గురువారం 02 జూలై 2020
Khammam - Jul 01, 2020 , 00:32:06

వైద్యుడా.. వందనం

వైద్యుడా.. వందనం

  • వైద్య వృత్తికే వన్నె తెస్తున్న డాక్టర్లు.. 
  • ఎటువంటి వ్యాధికైనా చికిత్సకు వెనుకాడరు
  • ఆయుష్షుకు భరోసా.. అవసరానికి మించి సేవలు
  • ‘కరోనా’ కాలంలోనూ విశేష సేవలందిస్తున్న వైద్యులు
  • నేడు జాతీయ వైద్యుల దినోత్సవం 

ప్రతి మనిషికి ఏదో వ్యాధి రావడం తప్పనిసరి..  అలాంటి వారికి ప్రాణం పోసేదే వైద్యవృత్తి.. ఏ సమయంలో ఎలాంటి జబ్బు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చే వైద్యులు నిజంగా ప్రాణదాతలే.. ప్రమాదాల బారిన పడి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారి ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవులు.. రోగుల ప్రాణాలను కాపాడిన వైద్యుల సేవలను                  ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. అందువల్లనే వైద్యులు దైవంతో సమానమని చేతులెత్తి మొక్కుతారు. కరోనా కష్టకాలంలో కూడా మేమున్నామంటూ ముందుకొచ్చారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైరస్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న వీరికి ఒక రోజు ఉంది. అదే జూలై ఒకటి.. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..       

-కొత్తగూడెం

నిత్యం రోగుల సేవలో పరితపించే వైద్యులకు ఖాళీ సమయం అంటూ ఏదీ  ఉండదు. ఏ రోగికి ఏ సమయంలో ఆపద వచ్చినా కాల్‌ చేస్తే క్షణాల్లో వచ్చి వారి ప్రాణానికి భరోసా ఇస్తున్న వైద్యులు ఎప్పుడూ ఆపద్బాంధవులే. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్యులకూ ఒక రోజు ఉంది. అది జూలై ఒకటి జాతీయ వైద్యుల దినోత్సవం. దేశవ్యాప్తంగా లక్షల కరోనా కేసులు వస్తున్నప్పటికీ నియంత్రించడంలో వైద్యులు చేస్తున్న సేవలు ఆమోఘం. అలాంటి వైద్యుల సేవలు గుర్తించి వారిని సన్మానిస్తున్నారు. భారతదేశం అంతటా ప్రతి ఏడాది జూలై ఒకటో తేదీన డాక్టర్స్‌డేను జరుపుకుంటారు. డాక్టర్‌ బిధాన్‌ చంద్రరాయ్‌ జయంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు. డాక్టర్‌ బిధాన్‌ చంద్రరాయ్‌ 1882 జూలై 1న జన్మించారు. 1962లో అదే తేదీన మరణించాడు. 80వ సంవత్సరంలో పశ్చిమబెంగాల్‌ రాష్ర్టానికి చెందిన రెండో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1961 ఫిబ్రవరి 4న భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో సత్కరించింది. 

రోగులకు భరోసా కల్పిస్తూ..

ఎలాంటి బాధలో ఉన్నా రోగికి ధైర్యం చెప్పి చికిత్స చేసే వైద్య వృత్తి నేడు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంత పెద్ద వ్యాధి అయినా వారి ఆయుస్సుకు భరోసా ఇచ్చే వైద్యులు నేడు దేవుళ్లతో సమానంగా మారారు. ఎంబీబీఎస్‌, ఎండీలు, సర్జన్‌ పూర్తి చేసిన వైద్యులు కూడా పట్టణంతో పాటు పల్లెల్లో కూడా సేవలు అందిస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు.  

‘కరోనా’లోనూ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు

కరోనా మహమ్మారి ప్రాణాలను తీసే వైరస్‌. ఎక్కడా ఎవరికి పాజిటివ్‌ వచ్చినా వెంటనే వారి ఇంటికి వెళ్లి ఆ ప్రాంతాన్ని క్వారెంటైన్‌ చేసి, బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సేవలందిస్తున్న సిబ్బంది సేవలు వెలకట్టలేనివి.  ఆశ కార్యకర్తల నుంచి ఏఎన్‌ఎం, ఆరోగ్య సిబ్బంది, వైద్యుడు, జిల్లా వైద్యాధికారి సైతం వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలకు జనం జేజేలు పలుకుతున్నారు.  

ప్రాణం పోస్తున్న వైద్యులు, సిబ్బంది

 తొమ్మిది నెలలు గర్భంలో శిశువును మోసి చివరికి పురుడుపోసుకునే సమయంలో దైవంలా ప్రత్యక్షమయ్యే వైద్యులు దైవంతో సమానం. సమయానికి వైద్యులు లేకపోయినా సిబ్బందే మేమున్నామంటూ తల్లి ప్రాణాలకు భరోసా ఇస్తున్నారు. నవమాసాలు మోసిన తల్లికి పురుడుపోసి బిడ్డను ఆమె చేతుల్లో పెడుతున్నారు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పెద్దయ్యే వరకు వారిని అన్ని విధాలుగా సేవలందించడంలో ఆశ కార్యకర్తలతో పాటు ఏఎన్‌ఎంలు కీలకపాత్ర పోషిస్తున్నారు. 

వైద్య వృత్తి ఎంతో గొప్పది 

వైద్య వృత్తికి వెలకట్టలేం. ఎంతటి కష్టకాలంలోనైనా రోగి ప్రాణాలను కాపాడటానికితీవ్రంగా కష్టపడతారు. ఆ కష్టానికి గుర్తింపు కూడా అదే స్థాయిలో ఉంటుంది. కరోనా బాధితులను సురక్షితంగా బయటికి తీసుకొస్తున్న వైద్యుల సేవలు మర్చిపోలేం. వైద్యుల దినోత్సవం సందర్భంగా తోటి వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు.

-డీఎంహెచ్‌వో భాస్కర్‌ నాయక్‌


ఫోన్‌ కాల్‌ వస్తే వెంటనే ప్రత్యక్షం 

ఏ సమయంలో ఫోన్‌ కాల్‌ వస్తదో తెలియదు. అలాంటి పరిస్థితి కరోనా లాక్‌డౌన్‌ రోజులు. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటున్నాం. ఆస్పత్రికి రోగి వచ్చాడంటే అణువణువు పరీక్షించి జాగ్రత్తలు తీసుకొని కరోనా లక్షణాలు ఉంటే ఐసోలేషన్‌ వార్డుకు పంపిస్తున్నాం. మా సేవలను సీఎం కేసీఆర్‌ గుర్తించారు. వైద్యులకు డాక్టర్‌ డే శుభాకాంక్షలు. 

-డాక్టర్‌ రమేశ్‌, జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త


సేవ చేసే అదృష్టం అందరికీ రాదు 

విపత్కర సమయంలో రోగులకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదు. కరోనా వైరస్‌ లక్షణాలున్న వారికి సేవ చేయడం కత్తిమీద సామే. ఏ చిన్నపొరపాటు జరిగినా తిరిగి మనకు సోకే ప్రమాదం ఉంది. అయినాసేవలు అందించడం ఎంతో గర్వంగా ఉంది. ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. వైద్య వృత్తికి ఒక రోజు ఉండటం చాలా సంతోషం.

-డాక్టర్‌ చేతన్‌, డిస్ట్రిక్ట్‌ సర్వ్‌లెన్స్‌ ఆఫీసర్‌  


ఐసోలేషన్‌ వార్డులో పనిచేయడం కష్టం

కరోనా వైరస్‌ సోకిన వారు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతుంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులకు కత్తిమీద సాములాంటిదే. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ముందుండి సేవలు చేస్తున్నారంటే చాలా గ్రేట్‌ అని చెప్పవచ్చు. చాలా మంది రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించాం. ప్రాణబిక్ష పెట్టే వైద్య వృత్తి చాలా గొప్పది.     -డాక్టర్‌ వెంకన్న, ఐసోలేషన్‌ వార్డు వైద్యుడు

సిబ్బంది సేవలూ వెలకట్టలేనివి 

ఆస్పత్రిలో వైద్యులు సేవలు అందిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేయడం కూడా అంతే కష్టం. ఎక్కడా ఎలాంటి రోగులు ఉన్నారో తెలుసుకొని వారి ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలతో పాటు రక్తపూతలు సేకరించాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంలో సిబ్బంది పాత్ర అమోఘం. 

 -పొన్నెకంటి సంజీవరాజు, కొవిడ్‌ -19 అర్బన్‌ ఇన్‌చార్జి  


logo