గురువారం 09 జూలై 2020
Khammam - Jun 25, 2020 , 04:02:36

హరితహారానికి సర్వం సిద్ధం

హరితహారానికి సర్వం సిద్ధం

  • ఆరో విడత విజయవంతానికి సమగ్ర కార్యాచరణ
  • ఉమ్మడి జిల్లాలో 2 కోట్ల మొక్కలు నాటేలా చర్యలు
  • ఒక్కో ఇంటికి ఆరు మొక్కల పంపిణీ
  • అధికారులు, ప్రజాప్రతినిధులకు సంరక్షణ బాధ్యతలు
  • నేడు ఖమ్మం జిల్లాలో కార్యక్రమాన్నిప్రారంభించనున్న మంత్రి

పల్లెకు పచ్చందాలు తెచ్చే పండగొచ్చింది.. పట్నాలకు కొత్త సొబగులద్దే పర్వం విచ్చేసింది.. హరిత సంకల్పానికి ఊపిరిలూదే వేడుకొచ్చింది.. మొక్కలతో పుడమికి ప్రాణం పోసే తరుణం వచ్చేసింది.. గురువారం నుంచి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఆరో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో రెండు కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించింది.. ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్‌కుమార్‌, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.. ఊరూరా ఉద్యమంలా ‘ప్లాంటేషన్‌' చేపట్టనున్నారు..

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఆరో విడతకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం చేసింది. ఇప్పటికే ఐదు పర్యాయాలు హరితహారాన్ని నిర్వహించిన ప్రభుత్వం గురువారం నుంచి ఆరో విడతకు శ్రీకారం చుడుతున్నది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తొలిరోజు హరితహారాన్ని ఖమ్మం నగరంలోని మినీ లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద మొక్క నాటి ప్రారంభించనున్నారు. రెండో రోజు వైరా, మధిర నియోజకవర్గాల్లో, మూడో రోజు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లాలోని 624 నర్సరీల్లో 1 కోటి 37 లక్షల మొక్కలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 నర్సరీల్లో 1 కోటి 38 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. రెండు జిల్లాల్లో దాదాపు 15 రోజులపాటు హరితహారం కార్యక్రమం కొనసాగనుంది. మంత్రితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. 

ఉమ్మడి జిల్లాలోని 1063 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పెరిగిన మొక్కలను ప్రతి ఇంటికీ ఆరు చొప్పున అందించనున్నారు. ఇవి కాకుండా అటవీశాఖ పెంచిన మొక్కలను అటవీ విస్తరణ కోసం వినియోగించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలతోపాటు అటవీ ప్రాంతాల్లో, రహదారుల వెంట, చెరువుకట్టలపైన, పాఠశాల ఆవరణల్లో మొక్కలను నాటనున్నారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో దాదాపు రూ.8 కోట్లను హరితహారానికి కేటాయించారు. ప్రతి గ్రామ పంచాయతీలనూ 10 శాతం నిధులను ఇందుకు వినియోగిస్తున్నారు. నాటిన మొక్కలను పెంచే బాధ్యతలను ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. కాగా అడవుల పెంపకం, వాతావరణ సమతుల్యత కోసం తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆకు పచ్చని తెలంగాణను రూపొందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.  
నియోజకవర్గానికి 18 లక్షల మొక్కలు..
ఈ ఏడాది జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలో 90 లక్షల మొక్కలు నాటాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో 18 లక్షల మొక్కల చొప్పున పెంచాలని నిర్ణయించింది. 
నాటిన ప్రతి మొక్కా సజీవంగా ఉండాలి.. 
మొక్కలు నాటడంతోనే సరిపోదని, నాటిన ప్రతి మొక్కా సజీవంగా ఉండేలా సంరక్షించాలని ఇటీవల జరిగిన సమావేశంలో ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అధికారులకు స్పష్టం చేశారు. నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగే వరకూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. హరితహారం విజయవంతానికి ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో ఉందో అర్థమవుతున్నది. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్‌ అనుసంధానం చేయనున్నారు.  
నర్సరీల్లో మొక్కల పెంపకం
ఖమ్మంలో జిల్లాలోని 624 ప్రభుత్వ నర్సరీల్లో, అటవీశాఖ ఆధ్వర్యంలో 36 నర్సరీల్లో, డిఆర్‌డీఏ ఆధ్వర్యంలో 584 నర్సరీల్లో, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 4 నర్సరీల్లో మొక్కలను పెంచారు. వాణిజ్య మొక్కల క్రింద టేకు, సుబాబుల్‌, జామాయిల్‌, పూల మొక్కల కింద టేకోమ, గన్నేరు, మందారం, పండ్ల మొక్కల కింద ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, నీడనిచ్చే మొక్కల కింద వేపకానుగ, రావి, మర్రి, సీమ తంగేడు, పెల్టోఫారం, గుల్మోహర్‌ తదితర మొక్కలను నాటనున్నారు. 

తూతూమంత్రంగా నాటొద్దు..

గత హరితహారాల్లో నాటిన మొక్కల్లో ఎక్కువ భాగం ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈసారి కూడా తూతూమంత్రంగా మొక్కలు నాటి తరువాత వదిలేస్తే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయి. ఈ సారి సంరక్షణ బాధ్యతలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. 

హరితహారాన్ని విజయవంతం చేయాలి..

తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం ఖమ్మం జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.37 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచాం. కలెక్టర్‌ కర్ణన్‌ సూచనల మేరకు వివిధ రకాల మొక్కలను నాటాలని ప్రణాళికను రూపొందించాం. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న హరితహారాన్ని నిర్వహించబోతున్నాం. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేస్తాం. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేస్తాం. మొక్కలు నాటి పెంచేలా ప్రజలను చైతన్య పరుస్తాం.  హరితహారానికి నోడల్‌ అధికారులుగా ఎంపీడీఓలు వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో హరితహారాన్ని విజయవంతం చేస్తాం. -ప్రవీణ, ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారిణి, ఇన్‌చార్జి డీఆర్‌డీవో


logo