బుధవారం 12 ఆగస్టు 2020
Khammam - Jul 07, 2020 , 03:32:49

ఖమ్మం జిల్లాలో ఒక్క రోజే 17 కేసులు

ఖమ్మం జిల్లాలో ఒక్క రోజే 17 కేసులు

మయూరిసెంటర్‌: కరోనా వైరస్‌ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. సోమవారం ఒక్క రోజే ఖమ్మం జిల్లాలో 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి. మాలతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రుపాలెంలో ఒకరికి(66), కల్లూరులో ఒకరికి(39), రూరల్‌ మండలం వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో ఒకరికి(50) పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. నగరంలోని మామిళ్లగూడెంలో ఒకరికి(55), పాండురంగాపురంలో చిన్నారికి(6), అతడి తండ్రికి(29), పాకబండబజార్‌లో మహిళ(40)కు,  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు పురుషులకు, ఒక మహిళకు, నాయుడుపేటకు చెందిన ఒకరికి(54), ముస్తాఫానగర్‌లో యువతికి(23), నగరంలోని మరో ముగ్గురు మహిళలకు(35, 39, 50), ఒక పురుషుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరో 86మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం 53 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం పాజిటీవ్‌ కేసుల సంఖ్య 108కి చేరుకుంది.

కరోనాతో బాలింత మృతి

చింతకాని: మండలంలోని కోమట్లగూడెం గ్రామంలో కరోనాతో బాలింత(32) మృతిచెందింది. దీనిని వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... ఆమె గత నెల 9న విజయవాడ నుంచి ప్రసవం కోసం కోమట్లగూడెంలోని పుట్టింటికి వచ్చింది. ప్రసవం కోసం జూన్‌ 21న ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. ఎనిమిది రోజుల తరువాత చంటి బిడ్డతో కలిసి కోమట్లగూడెం చేరుకుంది. జూలై 3న ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అదే రోజున ఆమెకు వైద్యులు కరోనా టెస్ట్‌ చేశారు. ఆ తరువాత, అక్కడి నుంచి అత్యవసర పరీక్షల కోసం  ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి ఏమాత్రం బాగా లేదని అక్కడి వైద్యులు చేతులెత్తేశారు. దీంతో, కుటుంబ సభ్యులు తిరిగి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమె అక్కడే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. పుట్టిన 15 రోజులకే ఆ శిశువుకు తల్లి దూరమైంది. 

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన..

మయూరిసెంటర్‌:  ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ ఆమె కుటుంబీకులు, బంధువులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. వారు చెప్పిన వివరాలు... చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన గర్భిణి తొలి కాన్పు కోసం జిల్లా ఆసుపత్రికి వచ్చింది. అక్కడి వైద్యులు పెద్ద ఆపరేషన్‌ చేసి బాబుకు పురుడు పోశారు. శస్త్ర చికిత్స చేసిన చోట దురద, నొప్పులతోపాటు జలుబు, ఆయాసం ఉండడంతో ఈ నెల 3న ఆమెను కుటుంబీకులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.  సోమవారం తెల్లవారుజామున ఆమె మృతిచెందింది. ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలింత మృతిచెందిందని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు కలిసి కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఉదయం గంటన్నరపాటు ఆందోళన చేశారు. దీనిపై ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా... “బాలింతకు జలుబు, ఆయాసం ఉండడంతో ఈ నెల 5న స్వాబ్‌ శాంపిల్స్‌ను వరంగల్‌కు పంపించాం. సోమవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆమె చికిత్స అందిస్తున్నప్పటికీ తీవ్ర ఆయాసం ఉండడంతో మృతి చెందింది” అని వివరించారు.

తాజావార్తలు


logo