సోమవారం 08 మార్చి 2021
Khammam - Jul 02, 2020 , 00:13:27

ఒక్కరోజే పదిమందికి వైరస్‌

ఒక్కరోజే పదిమందికి వైరస్‌

  • ఖమ్మం జిల్లాలో 76కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

మయూరిసెంటర్‌/ నేలకొండపల్లి: ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. బుధవారం ఒక్కరోజే 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఖమ్మం 5వ డివిజన్‌ ప్రశాంతినగర్‌కు చెందిన 50 ఏళ్లకు వ్యక్తికి, సింగరేణి మండలం పోలంపల్లికి చెందిన 27 ఏళ్ల మహిళకు, ఖమ్మం సరితా క్లినిక్‌ సెంటర్‌కు చెందిన ఓ చికెన్‌ షాపు యజమానికి, నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడికి, ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన 50 ఏళ్ల మహిళకు, బుర్హాన్‌పురానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి, ఎన్‌ఎస్‌టీ రోడ్డులోని ఓ మహిళకు, సత్తుపల్లి మండలం గంగారంలో ఒకరికి, పెనుబల్లిలో ఓ మహిళకు, కారేపల్లిలో ఒకరికి బుధవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కాగా ఖమ్మం జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 76కు చేరుకుంది. ఇందులో నాలుగు మరణాలు ఉన్నాయి. బుధవారం మరో 27 మంది ఆసుపత్రి నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 23 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

పాల్వంచలో మరో వ్యక్తికి కరోనా..

పాల్వంచ: పట్టణంలోని 5వ వార్డు గాంధీనగర్‌లో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఓ ప్రైవేటు ఉద్యోగికి బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. సదరు వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో హైదరాబాద్‌లో రక్తనమూనాలు ఇచ్చి గాంధీనగర్‌లో ఉన్న తన ఇంటికి కారులో చేరుకున్నాడు. మంగళవారం రాత్రి అతడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు బుధవారం అతన్ని హోంక్వారంటైన్‌ చేశారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించారు. 

ఆయిల్‌ఫెడ్‌ ఉద్యోగుల్లో ఆందోళన

అశ్వారావుపేట: అశ్వారావుపేటలోని ఆయిల్‌ఫెడ్‌ సంస్థలో బుధవారం కరోనా వైరస్‌ కలకలం సృష్టించింది. ఆ సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులు 10 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పని నిమిత్తం వెళ్లారు. వారిలో నలుగురు ఉద్యోగులు తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఒక మహిళా తాత్కాలిక ఉద్యోగి మాత్రం మంగళవారం కార్యాలయానికి వచ్చింది. విపరీతమైన జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా తోటి ఉద్యోగులు గుర్తించి ఆమెను ఇంటికి పంపించేశారు. ఆమె హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలో పని నిమిత్తం కలిసిన ఉన్నతాధికారికి మంగళవారం కరోనా పాజిటివ్‌ నమోదు కావటంతో అక్కడి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన ఈమె కూడా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. పాజిటివ్‌ లక్షణాలు ఉండటంతో ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు. డివిజనల్‌ కార్యాలయం ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. 

VIDEOS

తాజావార్తలు


logo