గురువారం 01 అక్టోబర్ 2020
Khammam - Jun 21, 2020 , 01:11:40

రైతు వేదిక మంచి కదలిక

రైతు వేదిక మంచి కదలిక

  • భద్రాద్రి జిల్లాలో 67 ‘వేదికల’ నిర్మాణం
  • ఒక్కో నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు
  • రంపల్లి బంజరలో మొదటి నిర్మాణానికి  మంత్రి అజయ్‌ శంకుస్థాపన
  • యాసంగి సాగు కల్లా అందుబాటులోకి భవనాలు

రైతును రాజు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలూ పనిచేస్తున్నది.. వలస పాలకుల పాలనలో దగా పడిన రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నది.. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చింది.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సైతం వ్యవసాయం వైపు మళ్లేలా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని విధంగా కేసీఆర్‌ సర్కార్‌ రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లను అందజేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది.           

-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ 


రైతులకు సహాయకారిగా..

నియంత్రిత వ్యవసాయ విధానాన్ని రూపొందించి, సమగ్రంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రైతుకు లాభాలను తెచ్చిపెట్టే పంటలనే వేయాలని సూచిస్తున్నారు. రైతువేదికల ఏర్పాటు తర్వాత రైతుబంధు సమితులు వ్యవసాయ రంగ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనున్నాయి. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక అందుబాటులోకి రానుంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సమావేశమై పంటలపై చర్చించనున్నారు.

క్లస్టర్ల వారీగా 67 రైతు వేదికల నిర్మాణం

జిల్లాలో ఉన్న క్లస్టర్ల వారీగా 67 రైతు వేదిక భవనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం ఒక్కో నిర్మాణానికి రూ.10 లక్షలు, ఉపాధి నిధులు రూ.10లక్షలు.. మొత్తం రూ.20లక్షలు కేటాయించి సుమారు అర ఎకరా స్థలంలో నిర్మాణాలు జరుగనున్నాయి. గురువారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు మోరంపల్లిబంజరలో తొలి రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. వచ్చే యాసంగి కల్లా నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేనున్నారు. 

యాసంగి కల్లా అందుబాటులోకి వేదికలు

వచ్చే యాసంగి సీజన్‌ కల్లా రైతు వేదికల నిర్మాణాలను జిల్లాలో పూర్తి చేయనున్నారు. అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డికి సూచించారు. వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, అధునాతన సాంకేతిక పద్ధతులను ఈ వేదికల ద్వారా రైతులందరూ తెలుసుకునేలా వ్యవసాయ అధికారులు చర్య లు తీసుకోనున్నారు. ఏఈవోలు, శాస్త్రవేత్తలు, క్లస్టర్‌కు సంబంధించిన భూసార పరీక్షలు చేసేందుకు పరీక్షా కేంద్రం, సాగులో మెళకువలు తెలిపేందుకు వ్యవసాయ క్యాలెండర్‌ను అనుసరించనున్నారు.

సమగ్ర వ్యవసాయ విధానానికే రైతు వేదికలు

గతపాలకుల కాలంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలులోకి తెచ్చారు. పం టమార్పిడి పద్ద్ధతులను అవలంభించడం ద్వారా వ్య వసాయంలో లాభాలు ఆర్జించవచ్చని బలంగా న మ్మిన సీఎం ఆ దిశగా రైతులను సమాయత్తం చేసేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించి జిల్లాల వారీగా అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని రైతులకు సూచించారు. పంట భూములను బట్టి ఏ పంట వేస్తే దిగుబడులు అధికంగా వచ్చి లాభాలు వస్తాయో చూసి అందుకు అనుగుణంగా అధికారులు రైతులను సమాయత్తం చేసి పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 

ఇప్పటికే స్థల సేకరణ పూర్తి

జిల్లా వ్యాప్తంగా 67 రైతు వేదికల నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో అధికారులు స్థల సేకరణ పూర్తి చేసి పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీంతో కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి రైతు వేదికల నిర్మాణాలకు ఆమోదముద్ర వేసి ప్రభుత్వ నిధులతో పాటు ఉపాధి నిధులను కూడా కేటాయించి సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సుమారు అరెకరం స్థలాన్ని ప్రతీ వేదికకు కేటాయించి అత్యధిక మంది రైతులు వేదిక భవనంలో సమావేశమై సంబంధిత నిర్ణయాలు తీసుకునే విధంగా అత్యంత సుందరంగా నిర్మాణాలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు.

చర్చా వేదికలుగా రైతు వేదికలు.. 

రైతు వ్యవసాయపరంగా సమగ్ర విషయాలను తెలుసుకునేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సీఎం కేసీఆర్‌ పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతుల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే రైతులందరూ ఒక చోట చేరి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మెళకువలు, దిగుబడి అనంతరం మద్దతు ధర తదితర విషయాలను చర్చించుకునేందుకు రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణంతో పాటు రైతులను వ్యవసాయ రంగంలో నిష్ణాతులను చేసే క్రతువులో రైతుబంధు సమితులు కీలకపాత్ర పోషించనున్నాయి. 

-అంకిరెడ్డి కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు


logo