మంగళవారం 07 జూలై 2020
Khammam - Jun 18, 2020 , 02:58:31

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

  • గడిచిన 24 గంటల్లో 15.4మిల్లీ మీటర్ల వర్షపాతం
  • జోరందుకున్న సాగు పనులు

ఖమ్మం వ్యవసాయం : నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఇదే అదునుగా భావించి రైతులు ఎవుసం పనులను ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా 15.4మిల్లీ మీటర్ల వర్షపాతం నమ్దైంది. ఖమ్మం నగరంతో పాటు దాదాపు అన్ని మండలాల్లో మోస్తరు నుంచి బారీ వర్షం కురిసింది.. దీంతో పత్తి విత్తనాలు నాటే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. 

22 వేల ఎకరాల్లో పనులు షురూ..

ఈ వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 5,18,677 ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి.. 2.30 లక్షల ఎకరాల్లో వరి, 2.43 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగనుంది. గతంలో కాకుండా ఈసారి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నియంత్రిత పద్ధతిలో సాగు సాగనుంది.

వరిలో సన్న రకాల సాగుతో పాటు, పత్తి కంది ఎక్కువ మొత్తంలో సాగు జరుగనుంది. అందుకు అనుగణంగా వ్యవసాయశాఖ, తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ రైతులకు అవసరమైన మేర విత్తనాలు పంపిణీ చేశాయి. బుధవారం వరకు 22 వేల ఎకరాల్లో సాగు పనులు షురూ అయ్యాయి. ప్రధానంగా పత్తి పంటకు సంబంధించి 15,660 ఎకరాలు, వరి నారు మళ్లు 4,587 ఎకరాలు, పెసర 2,015 ఎకరాలు, కంది 160 ఎకరాలు, చెరుకు 538 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. అదును తగినట్లుగా పదును జత కలవడంతో మైదాన ప్రాంతం మొదలు కొని ఆయకట్టు ప్రాంత రైతులు సాగు పనుల్లో వేగం పెంచారు. పత్తి, అపరాల సాగు పనులు రైతులు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 29 ఎకరాల్లో వరి విత్తనాలు చల్లారు. వారం రోజుల్లో రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అర్హత కలిగిన రైతుల వివరాలను రాష్ట్ర ఉన్నతాధికారులకు అందజేశారు. 

గడిచిన 24గంటల్లో 15.4 మి.మీ..

గడిచిన 24 గంటలో ్ల(మంగళవారం ఉదయం నుంచి బుదవారం ఉదయం వరకు)జిల్లా వ్యాప్తంగా 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం రాత్రి ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గంలోని పలు మంలాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వేంసూరు మండలంలో 38.8 మి.మీ, బోనకల్‌ మండలంలో 36.4 మి.మీ సత్తుపల్లి మండలంలో 30.2 మి.మీ. పెనుబల్లి మండలంలో 27.6 మి.మీ, తిరుమలయపాలెం మండలంలో 22.4 మి.మీ మధిర మండలంలో 22.6 మి.మీ, మిగిలిన మండలాల్లో 10-20 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 


logo