శుక్రవారం 07 ఆగస్టు 2020
Khammam - Jul 11, 2020 , 03:22:56

ఆన్‌లైన్‌ పాలనకు శ్రీకారం

ఆన్‌లైన్‌ పాలనకు శ్రీకారం

  • కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు 

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.. ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలకు వచ్చే ప్రజల సంక్షేమానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నది.. ఈ నెల 13 నుంచి ‘ఈ ఆఫీస్‌' విధానం అమలు చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనుంది.. తద్వారా ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ఏర్పాట్లు చేసింది.. దీంతో అన్ని ప్రభుత్వశాఖల అధికారులు ఇక ఆన్‌లైన్‌లోనే పాలన అందించనున్నారు.. ఈ మేరకు ప్రభుత్వం ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.. ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే కొందరు అధికారులు హైదరాబాద్‌లో శిక్షణ పొందేందుకూ వెళ్లారు.. ప్రభుత్వ నిర్ణయంపై 62 ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                     -ఖమ్మం/కొత్తగూడెం

పేపర్‌లెస్‌తో ప్రయోజనం..

ఈ-పాలనలో భాగంగా పేపర్‌లెస్‌ పనులు శరవేగంగా జరగనున్నాయి. ఒకరి టేబుల్‌ నుంచి ఇంకొకరి సెక్షన్‌కు ఫైల్స్‌ వెల్లే పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఇక ప్రతిఫైల్‌ ఆన్‌లైన్‌లోనే వివిధ సెక్షన్‌లకు వెళ్లనుంది. దీనివల్ల పనులు త్వరగా పూర్తికావడంతో పాటు, వైరస్‌ భయం కూడా ఉద్యోగుల్లో తొలగనుంది. గతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా.. వారి గురించి తెలియక కార్యాలయాల్లోకి అనుమతించి ఉద్యోగులు వైరస్‌ బారినపడిన సందర్భాలున్నాయి. ఈ-పాలనతో ఇలాంటి సమస్యలకు ప్రభుత్వం చెక్‌ చెప్పింది. ఈ విధానంతో ప్రజలకు జవాబుదారీతనంతోపాటు ప్రతీ ఫైల్‌ పక్కాగా రికార్డు అవుతుంది.

ఆన్‌లైన్‌ వీడియో గ్రీవెన్స్‌..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘గ్రీవెన్స్‌'ను ప్రభుత్వం రద్దు చేసింది. దాదాపు మూడు నెలల నుంచి గ్రీవెన్స్‌ డేలు నిర్వహించడం లేదు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారానికి ‘గూగుల్‌మీట్‌' యాప్‌ ద్వారా ‘ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌'ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అయితే ఇలాంటి నూతన విధానానికి ఈనెల 6వ తేదీనే ఆన్‌లైన్‌ వీడియో గ్రీవెన్స్‌కు  కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ శ్రీకారం చుట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు.. గూగుల్‌ మీట్‌ యాప్‌ ద్వారా కలెక్టర్‌తో వీడియో గ్రీవెన్స్‌లో మాట్లాడుతున్నారు. తద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వీడియో గ్రీవెన్స్‌లో అర్జీలను అందించేందుకు వచ్చిన తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు శానిటైజేషన్‌ చేస్తారు. ఆ తర్వాతే ఒక్కొక్కరినీ సమస్యలు విన్నవించుకునేందుకు అనుమతిస్తారు. ఈమేరకు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో అన్ని ఏర్పాట్లూ చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాలకు కూడా ఇలాంటి విధానం అమలు చేయనున్నారు.

ఈ-పాలనపై ఉద్యోగులకు శిక్షణ..

ప్రభుత్వ ఆదేశాలమేరకు వచ్చే సోమవారం నుంచి ఆన్‌లైన్‌ పాలన కొనసాగనుంది. ఇందుకోసం ఖమ్మం జిల్లా నుంచి కొందరు ఉద్యోగులు హైదరాబాద్‌లో శిక్షణకు వెళ్లారు. కరోనాను ఎదురించి పోరాడుతున్న వారిలో ఆఫీస్‌బాయ్‌ నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లోని తహసీల్దార్‌, మండల పరిషత్‌ కార్యాలయాలకు ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం వందలమంది ప్రజలు వస్తుంటారు. దీంతో కార్యాలయాలు రద్దీగా మారుతున్నాయి. మండల కార్యాలయాల్లోని ఉద్యోగులు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈనేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఇలాంటి పాలనా విధానం ఉపయోగకరంగా ఉంటుందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం 

  •  తుంబూరు సునీల్‌రెడ్డి,  తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల సౌకర్యార్థం ఆన్‌లైన్‌ పాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. దీనిని అంతా స్వాగతించాలి. దీనివల్ల విధి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదు. సకాలంలో ప్రజల సమస్యలూ పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు ఇంటినుంచి విధులు నిర్వహించుకోవచ్చు.

ఈ-పాలనే మేలు..

  • గంగవరపు బాలకృష్ణ, టీఎన్‌జీఓస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ-పాలన సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నిర్ణయం చాలా బాగుంది. కొన్ని కార్యాలయాల్లో విధులు నిర్వహించాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. ఇకనుంచి అలాంటి సమస్యలుండవు. ప్రతి ఉద్యోగి ఈ అవకాశాన్ని వినియోగించుకొని,  ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలి.


logo