మంగళవారం 11 ఆగస్టు 2020
Khammam - Jul 03, 2020 , 02:57:41

రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలి

రైతు వేదికల నిర్మాణాలను వేగవంతం చేయాలి

  • u వ్యవసాయశాఖ అధికారులకు  కలెక్టర్ కర్ణన్ ఆదేశం 

 ఖమ్మం : జిల్లాలో రైతువేదికల నిర్మాణాల ప్రకియను వేగవంతం చేయాలని  కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతు వేదికలు, రైతు కల్లాల నిర్మాణాల పురోగతి, వానకాలం పంటసీజన్‌లో జిల్లాలో చేపడుతున్న పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లస్టర్ వారీగా రైతు వేదిక భవనాల నిర్మాణాలకు  స్థలం గుర్తించని ప్రాంతాల్లో స్థల లభ్యతను బట్టి సంబంధిత తహసీల్దార్ నుంచి స్థలాన్ని సేకరించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగపు అధికారులకు అప్పగించాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రైతులు పంటలను ఆర బోసేందుకు కల్లాల నిర్మాణాలకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు.  సీజన్‌లో రైతులకు  ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ పరిధిలో పర్యటించి రైతులకు, వ్యవసాయ శాఖ తోడ్పాటునందించాలని ఆదేశించారు.  సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, పంచాయతీరాజ్ ఈఈ రామచంద్రమౌళి,   ఏడీఏలు శ్రీనివాసరావు, బాబురావు, కె.వెంకటేశ్వరరావు, విజయచందర్, సరిత , యం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. 

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ కర్ణన్

 ఖమ్మం  : జిల్లాలో డ్రైడే కార్యక్రమాలు తప్పనిసరిగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం ఎంపీడీఓలు, ఎంపీపీలు, తహసీల్దార్లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే డ్రైడేను మరింత  పటిష్టంగా నిర్వహించాలని అన్నారు.  డ్రైడేలలో పాల్గొనని వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కొవిడ్ -19 నియంత్రణలో భాగంగా గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి బయట వ్యక్తులు వస్తే  హోం క్వారంటైన్ పాటించేలా చూడాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.


logo