మంగళవారం 14 జూలై 2020
Khammam - Jun 20, 2020 , 02:08:36

కాకర సాగులో ప్రారంభమైన దిగుబడి

కాకర సాగులో ప్రారంభమైన దిగుబడి

  • మార్కెట్‌కు తరలిస్తున్న అన్నదాతలు
  • నిరంతర విద్యుత్‌తో  పెరిగిన సాగు విస్తీర్ణం

వానకాలం సీజన్‌లో ఇల్లెందు ఏజెన్సీలో తొలిపంట పండింది.. అన్నదాత ఇంటికి చేరుతోంది. అనేక ఏళ్లనుంచి తొలిపంటగా రైతులను ఆదుకుంటున్న కాకర సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి ఏటా 200 నుంచి 250 ఎకరాల వరకు సాగవుతోంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు విస్తారంగా పెరగడం, నిరంతర విద్యుత్‌ అందుబాటులో ఉండటంతో 300 ఎకరాల వరకు చేరుకుంది. ప్రస్తుత వానకాలంలో తొలి పంట ఇంటికి చేరడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.     -ఇల్లెందు రూరల్‌

 సాధారణంగా ఏ పంట అయినా తొలకరి జల్లు కురిసిన వెంటనే అన్నదాతలు సాగు ప్రారంభిస్తారు. కానీ కాకర సాగు మాత్రం ఏప్రిల్‌ చివరి వారం నుంచే ప్రారంభమవుతుంది. మండుటెండలో దుక్కులు సిద్ధం చేయడంతోపాటు విత్తనాలు విత్తుకోవడం, మొలకను బతికించుకునేందుకు నీటి తడులు వంటి పనులన్నీ భానుడు భగ భగల మధ్య కొనసాగుతాయి. ఈ సమయంలో రైతులు మండుటెండలకు ఎదురేగి కాకర సాగును విజయవంతం గా చేపడుతున్నారు. జిల్లాలో కాకర పంట ఇల్లెందు మండలంలోనే అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

ఎకరాకు పెట్టుబడి రూ.70వేలు.. 

ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో విత్తుకునే విత్తనాలు రూ.15వేలు ఉంటాయి. కర్రలతో పందిరి ఏర్పాటు, బైండింగ్‌, ప్లాస్టిక్‌ వైర్లు, దుక్కులు సిద్ధం చేయడం తదితరాల ఖర్చు సుమారు రూ.20 వేల వరకు ఉంటుంది. వీటితోపాటు పురుగు మందుల పిచికారీ, పంట కోయడం వంటి ఖర్చు రూ.30 వేల వరకు ఉంటోంది.  ఎటువంటి తెగుళ్లు ఆశించకుంటే మొత్తంగా పెట్టుబడి వ్యయం రూ.60వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుంది. తెగుళ్లు ఆశిస్తే పెట్టుబడి మరో రూ.10 వేలు పెరిగే అవకాశం ఉంటుంది. 

విక్రయమే అసలు సమస్య  

కాకర సాగులో మంచి దిగుబడి వస్తే ఎకరాకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వస్తుందని, ఖర్చులు పోను ఎకరాకు రూ1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు మిగులుతాయని రైతులు చెబుతున్నారు. కానీ పంటను విక్రయించుకునేందుకు రైతులకు అవకాశాలు లేకపోవడంతో వ్యాపారుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. ఉదాహరణకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కాకర కిలో రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కానీ రైతులు చేను నుంచి మార్కెట్‌ వరకు తీసుకొచ్చి వ్యాపారికి విక్రయిస్తే రైతుకు చెల్లించేది కిలోకు రూ.10 నుంచి రూ.15 మాత్రమే. దిగుబడి మరింతగా పెరిగితే మార్కెట్‌లో వ్యాపారులు ధరలు మరింత తగ్గించడంతో రైతులు ఆశించిన మేర లాభాలు పొందలేకపోతున్నారు.  

మార్కెట్‌ సౌకర్యంతో సత్ఫలితాలు 

కూరగాయల సాగుకు కేంద్రబిందువుగా వర్ధిల్లుతున్న ఇల్లెందు ఏజెన్సీ రైతులకు తమ పంటలను స్వయంగా విక్రయించుకునే సదుపాయం కల్పించాలి. తద్వారా రైతులు ఆశించిన లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పంట చేతికందే సమయంలో వ్యాపారులు క్రమంగా ధరలు తగ్గించడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది.     - మంచె రమేశ్‌, 

రైతు, కొమరారం, ఇల్లెందు మండలం


logo