గురువారం 13 ఆగస్టు 2020
Khammam - Aug 01, 2020 , 00:10:44

24/7 సేవ‌లందిస్తున్నాం..

24/7 సేవ‌లందిస్తున్నాం..

  • ప్రజలకు ధైర్యం కల్పించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
  • n మనిషిని చంపే శక్తి కరోనాకు లేదు
  • n నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మహమ్మారే
  • n ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత అధికారులదే
  • n రాష్ట్రంలో వైద్యులు, మందుల కొరత లేదు
  • n ఖమ్మం జిల్లా వైద్యశాల ప్రజల విశ్వాసాన్ని పొందింది
  • n నగరంలో కరోనా నిర్ధారణ కే్ంరద్రాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  ఈటల రాజేందర్‌
  • n ఖమ్మంలో రోజుకు 400 మందికి టెస్టులు
  • n రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు వైద్యశాఖలోని అన్ని విభాగాలూ 24గంటలూ సేవలందిస్తున్నాయని, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోనే పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కొవిడ్‌ ట్రూనాట్‌ పరీక్షా కేంద్రాన్ని, మమతలో ఆర్‌టీపీసీఆర్‌ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి రాజేందర్‌ మాట్లాడుతూ.. వైరస్‌ నేపథ్యంలో ప్రజలకు ధైర్యం కల్పించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. వైద్యసేవలు అందించడంలో ధనిక, పేద స్థాయి చూడడం లేదని, ఎంతటి ఖరీదైన మందులైనా వినియోగిస్తున్నామని, మందుల కొరత లేదని అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని పొందిందని అన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో కొవిడ్‌, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ చర్యలపై జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని నిరంతరం పరీక్షిస్తుండాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు.  

 ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు వైద్యశాఖలోని అన్ని విభాగాలూ 24/7 సేవలందిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ధైర్యం కల్పించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రస్తుత తరుణంలో కొవిడ్‌ కూడా త్వరగా విస్తరించే ప్రమాదం ఉన్నందున ఆశవర్కర్ల నుంచి మొదలుకొని సూపరింటెండెంట్‌ స్థాయి వరకూ థర్మల్‌ స్కానర్స్‌, పల్స్‌ అక్సీమీటర్లను అందించామని వివరించారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. ఇంటింటి సర్వే చేసి కరోనా లక్షణాలు ఉన్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. ర్యాపిడ్‌ యాంటీ జెన్స్‌ కిట్లను కూడా పీహెచ్‌సీ స్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. వైరస్‌ నియంత్రణలో భాగంగా అవసరమైన చోట అదనపు వైద్యులను కూడా నియమించామన్నారు. వైద్య సేవలు అందించడంలో ధనిక, పేద స్థాయిలను చూడడం లేదని, ఎంతటి ఖరీదైన మందులైనా వినియోగిస్తున్నామని, మందుల కొరత కూడా లేదని వివరించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి.. జిల్లా ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని పొందిందని అన్నారు. జిల్లా ఆసుపత్రికి మంచి ఒరవడి, సంప్రదాయం ఉన్నాయన్నారు. అవి అలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. కరోనా వల్ల కలిగే మరణాల సంఖ్య ఎక్కువగా లేదని స్పష్టం చేశారు. నూటికి 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలూ లేకుండానే పాజిటివ్‌ నమోదు అవుతున్నదని అన్నారు. మిగిలిన 19 శాతంలో కూడా 14 శాతం మందికి లక్షణాలు ఉంటాయన్నారు. 5 శాతం మందికి నిర్లక్ష్యం వల్లగానీ లేదా ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్లగానీ పాజిటివ్‌ వస్తున్నదని మంత్రి అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ట్రూనాట్‌ వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని, మమత జనరల్‌ ఆసుపత్రిలో ఆర్‌టీపీసీఆర్‌ వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వివరించారు. అలాగే క్రిటికల్‌ పేషంట్ల కోసం 72 బెడ్లతో ప్రత్యేక కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ 300 నుంచి 400 వరకూ టెస్టులు చేసే సామర్థ్యం కూడా ఈ కేంద్రాలకు ఉందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. క్రిటికల్‌ పేషంట్లకు చికిత్స అందించేందుకు ఐసీయూ సౌకర్యంతో కలిపి 400 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాకు ఇప్పటికే 6వేల ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ కిట్‌లను వైద్య ఆరోగ్యశాఖ పంపిణీ చేసిందని, ప్రతీ పీహెచ్‌సీకి వాటిని పంపి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని మంత్రి వివరించారు. 75 ఐసీయూ బెడ్లు, 60 వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ వివరించారు. దీంతోపాటు మద్దులపల్లిలోని వైటీసీలో మరో 100 బెడ్లు కూడా ఉన్నాయని, లక్షణాలు లేని వారికి, మైల్డ్‌ లక్షణాలు ఉన్న వారికి ఆ బెడ్లను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. దీనికి అదనంగా ఇంజినీరింగ్‌ , సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలల్లో మరో 500 బెడ్లతో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, కేఎంసీ మేయర్‌ డాక్టర్‌ జీ.పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ రమేష్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బీ.వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి సైదులు, డీఎస్‌ఓ డాక్టర్‌ కోటిరత్నం, ఆర్‌ఎంఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జయశంకర్‌ సార్‌ విగ్రహం

ఖమ్మం : టీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయ ఆవరణలో నూతనంగా స్థాపించిన తెలంగాణ ఉద్యమ పితామహుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ విగ్రహాన్ని మంత్రులు మంత్రి ఈటల రాజేందర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నాటి సారథి కేసీఆర్‌కు వెన్నంటి ఉండి పోరాటాన్ని నడిపించిన మహాన్నతుడు జయశంకర్‌ సార్‌ అని కొనియాడారు. అనంతరం కార్యాలయం మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథౠలయ సంస్థ దిండిగల రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, రడం సురేష్‌గౌడ్‌, కార్పొరేటర్లు షౌకత్‌అలీ, రుడావత్‌ రమాదేవి, ఊటుకూరి లక్ష్మీసుజాత, రవికాంత్‌, ఉద్యమ నాయకులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్‌, నందిగామ రాజ్‌కుమార్‌, నవీన్‌, రజనీకాంత్‌, శేషు, చింతనిప్పు కృష్ణచైతన్య పాల్గొన్నారు.logo