గురువారం 02 జూలై 2020
Khammam - Jun 25, 2020 , 04:15:53

ఊరూరా మొక్కలు నాటాలి..

ఊరూరా మొక్కలు నాటాలి..

  • ఎంపీ నామా నాగేశ్వరరావు 

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఊరూరా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించనున్న హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

పచ్చదనం పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని నామా కోరారు. రాష్ట్రంలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, ఇందులో భాగంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ సర్కార్‌ సరికొత్తగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారని నామా పేర్కొన్నారు.

రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం పథకం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఉద్యమంలా నిర్వహిస్తోందన్నారు. దీనిలో భాగంగానే నేటి నుంచి ప్రారంభం కానున్న ఆరో విడత  కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు సమగ్రచర్యలు చేపట్టాలని ఎంపీ నామా అధికారులను ఆదేశించారు.


logo