బుధవారం 05 ఆగస్టు 2020
Khammam - Jul 16, 2020 , 00:26:28

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

  • పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
  • బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  •  ప్రాణం పోసుకుంటున్న  పత్తి, పునాస పంటలు
  • వరినాట్లు, మిర్చి సాగుకు అనుకూలం

ఖమ్మం ప్రధాన ప్రతినిధి నమస్తే తెలంగాణ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటికే సాగు పూర్తి చేసుకున్న పత్తి పంటకు ప్రాణం పోసినైట్లెంది. అదే విధంగా పునాస పంటలైన పెసర, కంది, పెసర పంటలకు వరుణుడు జీవం పోసినైట్లెంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో రెండు జిల్లా కేంద్రాలైన ఖమ్మం, కొత్తగూడెం నగరాలలో ప్రధాన వీధులు జలమయం అయ్యాయి. అదే విధంగా భద్రాచలం, ఇల్లందు, సత్తుపల్లి, మధిర, మణుగూరు, వైరా తదితర పట్టణాలలో ప్రజలు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు. గడిచిన 24 గంటల్లో  ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 14.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఎర్రుపాలెం మండలంలో 56.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాబడినది.  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా  మంగళవారం రాత్రి నుంచి కుండపోతగా కురవడంతో జిల్లాలోని చెరువులు, చెక్‌డ్యాంలు, వాగులు పొంగి ప్రవహించాయి. పాల్వంచలో అత్యధికంగా 65.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా భద్రాచలంలో 3.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురియడంతో జిల్లాలో సరాసరి 20.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. లక్ష్మిదేవిపల్లి మండలం రేగళ్లలో రహదారిపై వర్షపు నీరు పారింది. పాల్వంచలో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో లోతట్టుప్రాంతాల్లో ఉన్న ప్రజలు నీటిని తోడుకోవాల్సి వచ్చింది. కిన్నెరసానిలో భారీగా వరదనీరు చేరింది. గుండాలలో కూడా 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో అక్కడ వాగులు పొంగి ప్రవహించాయి. పినపాక, చర్ల మండలాలు మినహా అన్ని మండలాల్లో అంచనాకు మించి వర్షం కురిసింది. దీంతో రైతులు పొలం పనుల్లోపడ్డారు. భద్రాచలంలో గోదావరి వరద స్వలంగా పెరుగుతుంది.  ఉదయం ఏడు గంటలకు 13.3 అడుగులు వరదనీరు చేరింది. భారీ వర్షాలకు జిల్లాలో కొత్తగూడెం,మణుగూరు,ఇల్లందు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు ప్రకటించారు.  వరినారు మళ్లు పోసుకున్న రైతులు నాట్లు వేసుకునేందుకు కలిసి వస్తుందని  పేర్కొంటున్నారు. 

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కరిసిన వర్షానికి  గోదావరి నది వరద స్పల్పంగా పెరుగుతుంది. కిన్నెరసాగు ప్రాజెక్టుకు సైతం వరద తాకిడి కొనసాగుతుండగా, ఖమ్మం నగరం సమీపంలోని మున్నేరు వాగుకు వరద నీరు పోటెత్తడంతో  మున్నేరు పరవళ్లు తొక్కింది. టేకులపల్లి మండలంలోని మరుట్ల పరకాల ప్రాజెక్టు అలుగు దశకు చేరుకుంది. ఎర్రుపాలెం మండలం రేచర్ల గ్రామం మధ్యలో ఉన్న కొండవాగు పొంగి ప్రవహించింది. పాలేరు, వైరా, లంకసాగర్‌  ప్రాజెక్టులకు సైతం వరద నీరు చేరింది. ఇకపోతే బేతుపల్లి పెద్ద చెరువు, మధిర చెరువు, సత్తుపల్లి, అశ్వారావుపేట, మణుగూరుప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. బోనకల్‌, వేంసూరు, చంద్రుగొండ,ముల్కలపల్లి, పాల్వంచ మండలాల్లో   చెరువులు అలుగు దశకు చేరుకోవడం విశేషం. 

విస్తారంగా వర్షాలు

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో అన్ని మండలాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం బుధవారం తెల్లవారు జామున భారీ వర్షంగా మారింది. దీంతో కొత్తగూడెం జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. తెల్లవారుజామున కురిసిన వర్షానికి పాల్వంచలోని 221వ నంబర్‌ జాతీయ రహదారిపై భారీ ఎత్తున నీళ్లు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాల్వంచలో భారీ వర్షానికి పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాలేటివాగు, మొర్రేడవాగు, రామవరంలోని గోధుమవాగు, పర్ణశాల గౌరారం వద్ద ఉన్న చిన్నగుబ్బలమంగి వాగులు పొంగి ప్రవహిస్తుంది. కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. నిన్నకురిసిన వర్షానికి కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి భారీగా నీరు వచ్చి చేరడంతో అధికారులు మంగళవారం రాత్రి 10 గంటలకు 2 గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పర్ణశాల, భద్రాచలం వద్ద గోదావరిలో కూడా నీటిమట్టం స్వల్పంగా పెరుగుతూ వస్తుంది. ఈ భారీ వర్షాలకు కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోని గనులు, ఓసీల ద్వారా జరిగే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం తలెత్తింది. ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో వరదనీరు వచ్చి చేరడంతో మోటార్ల సాయంతో నీటిని బయటికి పంపిస్తున్నారు.  

కిన్నెరసాని రిజర్వాయర్‌ గేట్లు ఎత్తివేత :  పాల్వంచ మండలంలో ఉన్న కిన్నెరసాని రిజర్వాయర్‌ రెండు గేట్లు ఎత్తి సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్‌ నీటిమట్టం 407 అడుగులు కాగా ఇప్పటికీ 404.10 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి.


logo