. లంబాడీలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో తీజ్‌ (మొలకల పండుగ) ప్రత్యేకమైంది. ఆషాఢ మాసం చివరి నుంచి (శనివారం) శ్రావణ మాసం రెండోవారం (ఆదివారం) వరకు తొమ్మిది రోజులపాటు కోలాహలంగా కొనసాగుతుంది. పెళ్లికాని యువతులు ఈ తొమ్మిది రోజులపాటు నియమ నిష్టలతో సేవాలాల్‌ మహారాజ్‌, దండి మేరామాయాడీలను పూజిస్తారు. జాతేర్‌ అమ్మాయిలు.. వడ్తియా అబ్బాయిలకు (వివాహానికి అనుమతి ఉన్న రెండు వర్గాలు) మధ్య జరిగే మధురాతి మధురమైన వేడుక ఇది.

రెండోరోజు...

రెండోరోజున ఆ ఆడ పిల్లలను నాయక్‌ పిలిపిస్తాడు. తీజ్‌ కోసం వెదురు బుట్టలను తయారు చేయాలని, ఆవు పేడతో చేసిన పిడకలు, ఇతర పదార్థ్దాలను కలిపి దంచి ఎరువు తయారు చేయాలని ఆదేశిస్తాడు. ఆయన చెప్పినట్లుగా ఆ అమ్మాయిలంతా తండా శివారులోని నీటి వనరు నుంచి ఇసుక, పుట్ట మన్ను తెచ్చి ఆ బుట్టల్లో పోసి ఇళ్లకు వెళతారు. సాయంత్రం మళ్లీ ఆ నాయక్‌ ఇంటికి తమ తల్లిదండ్రులతో కలిసి వస్తారు. బుట్టలు పెట్టేందుకు మంచె వేస్తారు. ఒక్క తాటిపై వరుస క్రమంలో బుట్టలు కట్టి, నానబెట్టిన గోధుమలను వాటిలో చల్లుతారు. ఆ తర్వాత చెరువు నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తారు. ఇలా ఇక్కడి నుంచి తొమ్మిది రోజులపాటు వాటిని ఎంతో పవిత్రంగా కాపాడతారు. రోజుకు మూడుసార్లు స్నానం చేసి ఉపవాసం ఉండి నీళ్లు తెచ్చి పోస్తూ తీజ్‌(మొలకలు)ను పెంచుతారు. ఒక్కో బుట్టపై ఒక్కో యువతి పేరు రాస్తారు. 

ఏడోరోజు... 

 ఆ పడతులు ఉదయాన్నే శనిగలు నానబెడతారు. ఆ తరువాత వాటిని తీసుకుని సమీపంలోని పంట చేలల్లో రేగు చెట్లకు కాచిన పండ్లకు గుచ్చేందుకు బయల్దేరతారు. ఆ ఆడ పిల్లలకు వరుసైన యువకులు వారిని అనుసరిస్తూ వెళతారు. ఆ అమ్మాయిలు శనిగలను రేగు పండ్లకు గుచ్చడానికి ప్రయత్నిస్తుంటే.. అడ్డుకుంటూ ఆటపట్టిస్తారు. ఇలా కాసేపు సరదా సరదాగా ఆడతారు. చివరికి, అమ్మాయిలు బతిమిలాడుకుంటారు. సరేనంటూ అబ్బాయిలు వదిలేస్తారు. ఆ తర్వాత ఆ పడతులు శనిగలను రేగు పండ్లకు గుచ్చి తమ ఇళ్లకు వెళతారు. తమ ఇళ్ల నుంచి కొంత బియ్యం సేకరించి రొట్టెలు తయారుచేస్తారు. అందులో బెల్లం కలిపి ప్రసాదం (చుర్మో) సిద్ధం చేస్తారు. అనంతరం నాయక్‌ ఇంటికి వెళ్లి, ఆ ప్రసాదంలో నెయ్యి వేసి ముద్దలు కట్టి ఒకరికొకరు మార్చుకుంటారు. ఆ ముద్దలను తీజ్‌ బుట్టల ముందు పెడతారు. ఆ రాత్రంతా డప్పు చప్పుళ్ల మధ్య ఆటపాటలతో సందడి చేస్తారు& కోలాహలం సృష్టిస్తారు. 

ఎనిమిదో రోజు... 

 ఆడపిల్లలంతా కలిసి నాయక్‌ ఇంటికి వచ్చి అక్కడి నుంచి చెరువు వద్దకు వెళ్లి ఎర్ర మట్టి సేకరిస్తారు. మట్టితో మగ మనిషి, ఆడ మనిషి (సేవాభయా, దండి మేరామా యాడీ ప్రతిమలు) బొమ్మలను తయారు చేస్తారు. వాటిని ‘గణ్‌గోర్‌'గా పిలుస్తారు. సంప్రదాయ దుస్తులు వేసి అందంగా ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత నాయక్‌ ఇంటికి చేరుకుని బియ్యం, బెల్లంతో కలిపిన ప్రసాదం (లాప్సీ) ముద్దలుగా చేసి బుట్టల ఎదుట పెడతారు. మోదుగాకులతో ఐదు దోనెలు చేసి, అందులో కొంత తీజ్‌ పోసి, వాటిని కూడా బుట్టల ముంద పెడతారు. అనంతరం గణ్‌గోర్‌గా తీసుకు వచ్చేందుకు డప్పుచప్పుళ్లతో వెళ్తారు. అక్కడ ఆడిపాడి ఆనందోత్సాహాలతో సాయంత్రం వరకు నాయక్‌ ఇంటికి తెస్తారు.

మొదటి రోజు...

 అవివాహిత యువతులు తండాల్లోని నాయక్‌ ( పెద్ద) ఇంటికి పాటలు (కన్నాయిలోలరా.. నాయక్‌ బాపు హుస్సురా... భేటీకి తీజ్‌ బోరాయేరో... భేటీకి అస్సయిస్స లీదిరో నాయక్‌ బాపు హుస్సురా..) పాడుతూ వెళ్తారు. అక్కడ నాయక్‌ తీజ్‌ మొదలుపెడతారు. ఇలా మొదలైన తీజ్‌ సంబురాలు తొమ్మది రోజులపాటు కొనసాగుతాయి. తొలి రోజు సాయంత్రం తండాల్లోని అవివాహిత యువతులు గోధుమలను సేకరించి నాయకుడి (నాయక్‌) ఇంటికి చేరుకుంటారు. వాటిని అక్కడ నానబెడతారు. 

బతుకమ్మ తరహాలోనే..

బంజారాల సంస్కృతికి ఈ పండుగ ప్రతీక. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగలో యువతులదే ప్రధాన పాత్ర. మంచి మొగుడు దొరకాలని అమ్మాయిలు, పంటలు సమృద్ధిగా పండాలని పెద్దలు, తమ తండా వాసులంతా (ప్రజలంతా) సుఖ సంతోషాలతో ఉండాలని నాయక్‌లు మనసారా కోరుకుంటూ (బతుకమ్మ తరహాలోనే) తొమ్మిది రోజులపాటు ఈ తీజ్‌ పండుగ చేసుకుంటారు. వెదురు బుట్టల్లో గోధుమలు మొలిపించి తొమ్మిది రోజులపాటు ఉపవాసముండి ఒక్క పూట చప్పిడి ఆహారం తీసుకుని భక్తిశ్రద్ధలతో తీజ్‌ ఆడతారు.

చివరి రోజున ఘనంగా నిమజ్జనం...

 ఈ పండుగ చివరి రోజు వేడుక కోలాహలంగా.. సందడి సందడిగా సాగుతుంది. ఆ రోజు ఉదయాన్నే తండా నాయక్‌ సేవాభాయా పేరుతో ఇంట్లో వేప చెట్టుకు పెద్ద జెండా కడతారు. లాప్సీ వండి కడావో చేస్తారు. సేవాభాయాకు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పిస్తారు. దండిమేరామా పేరు మీద యాటను కోసి పండుగ చేసుకుంటారు. సాయంత్రం తండావాసులను నాయక్‌ పిలుస్తాడు. సన్నాయి డప్పు చప్పుళ్లతో జెండా వద్ద, గోధుమ బుట్టల వద్ద కొబ్బరికాయలు కొట్టి బుట్టలను కిందికి దించుతారు. అనంతరం, ఏ అమ్మాయి బుట్టను ఆ అమ్మాయికి ఇస్తాడు. ఈ క్రమంలోనే.. పెళ్లి కాబోతున్న ఆడపిల్లలు వాటిని నిమజ్జనం చేసేందుకు నిరాకరిస్తారు. వారికి తండా పెద్దలు నచ్చజెప్పి పెళ్లి ప్రాధాన్యాన్ని వివరిస్తారు. ఆ తర్వాత ఆడ పిల్లలంతా కలిసి పెద్దలను వరుసలో కూర్చొబెట్టి బుట్టల్లో తీజ్‌ను కొంత తెంచి పెద్దల పాకిడి (తల రుమాలు) పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. అనంతరం అమ్మాయిల అన్నలు, తమ్ముళ్లు తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేసి తండా నాయక్‌ ఇంటికి చేరుకుంటారు. మళ్లీ మళ్లీ తీజ్‌ ఇలాగే కొనసాగాలని కోరుతూ సంబురాలు చేసుకుంటారు. అంతటితో తీజ్‌ పండుగ ముగుస్తుంది. 


logo