ఆదివారం 09 ఆగస్టు 2020
Khammam - Jul 10, 2020 , 03:28:36

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

ఇంటర్‌ సప్లిమెంటరీ  పరీక్షలు రద్దు

  • సెకండియర్‌లో ఫెయిలైన  విద్యార్థులంతా పాస్‌
  • ఉమ్మడి జిల్లాలో 6156 మంది ఉత్తీర్ణత
  • వచ్చే నెలలో అందనున్న మెమోలు

 ఖమ్మం ఎడ్యుకేషన్‌/కొత్తగూడెం ఎడ్యుకేషన్‌ : కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం వల్ల తలెత్తే అంశాలను పరిగణలోకి తీసుకుని పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. కేసుల తీవ్రత పెరుగుతుండటం హైద్రాబాద్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం పట్ల పరీక్షలు రద్దు చేశారు. మార్చి 2020లో జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో కలిపి 15,297 మంది విద్యార్థులకు 11,228మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన 4069మంది విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులను చేయనున్నారు. జనరల్‌ విభాగంలో 3527 మంది  ఒకేషనల్‌ విభాగంలో 542మంది విద్యార్థులు పరీక్షలు రద్దుతో పాస్‌ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,540 మంది పరీక్షలు రాయగా 6,453 మంది ఉత్తీర్ణులు అయ్యారు. 2,087 మంది ఫెయిల్‌ అయ్యారు. ప్రభుత్వ ప్రకటనతో వీరందరూ పాసయ్యారు.  వచ్చే నెలలో సంబంధిత కళాశాలల్లో మార్కుల మెమోలను పొందవచ్చునన్నారు.logo