శుక్రవారం 07 ఆగస్టు 2020
Khammam - Jul 07, 2020 , 03:06:59

లచ్చగూడేనికి లక్ష్మీకళ

లచ్చగూడేనికి లక్ష్మీకళ

  • ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ దత్తతతో మారిన రూపురేఖలు
  • సంసద్‌ ఆదర్శ గ్రామ యోజనకు ఎంపిక
  •  అభివృద్ధి పనులకు నిధుల వరద
  • హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

లచ్చగూడెం.. భద్రాద్రి జిల్లాలో ఇదొక కుగ్రామం.. కానీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ 2017లో దత్తత తీసుకున్న తర్వాత గ్రామ రూపురేఖలే మారిపోయాయి.. ‘గ్రామాన్ని అని విధాలా అభివృద్ధి చేస్తా..’ అనే మాటకు కట్టుబడి ఎంపీ ఆ గ్రామాన్ని రాష్ర్టానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దారు.. ఆయన కృషితో గ్రామం తాజాగా సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన (ఫేజ్‌-3)కు ఎంపికైంది.. దీంతో గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు  విడుదల కానున్నాయి.  -ఇల్లెందు రూరల్‌

ఇల్లెందు రూరల్‌: లచ్చగూడెం.. ఇదొక మారుమూల కుగ్రామం. హరితహారంలో ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమాత్యులతో సహా ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. టీన్యూస్‌ ఆధ్వర్యంలో 2017 ఆగస్టు 31న నిర్వహించిన హరితహారంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ గ్రామస్తుల ఐక్యతపై హర్షం వ్యక్తం చేశారు. లచ్చగూడేన్ని తాను దత్తత తీసుకుంటున్నట్లు గ్రామస్తుల సమక్షంలో ప్రకటించారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఈ నిర్ణయమే లచ్చగూడెం గ్రామ దశను మార్చివేసింది. నాటి నుంచి క్రమంగా ప్రగతి బాటలో పయణిస్తూ అభివృద్ధికి నమూనాగా తీర్చిదిద్దబడిన లచ్చగూడేనికి మరో అరుదైన అవకాశం దక్కింది. ఎంపీ జోగినపల్లి సంతోశ్‌ ప్రతిపాదనతో సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన ఫేజ్‌-3లో ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

మారనున్న గ్రామ రూపురేఖలు

లచ్చగూడేన్ని దత్తత తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ ప్రకటించిన నాటి నుంచి గ్రామ రూపురేఖలు మారుతూ వచ్చాయి. తొలుత రూ.50లక్షలతో అన్ని వీధులు సీసీ రోడ్లుగా రూపాంతరం చెందాయి. చల్లసముద్రం గ్రామపంచాయతీ నుంచి అంజనేయపురం మీదుగా లచ్చగూడెం వరకు రూ.3కోట్లతో బీటీరోడ్డు వేశారు. విద్యుత్‌ సమస్యను తీర్చే విధంగా గ్రామంలో రూ.2 కోట్లతో సబ్‌స్టేషన్‌ నిర్మించారు. ఇలా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో తాజాగా సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన పథకం ఫేజ్‌-3లో ఎంపిక కావడం గ్రామ అభివృద్ధికి మరో మలుపుగా మారనుంది. ఈ పథకంలో భాగంగా గ్రామంలో భౌతిక అభివృద్ధితోపాటు మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు సంసద్‌ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపికైన గ్రామంలో విధిగా అమలు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ స్కూల్స్‌, ఆరోగ్య కేంద్రాలు, పక్కా ఇళ్లు, స్వచ్ఛమైన తాగునీరు వంటి మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాల్సి ఉంటుంది. ఆయా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అమలైతే మండలంలో లచ్చగూడెం మోడల్‌ విలేజ్‌గా మారుతుందనడంలో సందేహం లేదు.

నిధుల కేటాయింపు ఇలా..

సన్‌సద్‌ గ్రామ యోజన పథకంలో భాగంగా ఎంపికైన గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ సభ్యులకు  కేటాయించే నిధులను కూడా విధిగా ఆయా గ్రామాల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీకి వనరుల ద్వారా వచ్చే ఆదాయం, ఆర్థిక సంవత్సరం నిధులతోపాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా నిధులు గ్రామానికి చేరనున్నాయి.

గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

లచ్చగూడెం గ్రామ అభివృద్ధికి గ్రూప్‌-1 స్థాయి అధికారి పర్యవేక్షణలో పక్కా ప్రణాళిక రూపొందిస్తారు. రహదారులు, విద్య, వైద్యం, పక్కా ఇళ్లు, తాగు, సాగునీటి సౌకర్యం వంటి అంశాలతో  ప్రణాళిక అమలుకు నిధులు సమీకరించడం, వాటిని ఖర్చుచేస్తారు. ఈ పనులన్నీ నిర్దేశించిన ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో అమలవుతాయి. 

లచ్చగూడెంలో హర్షాతిరేకాలు

ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామంగా ఉన్న లచ్చగూడేనికి గుర్తింపు తెచ్చిపెట్టి అభివృద్ధికి బాటలు వేసేలా కృషి చేసిన ముత్యాల యుగంధర్‌ను గ్రామస్తులు అభినందించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ ప్రత్యేక శ్రద్ధతో సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన పథకంలో లచ్చగూడేనికి చోటు కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులందరూ ఆయనకు రుణపడి ఉంటారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతటి మార్పును ఊహించలేదు

నడవడానికి కూడా రహదారి సక్రమంగా లేని గ్రామం ఇంతటి అభివృద్ధి సాధిస్తుందని ఏనాడూ ఊహించలేదు. గ్రామాన్ని క్రమంగా అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తూ సంసద్‌ ఆదర్శ గ్రామ యోజనలో చోటు కల్పించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కు జీవితాంతం                       రుణపడి ఉంటాం.

 - రంగినేని సంజీవరెడ్డి, లచ్చగూడెం, ఇల్లెందు మండలం

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్‌ సహకారంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం సంసద్‌ గ్రామ యోజన జాబితాలో మా గ్రామానికి చోటు దక్కడం ఆనందంగా ఉంది. ఆయన ఆశాయాన్ని నెరవేర్చే విధంగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటాం. మా గ్రామానికి ఎంపీ అందిస్తున్న సేవలను ఎప్పటికీ మరచిపోం.

- జోగ నాగలింగేశ్వరి, లచ్చగూడెం, ఇల్లెందు మండలం 


logo