బుధవారం 05 ఆగస్టు 2020
Khammam - Aug 01, 2020 , 00:14:32

కఠిన పరిస్థితులు ఎదురైనా కరోనాను ఎదుర్కొంటాం

కఠిన పరిస్థితులు ఎదురైనా  కరోనాను ఎదుర్కొంటాం

  • u ఖమ్మం జిల్లా ఆసుపత్రి.. ప్రజల విశ్వాసాన్ని పొందింది
  • u వైరస్‌ పట్ల ప్రజలను భయబ్రాంతులకు గురి చేయొద్దు
  • u వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షలో మంత్రి ఈటల

ఖమ్మం: కొవిడ్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ఎటువంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. వైద్యాధికారులు ఒత్తిడికి గురికాకుండా మనోధైర్యంతో, ఆత్మైస్థెర్యంతో పనిచేయాలని సూచించారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో కొవిడ్‌, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ చర్యపై జిల్లా వైద్యాధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ నియంత్రణకు జిల్లాలో చేపట్టిన చర్యలపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఐదు నెలలుగా రాష్ట్రంలోని వైధ్యాధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు గుర్తించారని, ఖమ్మంలో కూడా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి జిల్లా ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని పొందిందని అన్నారు. వైరస్‌ను నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని, రాబోయే రోజుల్లో కేసులను కూడా తట్టుకొని వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మన జీవన విధానాలు, బౌగోళిక పరిస్థితుల వల్ల మనకు ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటున్నదని, కరోనా వైరస్‌ను ఇది తట్టుకోగలుగుతున్నదని అన్నారు. పీహెచ్‌సీల్లో ఐసోలేషన్‌ సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని కూడా నిరంతరం పరీక్షిస్తుండాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు.

72 బెడ్లతో ప్రత్యేక కొవిడ్‌ వార్డు : మంత్రి అజయ్‌

ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ట్రూనాట్‌, మమత ఆసుపత్రిలో ఆర్‌టీపీసీఆర్‌ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అజయ్‌కుమార్‌ తెలిపారు. అలాగే క్రిటికల్‌ పేషంట్ల కోసం 72 బెడ్లతో ప్రత్యేక కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేశామన్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా కొవిడ్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేశామన్నారు. జిల్లా ఆసుపత్రిలోని ట్రామా కేర్‌ సెంటర్‌లో 170 బెడ్లతో కొవిడ్‌ వార్డు ఇప్పటికే సేవలందిస్తోందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఖమ్మంలో సేకరించిన శ్యాంపిల్స్‌ను వరంగల్‌కు పంపించే వాళ్లమని, శుక్రవారం నుంచి ఖమ్మంలోనే ట్రూనాట్‌, ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నామని అన్నారు. అపోహలను, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ నామా 

కరోనా నుంచి జిల్లా ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 475 బెడ్లు, ఐసోలేషన్‌లో మరో 500 బెడ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు 62 వెంటిలేషన్‌ బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

400 బెడ్లను సిద్ధంగా ఉంచాం : కలెక్టర్‌ కర్ణన్‌

కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణణ్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా 400 బెడ్లను సిద్ధంగా ఉంచామని, 75 ఐసీయూ, 60 వెంటిలేషన్‌ బెడ్లు కూడా ఉన్నాయని వివరించారు. మద్దులపల్లి వైటీసీలో మరో 100 బెడ్లు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ సూచనల ప్రకారం డాక్టర్ల భర్తీ ప్రకియను చేపట్టామని, 20 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేపడుతున్నామని చెప్పారు. logo