గురువారం 16 జూలై 2020
Khammam - Jun 17, 2020 , 03:45:45

రైతులందరికీ పెట్టుబడి సాయం..

రైతులందరికీ పెట్టుబడి సాయం..

  • వానకాలంలో ముందుగానే అందజేత
  • పది రోజుల్లో జిల్లాలకు నిధులు విడుదల..
  • వేలాది మంది రైతులకు చేకూరనున్న లబ్ధి..
  • సీఎం కేసీఆర్‌ పిలుపుతోనియంత్రిత సాగుకు సన్నద్ధం

‘అన్నదాతలు సాగును సంబురంగా చేసుకోవాలె.. ప్రభుత్వం సూచించిన పంటలపై వారికి అవగాహన కల్పించాలె.. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు సహకారం అందించాలె’ అని  సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయాన్ని సరైన మార్గంలో నడిపించే ప్రక్రియ వేగవంతమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో రైతులందరికీ పంటల పెట్టుబడి ముందే అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని  ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డిలను ఆదేశించారు.   

ఖమ్మం, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రక్రియ వేగవంతమైంది. రైతులకు అధిక లాభాలు వచ్చేలా నియంత్రిత సాగును అమలులోకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో పంటలు కోతకొచ్చినప్పుడు కల్లాలకు ఇబ్బంది పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కల్లాలను నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారు. వీటిని ఉపాధిహామీ పథకం నిధులతో నిర్మించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నది. దీంతో గ్రామీణ కూలీలకు పనులతోపాటు రైతులకు కావాల్సిన కల్లాలు అందుబాటులోకి వస్తాయి. కరోనా కష్టకాలంలోనూ రైతన్నలకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కలెక్టర్లు, డీపీవో ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పనులపై ముఖ్యమంత్రి  మార్గదర్శనం చేశారు. రైతుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే తలమానికంగా ఉన్నాయన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు సంక్షేమం పట్ల ఆసక్తితో ఎదురు చూస్తున్నాయన్నారు. రైతులు సేద్యం చేయాలంటే ఇబ్బంది పడకుండా ముందుగా పంట పెట్టుబడి పెట్టి ఆదుకుంటున్నామని ఆయన అన్నారు. నియంత్రిత సాగువల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెప్పారు. తెలంగాణలో సేద్యానికి అనువైన భూములున్నాయని, వాటిలో పంట సిరులు కురిపించేందుకు, సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. అభివృద్ధికి  అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్నాయన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పనులు చేసుకోవడానికి ఉపాధిహామీ పథకాన్ని వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలన్నారు. రైతులు పండించిన పంటలు ఎండబెట్టుకోవడానికి ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గ్రామం ప్రతి రోజూ శుభ్రం కావాల్సిందే అన్నారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను  నిర్మించాలని, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, అందుకు అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్‌ కార్డు తయారు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

మంత్రి అజయ్‌కుమార్‌ చొరవతో..

జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రైతులు పండించిన పంటకు రైతుబంధు పథకంలో రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకువచ్చి రైతులను ఆదుకుంటున్నారు. జిల్లాలో నియంత్రిత సాగు పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, రైతాంగాన్ని చైతన్యపర్చే కార్యక్రమాలను రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. ప్రతిరైతుకు పంటపెట్టుబడి అందేలా చర్యలు తీసుకుంటూ ప్రగతిపథంలో జిల్లాను నడిపిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతు వేదికల నిర్మాణాలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ప్రధానంగా వానకాలం పంట దిగుబడిని పెంచే విధంగా రైతులకు అవసరమైన సూచనలివ్వాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సక్రమంగా అమలయ్యే విధంగా నిరంతరం పాటుపడుతున్నారు.


logo