బుధవారం 08 జూలై 2020
Khammam - Jun 30, 2020 , 04:51:23

వరదల సమయంలో జాగ్రత్తగా ఉండాలి..

వరదల సమయంలో జాగ్రత్తగా ఉండాలి..

కలెక్టర్‌ ఎంవీ రెడ్డి  ముంపు ప్రాంతాల్లో పర్యటన

పర్ణశాల, జూన్‌ 29 : మండలంలో సోమవారం కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి గోదావరి వరదలు వస్తే ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. సున్నంబట్టి, బైరాగులపాడు గ్రామాల మధ్య దోమలపాడు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సున్నంబట్టి సర్పంచ్‌ లక్ష్మిని వరదల సమయంలో తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బైరాగులపాడు నుంచి సున్నంబట్టికి వచ్చే రోడ్డు మార్గాన్ని ఏ శాఖ నిర్వహిస్తుందని అధికారులను ఆరా తీశారు. పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహిస్తుందని తెలుసుకుని ఏఈ వైశ్యానాయక్‌ను పిలిచి ముంపు రాకుండా రోడ్ల నిర్మాణం చేపట్టడానికి ఎంత ఖర్చవుతుందని అడగడంతో ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

. వైశ్యానాయక్‌ను బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులను పిలిచి రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులను అడిగి తెలుసుకున్నారు. రూ.6కోట్లు ఖర్చవుతుందని అధికారులు కలెక్టర్‌కు చెప్పడంతో నివేదిక తయారు చేసి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో స్వర్ణలత, ఇరిగేషన్‌ డీఈ రాంప్రసాద్‌, తహసీల్దార్‌ రాంనరేశ్‌, మండల అధికారి మల్లేశ్వరి, మండల ప్రత్యేకాధికారి వరదారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్‌లాల్‌, ఏవో నవీన్‌, ఐసీడీఎస్‌ పీవో నవ్యశ్రీ, వైద్యులు బాలాజీనాయక్‌, మండల పరిషత్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

దుమ్ముగూడెం : వర్షాకాలం వరదల సమయంలో మండలంలో వివిధ శాఖల అధికారులు వరదముంపు పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి అన్నారు. సోమవారం దుమ్ముగూడెం మండలంలోని గోదావరి వరద ముంపునకు గురయ్యే తూరుబాక, రేగుబల్లి గ్రామాలను ఆయన యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తూరుబాకలోని ప్రాథమిక పాఠశాల పునరావాస కేంద్రం వద్దకు వెళ్లి వరదముంపుకు గురైతే ఎంతమందికి ఇక్కడ సౌకర్యాలు ఉంటాయని, వారిని పునరావాసానికి ఎలా తీసుకువస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకు ద్వారా సరఫరా చేయకపోవడంతో ఇబ్బంది అవుతోందని పలువురు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లా రు. స్పందించిన కలెక్టర్‌ శాఖాధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ షోకాజ్‌ నోటీసు అందజేశారు. అనంతరం రేగుబల్లితో పాటు పలు గ్రామాల్లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కలెక్టర్‌ పరిశీలించి మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో స్వర్ణలత, ఆర్‌అండ్‌బీ ఈఈ బీమ్లా, మిషన్‌ భగీరథ ఈఈ అర్జునరావు, ఎంపీడీవో మల్లేశ్వరి, తహశీల్దార్‌ రాంనరేశ్‌, మండల ప్రత్యేకాధికారి వరదారెడ్డి, ఉద్యానవన జిల్లా అధికారి మరియన్న, ఎంపీవో ముత్యాలరావు, పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.


logo