బుధవారం 12 ఆగస్టు 2020
Khammam - Jul 10, 2020 , 03:33:53

గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలి

గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలి

  • మైనింగ్‌ రాయల్టీ, 
  • విద్యుత్‌ ఛార్జీలు రద్దు చేయాలి 
  • మంత్రి కేటీఆర్‌ను కలిసిన 
  • ఎంపీ నామా, ఎమ్మెల్యే సండ్ర
  • పరిష్కారానికి మంత్రి కేటీఆర్‌ హామి

ఖమ్మం : జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రాష్ట్ర ఐటీ, మున్సిఫల్‌ శాఖ మంత్రి కే.తారకరామారావును కలిసి వినతి పత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రిని కలిసి గ్రానైట్‌ పరిశ్రమ యజమానులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. గ్రానైట్‌ పరిశ్రమపై విధిస్తున్న మైనింగ్‌ రాయల్టీ ఏడాది పాటు రద్దు చేయాలని,

అలాగే విద్యుత్‌ చార్జీలకు సంబంధించి కనీస చార్జీలు కూడా రద్దు చేయాలని వినతిలో కోరారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు, పావలా వడ్డీ లాంటి ప్రోత్సాహకాలు అందించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. కరోనా వలన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ర్టాలకు ఎగుమతులు ఆగిపోయి, ముడిసరుకు క్వారీలకే పరిమితమైందన్నారు. లాక్‌డౌన్‌తో దేశీయ విమానాలు నడవకపోవడం వలన వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదన్నారు. జిల్లాలోని 454 గ్రానైట్‌ పరిశ్రమలకు ప్రస్తుతం 100 పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయని, కొన్ని పరిశ్రమలు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక మూతపడ్డాయని మంత్రికి తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్‌ను కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్‌ గ్రానైట్‌ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామినిచ్చారు.logo