శుక్రవారం 10 జూలై 2020
Khammam - Jun 23, 2020 , 00:45:56

మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు

మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు

ఖమ్మం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన అనంతరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘దోస్త్‌' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ 2020-21 విద్యాసంవత్సరానికి మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటించింది. లోపాలు లేకుండా ప్రతిభ కలిగిన విద్యార్థి తాను ఎంపిక చేసుకున్న కళాశాలల్లో సీటు పొందేలా, ఇష్టానుసారం అడ్మీషన్లు నిర్వహించే కళాశాలలకు చెక్‌ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం ‘దోస్త్‌'ను అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 5 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 47 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఎన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 5 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 17 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

మూడు విడతల్లో నిర్వహణ..

డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌ ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. http://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. 

4మొదటి విడతలో జూలై 1 నుంచి జూలై 14 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200. దీన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాలి. జూలై 6 నుంచి జూలై 15 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూలై 22న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 23 నుంచి జూలై 27 వరకు విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.

4రెండో విడతలో జూలై 23 నుంచి జూలై 29 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఫేజ్‌-2లో రిజిస్ట్రేషన్‌కు రూ.400 చెల్లించాలి. జూలై 23 నుంచి జూలై 30 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు 7న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 8 నుంచి 12 వరకు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.

4మూడో విడతలో ఆగస్టు 8 నుంచి 13 వరకు రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ ఉంటుంది. ఫేజ్‌-3లో రిజిస్ట్రేషన్‌కు రూ.400 చెల్లించాలి. ఆగస్టు 8 నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ఉంటుంది. ఆగస్టు 19న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 20 నుంచి 21 వరకు సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలి.

సెప్టెంబర్‌ ఒకటి తరగతులు..

వెబ్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సమయంలో విద్యార్థి ఫోన్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్ట్‌ (ఓటీపీ) వస్తుంది. దాని ఆధారంగా ఆప్షన్లు పోందుపరుస్తారు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానంలో కూడా నూతన మార్పులను అమలు పరుస్తున్నారు. వేలిముద్రల వంటివి లేకుండా టీ-యాప్‌ ద్వారా దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే సులువైన ప్రక్రియను రూపొందించారు. ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు సులువుగా ఫేస్‌ రికగ్నజైషన్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మూడు విడతల్లో దోస్త్‌ ప్రక్రియ అనంతరం ఆగస్టు 24 నుంచి 31 వరకు ఒరియెంటేషన్‌ తరగతులు నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 1 నుంచి సెమిస్టర్‌ -1 తరగతులను ప్రారంభిస్తారు. 

నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు

డిగ్రీలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న సులువైన ప్రక్రియ దోస్త్‌. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. గ్రామీణ విద్యార్థులు దోస్త్‌ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లోపాలు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ప్రలోభాలకు లోనుకాకుండా ప్రవేశాలు పొందాలి.

-వీ.మోహన్‌రెడ్డి, చైర్మన్‌, డీఆర్‌ఎస్‌ డిగ్రీ కళాశాలlogo