సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 26, 2020 , 01:30:40

ఎస్సై, ఇన్‌చార్జి తహసీల్దార్‌, సర్పంచ్‌పై కేసు

ఎస్సై, ఇన్‌చార్జి తహసీల్దార్‌, సర్పంచ్‌పై కేసు

ఖమ్మం లీగల్‌/ సిటీ: ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న కేసులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు, తప్పుడు పత్రాలు సృష్టించినందుకు తిరుమలాయపాలెం ఎస్సై నందీప్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ రాజేశ్‌, సర్పంచ్‌ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి ఎం.లక్ష్మణ్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న తిరుమలాయపాలెం పోలీసులు 13 ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేశారు.
దీంతో వాటి యజమానులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తగిన పూచికత్తు ఇచ్చి ట్రాక్టర్లను విడుదల చేయించుకోవాలని కోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆ ట్రాక్టర్లలోని ఇసుకను వేలం వేసి రిపోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తహసీల్దార్‌ ఆ ఇసుకను వేలం వేయలేదు. కానీ వేలం వేసినట్లు తప్పుడు పత్రాలు సృషించి కోర్టుకు సమర్పించారు. ఆ పత్రాలను పరిశీలించిన జిల్లా జడ్జి చాలా తక్కువ ధరకు వేలం వేసినట్లు గుర్తించారు.
కోర్టు ఆదేశాలను సక్రమంగా అమలు చేయనందుకు ఆగ్రహించిన జడ్జి ఎస్సై, ఇన్‌చార్జి తహసీల్దార్‌, సర్పంచ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొన్ని బెయిలబుల్‌, మరికొన్ని నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు అయినందున వీరిని కస్టడీలోకి ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ముగ్గురిని టూ టౌన్‌ పీఎస్‌కు తరలించగా సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, ఏడీసీపీ మురళీధర్‌ విచారణ చేపట్టారు. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగింది.


logo