శుక్రవారం 03 జూలై 2020
Khammam - Jun 21, 2020 , 01:14:20

దూరం దూరం జరగండి

దూరం దూరం జరగండి


  • బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ప్రజలు
  • అవగాహన కల్పిస్తున్నా.. శ్రద్ధ వహించని వైనం
  • ఖమ్మం నగరంలో నమోదైన మరో కరోనా కేసు..
  • మాస్క్‌ ధరించడం, భౌతికదూరమే ప్రధానం..
  • ఆందోళనలో అధికార యంత్రాంగం..
  • కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అందుబాటులో వైరస్‌ నిర్ధారణ పరీక్షల కేంద్రం
  • ఉమ్మడి జిల్లాల్లో నాలుగు కేసుల నమోదు

ఖమ్మం, నమస్తే తెలంగాణ : బాధ్యతా రాహిత్యం పెనుప్రమాదానికి గురి చేస్తున్నది.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నా ప్రజలు నిర్లక్ష్యంతో గుంపులుగా బయట సంచరిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొవిడ్‌-19 కట్టడికి తీసుకుంటున్న పకడ్బందీ ప్రణాళికకు భం గం ఏర్పడుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విచ్చల విడిగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం వివిధ అవసరాల నిమిత్తం అన్ని వర్గాల ప్రజలు బయటకు వస్తున్నారు. జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నా ప్రజల సహకారం కొరవడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా భౌతిక దూరం పాటించకుండా అనేకమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల ప్రమాదం పొంచి ఉంది. మాస్క్‌లు లేకుండా ఒకే వాహనంపై ఇద్దరు, ముగ్గురు, కార్లలో ఎక్కువమంది ప్రయాణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలంపుతో వివాహాది శుభకార్యాలు విస్త్రతంగా జరుగుతుండటంతో వందలాది మంది పాల్గొనే ప్రదేశాల్లో సరైన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైరస్‌ విస్తరణకు అవకాశం ఏర్పడుతున్నట్లు పలువులు పేర్కొంటున్నారు. 

కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ఖమ్మం జిల్లాలోని బోనకల్లులో ఒకరికి, ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ రోడ్డులో మరొకరికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో కేటీపీఎస్‌ ఉద్యోగికి, బూర్గంపహాడ్‌లోని ఓ దుకాణంలో పని చేస్తున్న వ్యక్తికి శనివారం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బోనకల్లు, ఎన్నెస్పీ రోడ్డులోని ఇద్దరు వ్యక్తులు రైల్వేశాఖలో పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్న ఓ అధికారి భార్య విజయనగరంలో ఉంటున్నారు. ఆమె వద్దకు ఆ అధికారి తరచూ వెళ్లి వస్తుండటంతో అతనికి వైరస్‌ సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ రోడ్డులో ఉంటున్న వ్యక్తి కూడా ఖమ్మంలోనే రైల్వే డిపార్డుమెంట్‌లో పని చేస్తున్నాడు. అతను విజయవాడకు చెందిన వాడు. అతని అత్తగారిల్లు ఖమ్మంలోనే ఉండటంతో ఇక్కడికి వస్తుంటాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పాల్వంలో గల కేటీపీఎస్‌లో పని చేస్తున్న ఓ అధికారికి పాజిటివ్‌ అని తేలింది. ఈయన ఇటీవల వేరే ప్రాంతానికి బదిలీ అయ్యాడు. ఈ నెల 12 వరకు ఇక్కడే విధులు నిర్వహించారు. అప్పుడు జ్వరం, దగ్గు రావడంతో పరీక్షలు చేయించుకున్నాడు. ఈ నెల 17న పాల్వంచలోని కార్యాలయానికి వచ్చి బదిలీ ఆర్డర్‌ తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బూర్గంపహాడ్‌లోని ఓ బంగారు నగల దుకాణంలో ఏపీలోని కూనవరానికి చెందిన వ్యక్తి గుమస్తాగా పని చేస్తున్నాడు. అతను రోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాడు. అతనికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య సిబ్బంది గుర్తించడంతో తక్షణమే ఏపీలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో నాలుగు రోజుల క్రితం మరో కరోనా కేసు నమోదైంది.

ఖమ్మం జిల్లాలో 29కి చేరిన కేసులు

ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 29 కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలామంది చికిత్స అనంతరం పరీక్షలో నెగిటివ్‌ రావడంతో ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం మధిర ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేలకొండపల్లికి చెందిన ఆరుగురు ఖమ్మంలోని క్వారంటైన్‌ కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. వైరస్‌ పరీక్షలను ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ జర్వతీవ్రత ఉన్న వ్యక్తుల నుంచి రక్తనమూనాలు సేకరించి కొత్తగూడెంలోని వైరస్‌ నిర్ధారణ కేంద్రానికి పంపుతున్నారు. గంట వ్యవధిలోనే రిపోర్టు వస్తున్నది. ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేశారు. దీంతో పాటు వరంగల్‌ క్రాస్‌రోడ్డులోని స్వర్ణభారతి ట్రైనింగ్‌ సెంటర్‌లో 300 పడకలు, రఘునాథపాలెం మండలంలోని శారధ కళాశాలలో 500 పడకలు, మద్దులపల్లి యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో 100 పడకలు ఏర్పాటు చేసి వైద్య సేవలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెంలోని టీబీ టెస్టింగ్‌ సెంటర్లలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి క్వారంటైన్‌ కోసం అందుబాటులో ఉంచారు. అధికార యంత్రాంగం వ్యాధి నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా ఉమ్మడి జిల్లా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 


logo