శుక్రవారం 07 ఆగస్టు 2020
Khammam - Jul 13, 2020 , 04:18:08

మధిరకు గోదారి జలాలు

మధిరకు గోదారి జలాలు

 • ‘సీతారామ’తో  నియోజకవర్గం సస్యశ్యామలం
 • ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు కార్యాచరణ
 • సీఎం కేసీఆర్‌, మంత్రి అజయ్‌ అండతో ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి
 • అభివృద్ధి, ప్రజాసంక్షేమమే మా లక్ష్యం
 • ‘నమస్తే’తో ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌

‘రాజకీయంగా సీఎం కేసీఆర్‌ నాకు మంచి భవిష్యత్తు ఇచ్చారు.. మంత్రి అజయ్‌కుమార్‌ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు.. వారి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నా.. ఖమ్మం జడ్పీచైర్మన్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా.. అలాగే మధిర నియోజకవర్గ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాను.. మంత్రి, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.. సీతారామ ప్రాజెక్టు ద్వారా మా ప్రాంతానికి గోదావరి నీళ్లు తెప్పిస్తాం.. సాగు భూములను సస్యశ్యామలం చేస్తాం..’ అని ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ తెలిపారు.. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన ‘నమస్తే’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..!    

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ :ఎక్కడి గోదావరి నది.. ఎక్కడి మధిర నియోజకవర్గం! ఉమ్మడి పాలనతో వివక్షకు గురైనా ఈ సరిహద్దు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే మ హత్తర కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ ప్రభు త్వం. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురై.. అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న వినూత్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు సాగునీటి కో సం ప్రభుత్వం చేపడుతున్న భగీరథ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో సరిహద్దు నియోజకవర్గాల్లో నూ అభివృద్ధి ఊపందుకుంటున్నది. ఈక్రమంలో ఖమ్మం జిల్లాలో ఆంధ్రా సరిహద్దు నియోజకవర్గమైన మధిరలో చివరి భూములకు సాగునీటి సమృద్ధిగా అందించేందుకు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాతోపాటు, మధిర నియోజకవర్గ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.‘మధిర నియోజకవర్గంలో సీతారామ జలాలను అందించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నాం. సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహకారంతో జిల్లా ను ప్రగతిపథంలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. 

చివరి భూములకూ సాగునీరు..

మెట్ట ప్రాంతమైన మధిర నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే కృత నిశ్చయంతో ఉన్నాం. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితిని అధిగమించే స్థాయి కి చేరుకున్నాం. సాగర్‌ జలాలు అందుబాటులోకి రావడంతో నియోజకవర్గంలోని కొన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వరిసాగు విస్తీర్ణం పెరిగింది. కొత్తగా సీతారామ ప్రాజెక్టు ద్వారా మధిర నియోజకవర్గంలో గోదావరి జలాలను పారించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గోదారి జలాలు మధిర నియోజకవర్గానికి వస్తే.. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా మధిర కొత్తరూపును సంతరించుకోనుంది. 

సీతారామతో ఏటా రెండు పంటలు

సీతారామ ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో నీటి వనరులు అందుబాటులోకి వస్తే మధిర నియోజకవర్గంలో ఏటా రెండు పంటలు పండించేందుకు అవకాశం ఏర్పడుతుంది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఇదే జరిగితే మధిర నియోజకవర్గాల్లోని గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. సాగునీటి కల్పనకు ఇటీవల నా నేతృత్వంలో కాల్వల పూడిక తీత పనులు చేపట్టాం. కాల్వల ఆధునీకరణ ద్వారా మధిర నియోజకవర్గంలో సాగునీటి కల్పనకు అవసరమైన చర్యలను సీఎం కేసీఆర్‌, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహకారం తీసుకుంటున్నాం. 

నియంత్రిత సాగుపట్ల హర్షం..

ప్రభుత్వం నియంత్రిత సాగును ప్రోత్సహిస్తుండటంతో మధిర నియోజకవర్గంలో రైతన్నలు సంతోశం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ పంట పెట్టుబడిని అందించింది ప్రభుత్వం. దీంతో సేద్యానికి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నియోజకవర్గంలోని మండలాల్లోని అన్ని చెరువుల్లో మిషన్‌ కాకతీయతో పూడిక తీయించాం. దీంతో చెరువుల్లో నీటి నిల్వ శాతం పెరిగింది. ఆయకట్టు చివరి భూములకు కూడా సాగునీరు లభ్యమవుతుండటంతో రైతన్నలు వ్యవసాయపనుల్లో నిమగ్నమయ్యారు’ అని ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు వివరించారు.

పునర్జన్మనిచ్చిన సీఎం కేసీఆర్‌

రాజకీయంగా అస్థిరత ఎదుర్కొంటున్న సమయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నత పదవినిచ్చి నాకు రాజకీయ పునర్జన్మనిచ్చారు. ప్రధానంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహకారంతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకునే వీలు లభించింది. రాజకీయంగా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందడంతో అంతా నిరుత్సాహానికి గురయ్యారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ నాపై నమ్మకం ఉంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను చేశారు. ఇలా జిల్లా ప్రజలకు సేవలు చేసే అవకాశం లభించింది. మధిర మున్సిపాలిటీని గెలిపించుకోగలిగాం. జడ్పీటీసీలను గెలిపించుకున్నాం. సాగునీటి కల్పనకు చర్యలు తీసుకుంటున్నా. జిల్లా సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా సహకారం అందిస్తున్న వారికి కృతజ్ఞతలు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రణాళికను రూపొందించి అమలు చేస్తా.

చేపట్టిన అభివృద్ధి పనులు..

 • ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా తనను సీఎం కేసీఆర్‌ ఎంపిక చేసి.. జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారని కమల్‌రాజు తెలిపారు. మధిర ప్రాంతంలో విద్యా, వైద్యాభివృద్ధికి అవసరమైన పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 
 •    జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయిస్తున్నట్లు ఆయన వివరించారు. 
 • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల సహకారంతో మడుపల్లి -మధిర చెప్టాకు రూ.7కోట్లు మంజూరు. 
 • మధిర పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు. 
 • జిల్లా మినరల్‌ ఫండ్‌ ట్రస్టు ద్వారా మధిర నియోజకవర్గంలో 13 బీటీ రెన్యూవల్‌ అభివృద్ధి పనులను రూ.5.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. 
 • రూ.10.15 కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది రోడ్ల రెన్యూవల్‌ అభివృద్ధి పనులు.
 • ఉపాధి హామీ పథకంలో రూ.2.50 కోట్లతో 58 పనులు చేపట్టారు. దీంతో వందలాది మందికి సరైన సమయంలో ఉపాధి లభించింది. 
 • గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖమ్మం జిల్లా పరిషత్‌లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో కారుణ్య నియామకాలు. 16 మందికి వివిధ విభాగాల్లో ఉద్యోగాలు. 
 • 19 మంది సీనియర్‌ అసిస్టెంట్లకు పర్యవేక్షకులుగా, 15 మంది జూనియర్‌ అసిస్టెంట్లకు సీనియర్‌ అసిస్టెంట్లుగా, ఆరుగురు రికార్డు అసిస్టెంట్లకు జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చినట్లు జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు తెలిపారు.


logo