గురువారం 02 జూలై 2020
Khammam - Jun 20, 2020 , 02:02:06

స్థల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

స్థల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

n విలీన పంచాయతీలు, నూతన  మున్సిపాలిటీలకు వర్తింపు

n సెప్టెంబర్‌ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌  (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)  గడువు 

n రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి   కేటీఆర్‌ ప్రకటనపై హర్షం

n అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో  ఉంచుకుని అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నది. భవిష్యత్‌ తరాలకు   పట్టణీకరణ అనేది ప్రధానమైన  అవసరం కాబట్టి, పకడ్బందీగా నగరాల విస్తరణ వైపు అడుగులు వేస్తున్నది.  పట్టణవాసుల్లో అవగాహన రాహిత్యం వల్ల ఎదురవుతున్న పరిస్థితులను  చక్కపెట్టడంలో ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నది.  నివసిస్తున్న స్థలాలకు క్రమబద్ధీకరణ లేక ఇబ్బంది పడుతున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువు పెంచుతూ  ఉత్తర్వులు జారీ చేసింది. విలీన  గ్రామాలతో పాటు నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు  మరోమారు ప్రభుత్వం అనుమతి  తెలిపింది. 

-ఖమ్మం, నమస్తే తెలంగాణ

మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ..

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి కేటీఆర్‌ మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో మార్పు కనిపించేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. రోడ్లు, పచ్చదనం, శ్మశానవాటికల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో మెజారిటీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉన్నందున పట్టణాలను, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ చట్టంలోని విధులు కచ్చితంగా పాటించేలా అధికారులు పనిచేయాలని అన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులంతా 2018 మార్చి నెలాఖరు లోగా ఆయా గ్రామ పంచాయతీల్లో లేవుట్లు చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఉండి ఉండాలి. ఈ అవకాశం వల్ల రాష్ట్రంలోని 43 నూతన మున్సిపాలిటీలతో పాటు అనేక గ్రామ పంచాయతీల్లోని ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుంది.

ఖమ్మం  జిల్లాలో..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడిన ము న్సిపాలిటీలతో పాటు, పలు విలీన పంచాయతీల ప్రజలకు ఈ పథకం ఉపయోగపడనుంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా నూతనంగా మున్సిపాలిటీలుగా రూపొందాయి. అలాగే ఖమ్మం నగరం పరిధిని విస్తృత పరచడంలో భాగంగా అనేక గ్రామాలు నగరంలో విలీనమయ్యాయి. 50 డివిజన్లుగా ఉన్న ఖమ్మం నగరపాలక సంస్థ ప్రస్తుతం విలీన గ్రామాలతో కలిపి 60 డివిజన్లుగా విస్తరించనుంది. ఖమ్మంలో పెద్దతండా, గుర్రాలపాడు, గుదిమళ్ల, వెంకటగిరి, పోలేపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాలు వీలినమయ్యాయి.

భద్రాద్రి జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. క్రమబద్ధీకరణకు గడువు పెంచడంతో ఆయా మున్సిపాలిటీల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. 

ఆదాయం పెరిగే అవకాశం..

క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఎక్కువగా వస్తాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పట్టణవాసులకు మరింత అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం 20-40 శాతం పెరిగే అవకాశం ఉంది. దీని వలన అభివృద్ధి త్వరితగతిన జరిగేందుకు వీలవుతుంది. ప్రధానంగా విలీన పంచాయతీల్లో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ వంటి పథకాల ద్వారా లభించే ఆర్థిక వనరులతో మౌలిక సదుపాయాల కల్పన జరుగనుంది. సైడు కాలువలు, రోడ్లు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి.

సదవకాశం లభించింది..

విలీన గ్రామాల ప్రజలకు ప్రభుత్వం సదవ కాశం  కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంపు వల్ల స్థలాల క్రమబద్ధీకరణ చేసుకునే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఖమ్మం నగర పరిధిలోకి అనేక గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. వీటితో పాటు జిల్లాలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడం వల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రజలకు వసతులు పెరుగుతాయి.. 2018 మార్చి వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లాలోని పట్టణవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.  -అనురాగ్‌జయంతి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌


logo