బుధవారం 08 జూలై 2020
Khammam - Jun 23, 2020 , 00:19:04

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కరోనా కలవరం

ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కరోనా కలవరం

కరోనా వైరస్‌ కలవరం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. సోమవారం ఉమ్మడి జిల్లాలో సోమవారం ఒక్కరోజే 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కేసు నమోదైంది. మణుగూరులో పీకేఓసీ-2 గనిలో పనిచేస్తున్న సింగరేణి ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

మయూరి సెంటర్‌: ఖమ్మం జిల్లాలో 12 మందికి కరోనా వైరస్‌ సోకి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ వర్గాలు సోమవారం రాత్రి వెల్లడించాయి. ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌టీ ప్రాంతానికి చెందిన రైల్వే ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకింది. అతని కాంటాక్ట్స్‌ ద్వారా 20 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 8 మందికి పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. ముదిగొండ, సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడలో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తెలిపాయి. ఎన్‌ఎస్‌టీ రోడ్డులో నమోదైన కాంటాక్ట్‌ ్సకు చెందిన ఎనిమిది మంది జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఎన్‌ఎస్‌టీ రోడ్డు ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన విషయం విధితమే.

మణుగూరు :  సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా పీకేఓసీ-2గనిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌ వెళ్లిన సింగరేణి ఉద్యోగికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది.  కరోనా సోకిన ఉద్యోగి నివాసం ఉండే పీవీ కాలనీ( మల్లారం) ఏరియాను కంటైన్మెంట్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు.  

సత్తుపల్లిలో తొలి పాజిటివ్‌ కేసు నమోదు

సత్తుపల్లి రూరల్‌ : సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో గత 12 రోజుల క్రితం చేరారు. ఈ క్రమంలో ఆ వ్యక్తికి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉండటంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి తహసీల్దార్‌ మీనన్‌, గంగారం పీహెచ్‌సీ వైద్యాధికారి కిరణ్‌కుమార్‌ రాజీవ్‌నగర్‌లోని  ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో పాటు పరిసర ప్రాంతాల వారీ వివరాలను సేకరించారు. ప్రతిఒక్కరూ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. సత్తుపల్లిలో తొలి పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

పెనుబల్లి : పెనుబల్లి మండలంలో సోమవారం కుప్పెనకుంట్లలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో ఆమెను ఖమ్మం ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. 

సింగరేణి కార్మికుడిని హైదరాబాద్‌కు తరలింపు

కొత్తగూడెం సింగరేణి : కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా సోకిన సింగరేణి కార్మికుడిని సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్‌కు తరలించారు. సింగరేణి ప్రధాన ఆస్పత్రి నుంచి 108 వాహనంలో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు.


logo