ఆదివారం 12 జూలై 2020
Khammam - Jun 18, 2020 , 02:48:04

రూ.1,772 కోట్లు కాలువల పాలు

రూ.1,772 కోట్లు కాలువల పాలు

  • ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనం వృథా
  • కమీషన్ల కోసం.. తవ్విన కాలువలకు బిల్లులు మంజూరు 
  • రీడిజైనింగ్‌ చేసి ‘సీతారామ’కు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్‌
  • 37.40 టీఎంసీలను అధికంగా వినియోగించుకునేలా సామర్థ్యం పెంపు  

ఇప్పుడు గురువింద నీతులు చెప్తున్న కాంగ్రెస్‌ నేతలు వారి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరిట రూ.వేల కోట్లు వృథాచేశారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి అడ్డదిడ్డంగా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. ఈ పనుల ద్వారా అవినీతికి బాటలు వేసినట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. లేనిపోని ప్రాజెక్టుల ద్వారా ప్రజాధనం వృథాకావడమే కాక వాటితో ఎలాంటి ప్రయోజనం లేకపోవడం గమనార్హం. స్వరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత వాటిని రీడిజైనింగ్‌ చేసి సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి పూనుకున్నారు.

- ఖమ్మం, నమస్తే తెలంగాణ

రూ.13,384 కోట్లతో సీతారామ నిర్మాణం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6,74,387 ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై సీతారామ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. రూ.13,384 కోట్ల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. మూడు పంపు హౌజ్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలం కమలాపురం, చాపరాళ్లపల్లి వద్ద మూడు పంపుహౌజ్‌ల నిర్మాణం చేపట్టి వాటి ద్వారా మొత్తం 70.40 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది ప్యాకేజీల ద్వారా పనులు జరుగుతున్నాయి. వందలాది కిలోమీటర్ల దూరం కాలువలు నిర్మించి ఉమ్మడి జిల్లాలో 6,74,387 ఎకరాలను సస్యశ్యామలం చేయనున్నారు.

కాంగ్రెస్‌ పాలనలో ప్రజాధనం వృథా..

గోదావరిపై అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద (సర్‌ ఆర్దర్‌కాటన్‌ నిర్మించిన దుమ్ముగూడెం ఆనకట్ట) నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు, వేలేరుపాడు మండలం రుద్రంకోట (పోలవరం ముంపు మండలంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విలైనమైంది) వద్ద నిర్మించతలపెట్టిన రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టు ఇప్పుడు కనుమరుగయ్యాయి.

రాజీవ్‌సాగర్‌ను రూ.1247 కోట్లతో 7 ప్యాకేజీలుగా నిర్మించేందుకు అగ్రిమెంట్‌ జరిగింది. పనులు జరుగకపోయినా అప్పటి కాంగ్రెస్‌ ఫ్రభుత్వం రూ.872 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించింది. ఇందిరాసాగర్‌కు రూ.1145 కోట్లతో అగ్రిమెంట్‌ జరుగగా తవ్విన కాలువలకు రూ.900 కోట్లు చెల్లించింది. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనమయ్యాయి.

రుద్రంకోట కూడా ఏపీలోకి వెళ్లడంతో ప్రాజెక్టు రూపమే కనుమరుగైంది. కాలువలు పూడిపోయాయి. మిగిలిన ఇందిరాసాగర్‌ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకంగా రూపకల్పన చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ డిజైన్‌ ప్రకారం ఇందిరాసాగర్‌ సామర్థ్యం 16.5 టీఎంసీలు, రాజీవ్‌సాగర్‌ సామర్థ్యం 16.5 టీఎంసీలుగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల సామర్థ్యం కలిపినా 33 టీఎంసీలే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీతారామకు రీడిజైన్‌ చేయడంతో మొత్తం సామర్థ్యం 70.40 టీఎంసీలకు చేరింది. అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం చూపబోయిన సామర్థ్యం కంటే దాదాపుగా 37.40 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. 


logo