బుధవారం 05 ఆగస్టు 2020
Khammam - Jul 16, 2020 , 00:18:44

కొవిడ్‌ బాధితులకు వైద్యుల భరోసా

 కొవిడ్‌ బాధితులకు వైద్యుల భరోసా

వైద్యంతో పాటు మనోధైర్యం కల్పిస్తున్న డాక్టర్లు

ఆధునిక సౌకర్యాలతో పెద్దాసుపత్రిలో వైద్యసేవలు

త్వరగా కోలుకుంటున్న బాధితులు

కొవిడ్‌ బాధితులకు వైద్యులు భరోసా కల్పిస్తున్నారు.. మానసిక ఒత్తిడితో కుంగిపోతున్న వారికి వైద్యం అందించడమే కాకుండా మనోధైర్యం కల్పిస్తూ మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కొవిడ్‌ను తరిమికొట్టేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ తీవ్రంగా కృషి చేస్తున్నది. పాజిటివ్‌ వచ్చిన వారికి జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డులో మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు.. ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి మొదలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లేదాక కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వైద్యాధికారులు షిఫ్టుల విధానంలో పనిచేస్తూ బాధితులకు ధైర్యాన్ని అందిస్తున్నారు.                                                 మయూరిసెంటర్‌

ప్రభుత్వానికి రుణపడి ఉంటా..

నేను ఢిల్లీలో గిరిజన సంఘం సమావేశానికి వెళ్లాను. ఏప్రిల్‌ 5వ తేదీన నాకు పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మంచి వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించారు. చికిత్స పొందుతున్నప్పుడు ఖమ్మం కలెక్టర్‌, సీపీ ఫోన్‌ చేసి నాలో మనోధైర్యాన్ని నింపారు. నా వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ -19 బారినపడిన నాలాంటి అనేక మందిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది పునర్జన్మను ప్రసాదిస్తున్నది. బలవర్ధక ఆహారం, వేడి నీళ్లు, ఔషధాలు అందించి నా ప్రాణాలు కాపాడింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటా..  

 బానోత్‌ భద్రూనాయక్‌ (ఖమ్మం జిల్లా మొదటి కరోనా బాధితుడు) 

రౌండ్‌ద క్లాక్‌ పద్ధతిలో విధులు..

జిల్లాలోని ప్రధాన ఆసుపత్రిలో మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. రౌండ్‌ ద క్లాక్‌ పద్ధతిలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌, ఎక్స్‌రే టెక్నీషియన్లు, పేషెంట్‌ కేర్‌, శానిటరీ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. బాధితులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కొలుకునే వరకు వీరు చేస్తున్న శ్రమ వెలకట్టలేనిది. ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో వస్తున్న వ్యాధులు, వైరస్‌లను తరిమికొట్టేందుకు చేస్తున్న కృషి ఎనలేనిది. పది రోజుల వరకు ఒక వైద్యాధికారి, పల్మానాలజిస్టులు ఇద్దరు, ఫిజీషియన్‌ ఒక్కరు, పిల్లల వైద్య నిపుణులు ఒక్కరు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 15 మంది సిబ్బంది ఉన్నారు. ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓలు రోజుకు ఆరుగురు, మొత్తం మూడు షిఫ్టులలో 9 మంది పనిచేస్తున్నారు. వీరికి సపోర్టింగ్‌గా మూడు షిఫ్టులలో 10 మంది స్టాప్‌ నర్సులు, సపోర్టింగ్‌ స్టాప్‌ 6, శానిటేషన్‌ కార్మికులు 6, పేషెంట్‌ కేర్‌ సిబ్బంది 6, సెక్యూరిటీ 6, ల్యాబ్‌ టెక్నిషియన్లు 6, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 6, ఎక్స్‌రే టెక్నిషియన్లు ముగ్గురు, ఫార్మాసిస్టులు ముగ్గురు చొప్పున పనిచేస్తూ బాధితుల ఆరోగ్యాలను కాపాడుతున్నారు. 

ప్రభుత్వ వైద్యశాలల పడకల స్థాయి..

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో మొత్తం 200 పడకలున్నాయి. ఇందులో 120 పడకలు పూర్తి ఐసోలేషన్‌తో పాటు సెంట్రలైజ్‌ ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కలిగ ఉన్నాయి. మొన్నటి వరకు ఐసీయూలో 10 పడకలే ఉండగా మరో 40 పడకలను పెంచారు. మొత్తం 200 పడకల్లో ఐసోలేషన్‌, ఐసీయూ విభాగాలకు పడకలు పోను 30 సాధారణ పడకలున్నాయి. ఐసోలేషన్‌ వార్డులో 34 వెంటిలేటర్ల సదుపాయం కూడా ఉంది. 

స్వీయ నిర్బంధం ఇలా.. 

జిల్లాలో కొవిడ్‌ అనుమానితులను స్వీయనిర్బంధం చేసేందుకు మొదట్లో జిల్లావ్యాప్తంగా 385 సర్వేలైన్స్‌ బృందాలు పనిచేస్తున్నది. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం బృందాలు 30 ఉండగా ప్రతి పీహెచ్‌సీకి ఒక బృందం పనిచేస్తుంది. అనుమానితులను క్వారంటైన్‌ చేసేటప్పుడు సరైన స్పందన లేకున్నా, నిబంధనలు పట్టించుకోకుండా ఉండేవారిని గుర్తించేందుకు వైద్య సిబ్బందితో కలిసి రెవెన్యూ, పోలీసులు అనుమానితులను హోం క్వారంటైన్‌ చేస్తున్నారు. ప్రాథమికంగా గుర్తించిన వ్యక్తుల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల వైద్యాధికారి, వైద్యుడు సందర్శించి క్వారంటైన్‌ స్టాంప్‌ వేస్తున్నారు. క్వారంటైన్‌ అయిన వ్యక్తికి, కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారంపై సిబ్బంది సూచనలు చేస్తున్నారు. హోం క్వారంటైన్‌లోని వ్యక్తి ఆరోగ్య స్థితి తెలుసుకునే బృందంలో ఆ పరిధిలోని ఆశ కార్యకర్త, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. హోం క్వారంటైన్‌ చేసిన వ్యక్తి 21 రోజుల ఉండేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  బాధితులకు విటమిన్‌ సి, పారాసిటమల్‌, సిట్రీజిన్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌ మాత్రలను పంపిణీ చేస్తున్నారు.  

జాగ్రత్తలు పాటిస్తేనే వైరస్‌ అంతం..

ప్రజలు చైతన్యవంతులై జాగ్రతలు పాటించినప్పుడే కరోనా వైరస్‌ అంతమవుతుంది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ చేతులు సబ్బుతో కాని, శానిటైజర్‌తో కాని శుభ్రపరుచుకుంటూ మాస్కు విధిగా ధరించాలి. తమ వైద్యారోగ్యశాఖ బృందాలు 21 మండలాల్లో పని చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు త్వరలో సుమారు రూ. 25 లక్షలు విలువ చేసే కోవిడ్‌-19 పరీక్ష యంత్రం (ట్రూనాట్‌) అందుబాటులోకి రానుంది.
- డాక్టర్‌ మాలతి (ఖమ్మం జిల్లా వైద్యాధికారి )  

అందుబాటులో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టు కిట్లు

ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టు కిట్లు ఖమ్మం జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. ఈ టెస్టింగ్‌ కిట్‌ ద్వారా 30 నిమిషాల్లోనే బాధితుడికి పాజిటివ్‌, నెగిటివ్‌గా నిర్థారణ చేస్తుంది. ఖమ్మం జిల్లాలోని జిల్లా ఆసుపత్రికి 500ల టెస్టింగ్‌ శాంపిల్స్‌ కేటాయించగా, పెనుబల్లికి 250, సత్తుపల్లికి 250, అన్ని పీహెచ్‌సీలలో 24 శాంపిల్స్‌ కిట్లను కేటాయించాం. 
-డాక్టర్‌ బి. వెంకటేశ్వర్లు (జిల్లా ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌) 


logo