సోమవారం 13 జూలై 2020
Khammam - Jun 26, 2020 , 00:45:38

ఉద్యమంలా మొక్కల పెంపకం

ఉద్యమంలా మొక్కల పెంపకం

  • జిల్లాలో 1.40 కోట్ల మొక్కలు నాటుతాం
  • ఆరో విడతను విజయవంతం చేస్తాం
  •  పకడ్బందీగా మొక్కల సంరక్షణ
  • హరితహారం ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • ఖమ్మం, తాటిపూడిలో మొక్కలు నాటిన అమాత్యుడు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేస్తాం.. ఉద్యమస్ఫూర్తితో కార్యక్రమాన్ని  చేపడతాం.. పార్కులు, ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన మొక్కలు నాటుతాం.. నాటిన ప్రతిమొక్కనూ  సంరక్షించేలా చర్యలు తీసుకుంటాం.. పర్యావరణ సమతుల్యతను కాపాడతాం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.. ఖమ్మం నగరంతో పాటు తాటిపూడిలో గురువారం     నిర్వహించిన హరితహారం ప్రారంభోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. సీఎం ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన్ని హరితవనంగా మారుస్తామన్నారు.. ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..      -ఖమ్మం

ఖమ్మం/ వైరా: పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆరో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని గురువారం ఖమ్మంలోని మినీ ట్యాంక్‌బండ్‌, వెలుగుమట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి మొక్కలు నాటి ప్రారంభించారు. జిల్లాలో ఈ ఏడాది 1,40,976 వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించామని, అందుకు అనుగుణంగా 624 నర్సరీల్లో 1,18, 679 వేల మొక్కలు పెంచామని అన్నారు. ఈ సందర్భంగా ఆరో విడత హరితహారం జిల్లా బుక్‌లెట్‌ను, వాల్‌పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. మేయర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత, కేఎంసీ అనురాగ్‌ జయంతి, డీఎఫ్‌ఓ ప్రవీణ, టేకులపల్లి సొసైటీ చైర్మన్‌ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆర్‌జేసీ కృష్ణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

గన్‌మెన్‌తో మొక్క నాటించిన మంత్రి..

వెలుగుమట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పార్కులో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తన గన్‌మెన్‌ సత్యనారాయణతో మొక్క నాటించారు. మంత్రి ఆదేశాల మేరకు క్యాంపు ఆఫీస్‌ సిబ్బందితో ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటారు. 

85 శాతం మొక్కలను బతికించాలి

వైరా: ఉమ్మడి జిల్లాలో రెండు కోట్ల మొక్కలు నాటాలని, వాటిల్లో 85 శాతం మొక్కలను బతికించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని తాటిపూడి గ్రామంలో గురువారం సాయంత్రం ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అజయ్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మొక్కలు సరంక్షించకుంటే సర్పంచ్‌లపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ హరిత తెలంగాణ నిర్మాణమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని అన్నారు. జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కలెక్టర్‌ కర్ణన్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ పార్కును ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శేషగిరిరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

ఖమ్మానికి మరో మణిహారం

ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా వెలుగుమట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పార్క్‌ ఖమ్మానికి మరో మణిహారంగా మారనుందని మంత్రి అజయ్‌కుమార్‌ అన్నారు. నాలుగేళ్లలో పార్క్‌పై ప్రత్యేక దృష్టి సారించి 125 ఎకరాల పార్క్‌ను పునరుద్ధరణతో పాటు వేల సంఖ్యలో మొక్కలు నాటి కొత్త రూపు తెచ్చామన్నారు. గురువారం పార్కులో మంత్రి  మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి సందర్శించారు. logo