ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 25, 2020 , 04:13:34

పచ్చదనం విరిసేలా.. పల్లె మురిసేలా..

పచ్చదనం విరిసేలా.. పల్లె మురిసేలా..

  • ఆరో విడత హరితహారం
  • ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమం
  • ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలా మొక్కలు నాటుతాం..
  • ప్రజలను భాగస్వాముల్ని చేస్తాం..
  • పతి గ్రామాన్ని హరితవనంగా మారుస్తాం

‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

 నమస్తే  : ఆరోవిడత హరితహారం లక్ష్యమేమిటి ?

ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభిస్తున్నది.ఉమ్మడి జిల్లాలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హరితహారం ప్రాముఖ్యత, లక్ష్యాలు, నిధుల కేటాయింపును ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. 

- ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ 


మంత్రి పువ్వాడ : వాతావరణంలో ఏర్పడిన సమతుల్యతను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. గత ఐదేళ్లుగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకుంటూనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటాలి. తెలంగాణాలో 24 శాతం ఉన్న అటవీప్రాంతాన్ని 33 శాతానికి పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. పట్టణాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున సామాజిక అడవులను పెంచుతున్నాం. 

నమస్తే : ఖమ్మం జిల్లాలో ఆరవ విడుతలో ఎన్ని మొక్కలు నాటుతున్నారు?

మంత్రి పువ్వాడ : ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది హరితహారంలో 90 లక్షల మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించాం. జిల్లాలో అటవీశాఖ, డీఆర్‌డీవో, మున్సిపాలిటీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో 624 నర్సరీల ద్వారా మొక్కలను పెంచాం. వీటిలో టేకు మొక్కలు 12.49 లక్షలు, పండ్లనిచ్చే మొక్కలు 6 లక్షలు, రహదారుల వెంట నీడనిచ్చే మొక్కలు, ఇతర మొక్కలు కలిపి కోటి 17 లక్షల మొక్కలను పెంచాం. వీటిని స్వచ్ఛందంగా నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

నమస్తే : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ని మొక్కలు? 

మంత్రి పువ్వాడ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోటి 38 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచాం. జిల్లాలోని అన్ని గ్రాపపంచాయతీలు, మున్సిపాలిటీల్లో నాటాలని ఆదేశించాం. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 479 నర్సరీలు, సింగరేణి ఆధ్వర్యంలో 4, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో 4, టీఎస్‌ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ఒక నర్సరీని ఏర్పాటు చేశాం. వీటిలో ఇప్పటికే అన్ని రకాల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

నమస్తే  : నియోజకవర్గాల్లో 

ఎన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయి?  

మంత్రి పువ్వాడ : ఖమ్మం నియోజకవర్గంలో 98,750 మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మధిరలో 33,68, 473 మొక్కలు, పాలేరులో 29,65, 897 మొక్కలు, సత్తుపల్లిలో 37,11,157 మొక్కలు, వైరాలో 19,88,524 మొక్కలు, ఇల్లెందులో 6,95, 775 మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామపంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేశాం. జిల్లాలోని 587 గ్రామపంచాయతీల్లో నర్సరీలు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. 

నమస్తే  : పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం హరితహారానికి నిధుల కేటాయింపు ఎలా ఉంది? 

మంత్రి పువ్వాడ : ఈ చట్టం ప్రకారం ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఆరు పండ్ల మొక్కలు పెంచాలి. సంరక్షణ బాధ్యతను ఇంటి యజమాని తీసుకోవాలి. మొక్కలను పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇంటి యజమానికి ఇంటి పన్నుల్లో జరిమాన విధించాలి. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ నుంచి ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేస్తారు. గ్రామపంచాయతీ పరిధిలోని భూములు, గుట్టల ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటాలి. 

నమస్తే : మొక్కల సంరక్షణకు 

తీసుకుంటున్న చర్యలు?

మంత్రి పువ్వాడ : నాటిన మొక్కలను పెంచే బాధ్యత స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులపై ఉంది. గ్రామపంచాయతీకి సంబంధించి 10 శాతం నిధులను హరితహారానికి ఖర్చు చేస్తున్నందున్న నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ఆ గ్రామంలోని సర్పంచ్‌దే. ఒక వేళ సర్పంచ్‌ మొక్కల సంరక్షణలో జాగ్రత్తలు పాటించకపోతే అతనిపై చర్యలు తీసుకుంటాం. అదే విధంగా మున్సిపాలిటీల్లో కూడా వార్డు కౌన్సిలర్‌కు నూతన పురపాలక చట్టం ప్రకారం ఆ విధమైన బాధ్యతలనే ఇచ్చారు. 

నమస్తే :  ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఎలా ఉంటుంది.? 

మంత్రి పువ్వాడ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం పెద్ద ఎత్తున్న ఉంది. ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామస్థాయిలో నిర్వహించే కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌, ఎంపీటీసీ, వార్డు సభ్యులతో పాటు ఆయా మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, శాసనసభ్యులు కూడా హాజరవుతారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటించి 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. 

నమస్తే  : ఏఏ మొక్కలను నాటబోతున్నారు? 

మంత్రి పువ్వాడ : హరితహారంలో అన్ని రకాల మొక్కలను నాటబోతున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో పండ్ల మొక్కలను ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వాటినే అందిస్తున్నాం. పొలాల గట్లపై టేకు, ఉసిరి, మామిడి, జామాయిల్‌, ఎర్రచందనం, లోతట్టు ప్రాంతాల్లో నల్లతుమ్మ, నేరుడు, తెల్లమద్ది, చెరువు గట్లపై ఈత చెట్లు నాటాలని ఆదేశించాం. ఇవి కాకుండా గానుగ, వేప, జామ, ఉసిరి, దానిమ్మ, బొప్పాయి. కారేపాకు, మునగ, వేప, సుబాబుల్‌, వెదురు, నేరుడు, చింత తదితర మొక్కలను కూడా నాటుతున్నాం. 


logo