గురువారం 16 జూలై 2020
Khammam - Jun 30, 2020 , 04:46:11

సీజనల్‌ వ్యాధులపై వైద్యశాఖ ముందస్తు చర్యలు

సీజనల్‌ వ్యాధులపై వైద్యశాఖ ముందస్తు చర్యలు

  •  ఖమ్మం జిల్లాలో పటిష్ట చర్యలు 
  • మలేరియా పీడిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి
  • ఇంటింటా ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే ప్రారంభం

మయూరిసెంటర్‌: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పటిష్ట చర్యలు చేపట్టారు. కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో ముందస్తుగా వంద పడకలతో జ్వరాల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తున్నారు. 241 బావుల్లో గంబూషియా చేపలను వదలనున్నారు. మత్స్యశాఖ ద్వారా 10 వేల గంబూషియా చేపలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంటింటికి ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వేను ఇప్పటికే మొదలుపెట్టారు. రెడ్‌టాప్‌ టెస్ట్‌ ట్యూబ్‌లను సిద్ధం చేసుకొని అనుమానిత రోగుల రక్తనమూనాలను జిల్లా ల్యాబ్‌కు పంపుతున్నారు. జిల్లా కేంద్రంలోని ల్యాబ్‌లో 24 గంటలూ డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయడానికి పరికారాలు సిద్ధంగా ఉన్నాయి. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం కూడా సిద్ధంగా ఉంది. 

ఏటా పెరుగుతున్న డెంగీ కేసులు

గడిచిన ఐదేళ్లుగా డెంగీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 2016లో 1216 మంది, 2017లో 700 మంది, 2018లో 722 మంది, 2019లో 1972 మంది డెంగీ జ్వరాల భారిన పడ్డారు. అయితే డెంగీ జ్వరాల నిర్మూలన కోసం అత్యాధునిక ఎలీసా పరికరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ప్రధానాసుపత్రిలో అందుబాటులో ఉంచింది. 

ఎలీసా కిట్లు అందుబాటులో ఉంచాం

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టాం. వ్యాప్తంగా 6 వేల రోగులకు సరిపోయే ఐజీఎం డెంగీ ఎలీసా కిట్లను అందుబాటులో ఉంచాం. ఎన్‌ఎస్‌-1 ఎలీసా పది వేల కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెరెక్ట్రం 250 లీటర్ల ద్రావణాన్ని జిల్లాకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాం. రూ.3 లక్షల విలువైన 20 వేల దోమతెరలను కూడా తెప్పిస్తున్నాం. 

- డాక్టర్‌ సైదులు, 

జిల్లా మలేరియా అధికారి, ఖమ్మం


logo