బుధవారం 05 ఆగస్టు 2020
Khammam - Jul 16, 2020 , 00:31:48

‘రైతుబంధు’ను వెంటనే అందించాలి

‘రైతుబంధు’ను వెంటనే అందించాలి

  •  రైతువేదికల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలి
  •   ప్రతి మండలానికీ ఒక నోడల్‌ అధికారిని నియమించాలి
  •  ప్రతి మున్సిపాలిటీ పరిధిలో నర్సరీలు నిర్వహించాలి
  • వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ 
  • 129 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు: ఖమ్మం కలెక్టర్‌

ఖమ్మం: జిల్లాల్లో రైతులకు వానకాలం రైతుబంధు సాయం అందించేందుకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రైతు వేదికల నిర్మాణాల పనులను త్వరతిగతిన పూర్తి చేసి ప్రారంభించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో కలెక్టర్లు క్షేత్ర సాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కింద నిర్మితమవుతున్న వైకుంఠధామాలు, రైతు వేదికలు, డంపింగ్‌ యార్డులు తదితర పనులను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికీ నోడల్‌ అధికారిని నియమించాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాఫ్తి చెందుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణకు మొదట ప్రాధాన్యమివ్వాలని, సీజనల్‌ వ్యాధులను నియంత్రించేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో నర్సరీలు నిర్వహించాలని, మున్సిపల్‌ నిధుల నుంచి 10 శాతం గ్రీనరీ కోసం తప్పనిసరిగా ఖర్చు చేయాలని సీఎస్‌ సూచించారు. 

129 క్లస్టర్లలో నిర్మాణాలు: ఖమ్మం కలెక్టర్‌ 

జిల్లాలో రైతు వేదికలు, కల్లాల నిర్మాణాల ప్రతిపాదనలు, రైతుబంధు జమ, విలీన గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ సీఎస్‌కు వివరించారు. జిల్లాలో 129 క్లస్టర్లలో రైతు వేదిక నిర్మాణాలు చేపడుతున్నామని, ఇప్పటికే 51 క్లస్టర్లలో వేదికల నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు. రూ.16.23 కోట్లతో కల్లాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కేఎంసీతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లోని విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నూతన వ్యవసాయ గోదాములు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు స్థలాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్లు స్నేహలత, ఎస్‌.మధుసూదన్‌, కేఎంసీ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డీఆర్‌డీవో ప్రవీణ, డీఏవో విజయనిర్మల, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి, పీఆర్‌ ఈఈ చంద్రమౌళి, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల కమిషనర్లు శ్రీనివాస్‌, సుజాత, సైదులు పాల్గొన్నారు.


logo