ఆదివారం 09 ఆగస్టు 2020
Khammam - Jul 05, 2020 , 04:00:29

‘లోకల్‌' చదువే సో బెటరూ..

‘లోకల్‌' చదువే సో బెటరూ..

  • ‘కరోనా’తో మారుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ధోరణి
  • పిల్లలను దూరప్రాంతాలకు పంపేందుకు వెనుకంజ..
  • ఫలితంగా ఖమ్మం విద్యాసంస్థలకు ఏకబిగిన పెరిగిన డిమాండ్‌

ఖమ్మం ఎడ్యుకేషన్‌: ఖమ్మం నగరానికి చెందిన వేదవ్యాస్‌ది 10వ తరగతి పూర్తయింది. ఇక ఉన్నత చదువుల కోసం అతణ్ని వేరే ప్రాంతానికి పంపాలనే ఆలోచన చేశారు తల్లిదండ్రులు. అందుకోసం తమకు తెలిసిన వారందరినీ కలిసి వాకబు చేశారు. ‘ఏ కళాశాల అయితే మంచిది? ఏ కాలేజీ క్యాంపస్‌ బాగుంటుంది?’ దానిపై ఆరా తీశారు. రూ.లక్షలు ఖర్చయినా సరే పెద్ద పెద్ద నగరాల్లోనే చదివించాలనే నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే తమ కుమారుడిని ఓ పెద్ద కార్పొరేట్‌ కళాశాలలోనే చేర్చారు.

-ఇదంతా గతేడాది వరకు జరిగిన తంతు.  సీన్‌ కట్‌ చేస్తే.. 

ఇప్పుడంతా రివర్సయింది. ‘కరోనా’ మహమ్మారి తల్లిదండ్రుల ఆలోచనలను తలకిందులు చేసింది. గతం కంటే బిన్నంగా ఈ ఏడాది తమ పిల్లల చదువుల గురించి ఆలోచన చేస్తున్నారు. చదువులు, మార్కులు, ర్యాంకులకంటే పిల్లల ప్రాణం, ఆరోగ్యమే ముఖ్యమని అంటున్నారు. రోజురోజుకూ పెద్ద నగరాల్లో కరోనా కేసులు ఎక్కువ అవుతుండంతో ‘కార్పొరేట్‌' చదువులకు ‘నో’ చెబుతున్నారు. ‘లోకల్‌ చదువులే సో బెటరూ’ అంటున్నారు. స్థానికంగా చదివించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నిన్నమొన్నటి వరకు పిల్లల చదువుల కోసం విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల పేర్లు ఎత్తిన తల్లిదండ్రులు.. ఇప్పుడు ఆ పదాలు చెవిన పడితేనే ‘అమ్మో..’ అంటున్నారు. ఫలితంగా ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ‘మంచి చదువు, మంచి కాలేజీ’ అన్న మాటలకు ప్రస్తుతానికి స్వస్తి చెబుతున్నారు. ఇతర దేశాలు, రాష్ర్టాలకు పంపాలనుకునే ఆలోచనలను విరమించుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ‘నాన్‌ లోకల్‌ చదవులొద్దు.. లోకల్‌ చదువులే మేలు’ అంటున్నారు. తల్లిదండ్రుల ధోరణి, జిల్లా విద్యావిధానంలో వస్తున్న మార్పులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

అప్పుడు మెట్రో నగరాలకు..

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా సుమారు 30 కోట్ల మంది విద్యార్థులు ఇప్పుడు ఇళ్లకే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ర్టాల్లో కలిపి దాదాపు కోటిన్నర మంది విద్యార్థులున్నారు. ఇప్పటికిప్పుడు విద్యాసంస్థలు తెరిచే పరిస్థితులు లేవు. మరో రెండు మూడు నెలల తరువాతైనా విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కడ, ఏ కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోవాలో అని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచనలు చేస్తున్నారు. సాధారణంగా ఏటా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థుల్లో సుమారు 40 శాతం మంది ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో పేరొందిన కళాశాలలకు వెళుతుంటారు. ఇందులో ఇంటర్‌, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోసం ఎక్కువగా హైదరాబాద్‌కు, ఇంజినీరింగ్‌ విద్య కోసం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చైన్నై నగరాలకు వెళ్తుంటారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారి పిల్లలతోపాటుగా మెరిట్‌ స్టూడెంట్స్‌ కూడా ఇంటర్‌, ఆ పై చదువుల కోసం ‘మెట్రో’ నగరాలకు’ వెళ్లడం ఇప్పటి వరకూ సర్వసాధారణమే. తప్పనిసరిగా హాస్టళ్లల్లో ఉండాల్సిన విద్యార్థులైతే భోజన వసతి వంటివి కూడా పరిశీలించుకొని హైదరాబాద్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, మధిర ప్రాంతాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మొగ్గు రాష్ట్ర రాజధానివైపే ఉండేది. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వస్తున్నది. ‘లోకల్‌'కే ప్రాధాన్యం పెరుగుతున్నది.  

జిల్లా విద్యాసంస్థలకు డిమాండ్‌..

ఏటా ఇంటర్‌ విద్య కోసం ఉమ్మడి జిల్లా నుంచి విద్యార్థులు హైదరాబాద్‌లోని కళాశాలలకు వెళుతుంటారు. ఇప్పుడు ఏ ఒక్కరూ ఇంటర్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లడానికి సుముఖంగా లేరు. దీంతో ఖమ్మం నగరంలోని కళాశాలల్లోనే అడ్మిషన్‌ తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని జూనియర్‌ కళాశాలలకు డిమాండ్‌ బాగా పెరుగుతున్నది. ఫలితంగా ఫీజులు కూడా పెంచేశారు. ఇక ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులు సైతం ఇతర రాష్ర్టాల వైపు చూడడం లేదు. అందుబాటులో ఉన్న కళాశాలల్లో చేరేలా ఆలోచనలు చేస్తున్నారు. పొరుగు రాష్ర్టాల్లోని యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు సైతం ఇప్పుడు కరోనా భయంతో తమ నిర్ణయాలను సమీక్షించుకుంటున్నారు. ఖమ్మంలోనే ఇంజినీరింగ్‌ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ఎంసెట్‌లో లక్షకుపైన ర్యాంకు వచ్చిన వారికి ఖమ్మం కళాశాలల్లో సీట్లు వచ్చేవి. ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో పోటీ కూడా కూడా పెరుగుతున్నది.  

పెరిగిన ఇంటి అద్దెలు..

కరోనాతో స్థానిక విద్యాసంస్థలకు డిమాండ్‌ పెరుగడమే కాకుండా ఖమ్మంలో ఇంటి అద్దెలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. హాస్టళ్లను ప్రస్తుతం తెరిచే పరిస్థితి లేకపోవడంతో డే స్కాలర్స్‌గా చేరాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఇందుకోసం గదుల్లో అద్దెకు ఉండాల్సి వస్తుండడంతో అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. 

ఇతర ప్రాంతాలంటేనే భయమేస్తున్నది..

ఖమ్మంలోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాను. టెక్నికల్‌ డిగ్రీ చదివేందుకు ఏ కళాశాల అయితే బాగుంటుందో ఇప్పటికే తెలుసుకున్నాను. ఏ ర్యాంకు వస్తే ఏ కళాశాలలో చేరాలనే దానిపై స్పష్టత కూడా ఉంది. కానీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఖమ్మంలోనే చదవాలని అనుకుంటున్నాను. చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయమేస్తున్నది. -ఆర్‌.నమిత, ఖమ్మం

ఇక్కడే చదువుతా.. :

ఇంటర్మీడియట్‌ పూర్తయింది. ఇంజినీరింగ్‌ చదవాలనుకుంటున్నాను. గతంలో ఇతర ప్రాంతాల్లో మంచి కాలేజీలో చదవాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు రీత్యా జిల్లాలోనే చదవాలనే నిర్ణయానికి వచ్చాను. మా పేరెంట్స్‌ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు.

-బి.జ్యోతిర్మయి, భద్రాచలంlogo