సోమవారం 06 జూలై 2020
Khammam - Jul 01, 2020 , 01:13:36

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

  • ఏన్కూరు మండల పర్యటనలో కలెక్టర్‌ కర్ణన్‌
  • వార్డు సభ్యుడికి షోకాజ్‌ నోటీసు

ఏన్కూరు: పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. మండలంలోని నాచారం, రేపల్లెవాడ గ్రామాల్లో మంగళవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రతి వీధిలోనూ పరిశుభ్రతను పరిశీలించారు. రేపల్లెవాడ ఓ ఇంట్లో కూలర్‌లో నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందాయి. దీనికి వార్డుమెంబర్‌ అజ్మీరా నర్సింహారావును బాధ్యుడిని చేసి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డ్రైడే కార్యక్రమంలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా తప్పనిసరిగా భాగస్వాములు కావాలన్నారు. ప్రతి గ్రామమూ పరిశుభ్రంగా ఉండేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇంట్లో నీటి నిల్వలు లేకుండా ఎప్పటి కప్పడు శుభ్రం చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా డ్రైడే కార్యక్రమాల్లో తప్పనిసరిగా భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామానికి వస్తే ఆశ కార్యకర్తలు వారి వివరాలను సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలియజేయాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కలిగిన వారు స్వచ్ఛందంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఇళ్లలో నిర్మించుకొన్న ఇంకుడు గుంతను పరిశీలించారు. గ్రామంలో మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో బీ.అశోక్‌, తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీవో వీరస్వామి, రేపల్లెవాడ సర్పంచ్‌ విజయకుమారి పాల్గొన్నారు. 


logo