ఆదివారం 05 జూలై 2020
Khammam - Jun 22, 2020 , 00:40:56

అజాగ్రత్తతో అనర్థం

అజాగ్రత్తతో అనర్థం

  • ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
  • మాస్క్‌ ధరించకుండా బయటకు వస్తున్న ప్రజలు
  • భౌతిక దూరం పాటించకుండా ప్రయాణం
  • తాజాగా గౌతంపూర్‌లో ఓ కార్మికుడికి పాటిజివ్‌
  • అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా అధికారులు
  • ఖమ్మం జిల్లాలో యాక్టివ్‌ కేసులు ఆరు, ‘భద్రాద్రి’లో రెండు 

కరోనా నియంత్రణపై తెలంగాణ సర్కార్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నది.. కొవిడ్‌ నిబంధనలను    పకడ్బందీగా అమలు చేస్తున్నది.. ఎప్పటికప్పుడు     వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేస్తూ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతున్నది.. కానీ..  కొందరు బయటకు      వచ్చేటప్పుడు మాస్క్‌ ధరించకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం   నీరుగారుతున్నది.. ఒకటో విడత లాక్‌డౌన్‌ నుంచి  మూడో విడత వరకు స్వీయ నియంత్రణ పాటించిన ప్రజలు ఆ తర్వాత గాడి తప్పుతున్నారు.. ఫలితంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది.. తాజాగా ఆదివారం భద్రాద్రి     జిల్లాలోని గౌతంపూర్‌లో ఓ కార్మికుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించారు.. పలువురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

-ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం 

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం: కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. అయినా ప్రజల బాధ్యతా రాహిత్యం కారణంగా కొవిడ్‌-19 కట్టడికి చేపట్టిన పకడ్బందీ ప్రణాళికకు భంగం ఏర్పడుతున్నది. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం అవసరాల నిమిత్తం అన్ని వర్గాల ప్రజలు బయటకు వస్తున్నారు. జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నా ప్రజల సహకారం కొరవడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మాస్క్‌లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా అనేకమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్నది.. లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు పాజిటివ్‌ కేసులకే పరిమితమై కరోనా ఫ్రీ జిల్లాగా మారింది. లాక్‌డౌన్‌ సడలించగా దూరప్రాంతాల నుంచి వస్తున్న వారితో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సుకు పాజిటివ్‌ రావడంతో కేసులు సంఖ్య పెరుగుతోంది. తాజాగా పాల్వంచలోని కేటీపీఎస్‌లో పనిచేసే ఏఈకి కరోనా రావడం, బూర్గంపాడులో, గౌతంపూర్‌లో కూడా ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో జిల్లాకు కరోనా భయం పట్టుకుంది. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నా ప్రజల నిర్లక్ష్యం కారణంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

ఖమ్మం జిల్లాలో..

ఈ ఏడాది ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 32కు చేరింది. వీటిలో ఖమ్మం జిల్లాలోని మధిర మండలానికి చెందిన ఓ వ్యాపారి మృతి చెందిన విషయం విదితమే. ముగ్గురు వలస కార్మికులు, 22 మందికి నెగిటివ్‌గా రిపోర్టు వచ్చి మామూలు స్థితికి చేరుకున్నారు. ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చిన వారికి ఓపీ విభాగ సేవల్లో భాగంగా 1053 మంది రక్త పూతలు తీసుకొని వారికి పరీక్షలు నిర్వహించగా 998 మందికి నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పాజిటివ్‌ కేసులకు చెందిన యాక్టివ్‌ కేసులు ఆరు ఉన్నాయి. కాగా ఖమ్మం జిల్లా కామేపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల జలుబు, దగ్గు, జ్వరం బాధపడుతూ ఉండటంతో వైద్యపరీక్షలు నిర్వహింపచేసుకోగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసంది.

జాగ్రత్తలు పాటిస్తే మేలు..

అవసరాల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు భౌతికధూరం పాటించాలి. మాస్క్‌ ధరించాలి. చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. ఎవరికి వారు కరోనా తమకు సోకదనే భ్రమలో ఉంటూ వైరస్‌ వ్యాప్తికి కారకులు అవుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏదైనా శుభకార్యం ఇతర కార్యాలు ఉన్న నేపథ్యంలో వస్త్ర వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు ఆసుపత్రుల వద్దకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలి.

కొత్తగూడెంలో వ్యాధి నిర్ధారణ సెంటర్‌

కరోనా విలయతాండం చేస్తున్న వేళ వైరస్‌ టెస్టింగ్‌ సెంటర్‌ భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఉభయ జిల్లాలకు కలిపి జిల్లా ఆసుపత్రిలో టెస్టింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీబీ టెస్టింగ్‌ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నారు. పరీక్షల కోసం మిషనరీ కూడా తెప్పించారు. మరో వారం రోజుల్లో  పరీక్షలు చేయడానికి సెంటర్‌ ఉపయోగపడనుంది.

బాధ్యతా రాహిత్యం..

ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నా ప్రజలు మాత్రం వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. మాస్క్‌లు ధరించి బయటకు రావాలి లేకపోతే జరిమానాలు విధిస్తామని చెబుతున్నా అవేమీ పట్టించుకోవడంలేదు. మాస్క్‌లు లేకుండా వాహనాలపై ముగ్గురు, నలుగురు ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు మాస్క్‌లు ధరించకుండా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్లపై కూడా గుంపులు గుంపులుగా జనం తిరుగుతున్నారు. ఖమ్మం రూరల్‌ మండలంలో ఓ ప్రైవేటు శుభకార్యంలో కొంత మంది కరోనా వైరస్‌ వ్యాప్తిని లెక్కచేయకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించిన తీరు వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనంగా మారింది. కరోనా వ్యాపిస్తున్న చేస్తున్న సమయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పంచాయతీ కార్యదర్శులే పబ్లిక్‌గా విందు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా విజృంభిస్తే ప్రమాదం..

ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రజలు వాటిని తేలికగా తీసుకుంటున్నారు. మనకేం కాదులే అనుకుంటున్నారు. అక్కడే కేసులు పెరుగుతున్నాయి. ‘మనది గ్రీన్‌ జోన్‌, మనం ఎటైనా తిరగవచ్చు. ఏమైనా చేయవచ్చు, అని ధైర్యంగా ఉంటున్న ప్రజలకు ఉన్నట్టుండి పాజిటివ్‌ కేసులు పెరుగతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.

గౌతంపూర్‌ను కంటైన్మెంట్‌ చేశాం..

చుంచుపల్లి మండలం గౌతంపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి వారి రక్త నమూనాలను సేకరించేలా ఆదేశాలు జారీ చేశాం. కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేస్తున్నాం. ఆ ఇంటి పరిసరాల్లోకి ప్రజలు వెల్లకుండా క్వారంటైన్‌ స్టిక్కర్‌ వేశాం. కాంటైన్మెంట్‌ ఏరియాగా ప్రకటించి ప్రజలను       అప్రమత్తం చేస్తున్నాం.

-భద్రాద్రి కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి

భౌతిక దూరం పాటించాల్సిందే.. 

ప్రజలు భౌతిక దూరం పాటించినప్పుడే వ్యాధి తీవ్రత అదుపులో ఉంటుంది. తొలి రోజుల్లో ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించారు. కేసులు లేకుండా పోయాయి. ఒక్క సారి చెబితే అర్థం చేసుకుంటే సరిపోతుంది. కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనది. పిల్లలు, పెద్దలు, బీపీ, షుగర్‌  ఉన్నవారు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు తప్పని సరిగా ధరించాలి. శానిటైజర్‌ వాడాల్సిందే. షాపుల యజమానులు కూడా నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని. 

-భాస్కర్‌నాయక్‌, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

స్వీయ నియంత్రణ తప్పనిసరి 

స్వీయ నియంత్రణ తప్పనిసరి. ఎవరికి వారు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. గ్లౌజులు వేసుకుంటే కొంతవరకు కాపాడుకోవచ్చు. భౌతికదూరం పాటించాలి. మనం జాగ్రత్తగా ఉంటే చాలదు ఎదుట వారు అలా ఉండరు కాబట్టి ఇటాంటివి పాటించాల్సి ఉంటుంది. బయటవ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విందులు,వినోదాలు మానేయడం మంచిది. ఎక్కువ జనం వచ్చే ప్రదేశాలకు వెళ్లడం కూడా మానేయాలి.

-డాక్టర్‌ రమేశ్‌, జిల్లా ఆసుపత్రి 

సమన్వయకర్త, కొత్తగూడెం

గౌతంపూర్‌ వ్యక్తికి కరోనా

రామవరం: సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని 5 షాప్టులో పనిచేస్తున్న ఓ కార్మికుడికి కరోనా నిర్ధారణ కావడంతో గౌతంపూర్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏరియాలోని 5 షాప్టు బదిలీ వర్కర్‌ యాక్టింగ్‌ వెల్డర్‌గా విధులు నిర్వహిస్తున్న సదరు వ్యక్తి గత కొన్ని రోజులుగా సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి శనివారం కరోనా పరిక్షనిమిత్తం శాంపిల్‌ సేకరించి గాంధీ ఆసుపత్రికి పంపించారు. ఆదివారం ఫలితాలలో కరోనా అని నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో చుంచుపల్లి మండల తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో రమేష్‌, వైద్యులు వాణి, గౌతంపూర్‌లోని టీ2/1, 2 బ్లాకులను సందర్శించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించారు. అతనితో పాటు పనిచేసిన 15 మంది కార్మికులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వారి వెంట గని ఏజెంట్‌ బైద్య, ఏరియా వైస్‌ప్రసిడెంట్‌ ఎండీ రజాక్‌, మేనేజర్‌ శ్రీనాధ్‌, డీజీఎం పర్సనల్‌ శ్యాముల్‌ సుధాకర్‌, సంక్షేమాధికారి అనిల్‌, టీబీజీకేఎస్‌ నాయకులు బోయపాటి నాగేశ్వరరావు, చిరంజీవి ఉన్నారు.logo