శనివారం 11 జూలై 2020
Khammam - Jun 29, 2020 , 02:13:39

ఆశాజనకంగా సాగు

ఆశాజనకంగా సాగు

  • ఉమ్మడి జిల్లాలో వానకాలం 
  • ‘పంటలు’ షురూ
  • గణనీయంగా పెరిగిన ‘పత్తి’ విస్తీర్ణం
  • ఇతర పంటల సాగుకూ కొదువ లేదు..
  • ఆశించిన మేరకు వానలు
  • గతేడాది ఇదే నెలలో లోటు వర్షపాతం

 ఆశల సాగు ప్రారంభమైంది.. కోటి అంచనాలతో వానకాలం మొదలైంది.. తెలంగాణ సర్కార్‌ అందజేసిన ‘రైతుబంధు’ సాయంతో రైతులు వడి వడిగా సాగు పనులు మొదలు పెట్టారు.. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ‘వరి’ ప్రస్తుతం నారు దశలో ఉండగా పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే విత్తనాలు విత్తే పని పూర్తయింది.. గతేడాది ఇదే నెలలో లోటు వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది ఆశించిన మేరకు వానలు కురిశాయి.. గతేడాది కంటే నాలుగు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.. మున్ముందూ దండిగా వానలు కురిస్తే సాగు ఇక పండగే..!  

ఖమ్మం వ్యవసాయం: జూలై ఆరంభం నుంచి వరినాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నిరుడు జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరిసాగు చేపట్టి మంచి ఫలితాలు పొందారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం సైతం ఆయా మండలాల రైతులు ఇదే ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీంతో నేటి వరకు 647 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరి విత్తనాలు చల్లారు. వానకాలం సాగు పనులు సకాలంలో కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల ముందే విత్తనాలు, ఎరువులను జిల్లా కేంద్రాలకు పంపించింది. దీంతో పక్షం రోజుల ముందే ఆయా గ్రామాల రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. రైతుబంధు ద్వారా పంటల పెట్టుబడిని సైతం అందించడంతో పొలం పనులు మరింత జోరందుకున్నాయి. 

1.23 లక్షల ఎకరాల్లో పనులు..

జిల్లా వ్యాప్తంగా 5,18,677 ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 1.23 లక్షల ఎకరాల్లో రైతులు సాగు పనులు ప్రారంభించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో అపరాలు, వాణిజ్య పంటలతో పాటు వరి సాగు జరగవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. నేటి వరకు 14,959 ఎకరాల్లో వరి నారు పోశారు. 647 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి విత్తనాలు చల్లుకున్నారు. అంతర్‌ పంటలు 2,791 ఎకరాలు, పెసర 9,754, కంది 454, చెరుకు 1,489 ఎకరాలతో పాటు పత్తిపంటకు సంబంధించి రికార్డు స్థాయిలో 93,017 ఎకరాల్లో విత్తనాలు విత్తే ప్రక్రియ ముగిసింది. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో అపరాల సాగు పూర్తి కానుంది. 

సాధారణం కంటే అధికంగా..

జూన్‌లో జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో వర్షపాతం నమోదైంది. 105.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. నేటి వరకు అధికారుల గణాంకాల ప్రకారం 163.1 మిల్లీమీటర్ల వర్షపాతం సరాసరిగా నమోదైంది. గతేడాది జూన్‌లో జిల్లా వ్యాప్తంగా 105 మిల్లీమీటర్లకు గాను కేవలం 49.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో సాధారణం కంటే అధికాంగానే వర్షపాతం నమోదైంది. ఆశించిన మేర వర్షాలు కురిస్తే వరిసాగు ఆశాజనకంగా ఉండనుంది.

భద్రాద్రి జిల్లాలో విస్తారంగా..

కొత్తగూడెం: వర్షాలు కర్షకులకు కలిసి రావడంతో ఈ ఏడాది వానకాలం పంటల సాగులో పత్తి సాగు ఐదు రెట్లు పెరిగింది. నిరుడు జూన్‌లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఎక్కడా నార్లు పోసే పరిస్థితి కనబడలేదు. ఈ ఏడాది రైతులకు అనుకూల వర్షాలు కురవడంతో పత్తి, వరి సాగుకు ముందడుగు వేశారు. నియంత్రిత సాగు విధానంపై దృష్టి సారించిన రైతులు మక్కలను పక్కన పెట్టారు. పత్తి, కందులు, అపరాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఇప్పటికే జిల్లాలో 65,540 వేల ఎకరాల్లో సాగు పనులు ముమ్మరమయ్యాయి. పత్తి 1,83,416 ఎకరాలకు గాను ఇప్పటికే 64,538 ఎకరాల్లో సాగు మొదలైంది. వరి పంట 1,53,767 ఎకరాలకు గాను 10,039 ఎకరాల్లో వరి నార్లు పోశారు. కందులు 414, పెసలు 202, నువ్వులు 55 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, రైతుబంధు పంట సాయం అందడంతో అన్నదాతలు ఉత్సాహంగా ముందుకు ‘సాగు’తున్నారు.

3,54,337 ఎకరాల్లో సాగు లక్ష్యం.. 

జిల్లాలో 3,54,337 ఎకరాల్లో పంటల సాగుకు వ్యవసాయ అధికారులు ప్రణాళిక తయారు చేశారు. పత్తి 1,83,416, వరి 1,53,767 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇతర పంటలు కూడా నిరుటి కంటే అధికంగానే సాగు కానున్నాయి. 

43.70 శాతం అధికం వర్షపాతం..

సాధారణాన్ని మించి వర్షపాతం నమోదు కావడం కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చింది. నిరుడు జూన్‌లో 54 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ ఏడాది ఇప్పటికే సాధారణాన్ని మించి 43.7 శాతం అధికంగా నమోదైంది. ఇది కూడా రైతు ఎంతో కలిసి వచ్చింది. అధికారుల గణాంకాల ప్రకారం భద్రాద్రి జిల్లాలో నేటి వరకు 181 మిల్లీమీటర్ల వర్షపాతం సరాసరిగా నమోదైంది.

అదునుకు వర్షాలు కురిశాయి..

వానకాలం పంటల సాగు కోసం రైతులకు వర్షాలు కలిసొచ్చాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. అందువల్ల పత్తి ఎక్కువగా సాగవుతున్నది. అన్నదాతలు వరి నారు మళ్లను కూడా ముందుగానే పోశారు. కొన్ని చోట్ల నాట్లు కూడా వేశారు. ఈ సీజన్‌ బాగుంది. 

-కొర్సా అభిమన్యుడు, డీఏవోlogo