గురువారం 09 జూలై 2020
Khammam - Jul 01, 2020 , 00:48:43

ఎస్‌ఐ సందీప్‌పై సస్పెన్షన్‌ వేటు

ఎస్‌ఐ సందీప్‌పై సస్పెన్షన్‌ వేటు

ఖమ్మం సిటీ: అక్రమంగా తరలుతున్న ఇసుకను.. రవాణాకు వినియోగించిన ట్రాక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. రెవెన్యూ అధికారులను పిలిపించి పంచనామా నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సీజ్‌ చేసిన ఇసుకను వేలం పాట వేశారు. కానీ, ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఎస్సై, డిఫ్యూటీ తహశీల్దార్‌, సర్పంచ్‌... ముగ్గురూ సస్పెండయ్యారు..! వినటానికి, చదవడానికి కొంత ఆశ్చర్యమనిపించినా .. ఇది వాస్తవం. వివరాల్లోకి వెళితే..

నిబంధనలకు విరుద్ధ్దంగా ఇసుకను తరలిస్తున్న 13 ట్రాక్టర్లను తిరుమలాయపాలెం మండల కేంద్రంలో అక్కడి పోలీసులు సీజ్‌ చేశారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పంచనామా నిర్వహించారు. సంబంధిత ట్రాక్టర్ల యజమానులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన అనంతరం ఖమ్మం జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాము సీజ్‌ చేసిన ఇసుక, ట్రాక్టర్ల వివరాలను న్యాయమూర్తికి సమర్పించారు. దీనిపై విచారణ చేసిన ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్‌, పట్టుబడిన ఇసుకను వేలం వేయాలని సూచించారు. తదుపరి విచారణ సమయంలో తిరుమలాయపాలెం ఎస్సై నందీప్‌, డిఫ్యూటీ తహశీల్దార్‌ రాజేశ్‌ ఇచ్చిన వివరణ గందరగోళంగా ఉండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆ ఇద్దరితోపాటు వారికి సహకరించిన స్థానిక సర్పంచ్‌ను కస్టడీకి ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. 

సస్పెన్షన్‌ వేటు...

తిరుమలాయపాలెం ఇసుక ట్రాక్టర్ల కేసులో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. పట్టుబడిన ఇసుక వేలం పాట విషయంలో అక్రమాలు జరిగాయని భావించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గత శుక్రవారం వెలువరించిన తీర్పు సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. మరుసటి రోజైన శనివారమే వారికి బెయిల్‌ వచ్చినప్పటికీ డిఫ్యూటీ తహశీల్దార్‌ రాజేశ్‌, సర్పంచ్‌ వెంకన్నపై గత శనివారమే కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. తాజాగా.. శాఖాపరమైన విచారణ నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై నందీప్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం వరంగల్‌ రేంజ్‌ ఇన్‌చార్జ్‌ డీఐజీ, సీఐడీ ఐజీపీ ప్రమోద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తిరుమలాయపాలెం ఇసుక ట్రాక్టర్ల పట్టివేత కేసులో ససెన్షన్‌కు గురైన వారి సంఖ్య ముగ్గురికి చేరుకుంది. సీజ్‌ చేసిన ఇసుక, పట్టుకున్న ట్రాక్టర్ల వివరాలు నమోదు చేయటంతోపాటు కోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన వివరణలో గందరగోళమే ఇంతదాకా తీసుకొచ్చిందన్న చర్చ సాగుతోంది.


logo