గురువారం 09 జూలై 2020
Khammam - Jun 16, 2020 , 02:43:10

తియ్యని ఔషధం..!

 తియ్యని  ఔషధం..!

ఔషధం తియ్యగా ఉంటుందా..?ఏమో.. ఉండకపోవచ్చు..తీపి పదార్థమే ఔషధమైతే...?!

ఆహా... మహాభాగ్యం.. రకరకాల ఆరోగ్య సమస్యలను మటుమాయం చేసే, మీ మెదడుకు చురుకుదనాన్ని అందించే దివ్యౌషధం ఒకటుందని, అది మధురాతి మధురంగా ఉంటుందని మీకు తెలుసా..? ‘వావ్‌... వండర్‌...’ అనిపించే ఆ ‘ఔషధాన్ని’ మీ ముందుకు తీసుకొచ్చాం... ఇంకెందుకు ఆలస్యం... మింగేయండి...!

రామవరం: దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మలబద్దకం, అజీర్తి, గ్యాస్‌ ట్రబుల్‌, విరేచనాలు, ఊబకాయం, నిస్సత్తువ, రక్తహీనత, రక్త శుద్ధి, గుండెపోటు.. ఇలా అనేకానేక ఆరోగ్య సమస్యలను మన నుంచి దూరంగా నెట్టేసే మధురాతి మధురమైన ఆ దివ్యౌషధం పేరు.. తేనె..!! మనకు ప్రకృతి అందించిన ఈ స్వచ్ఛమైన ‘మందు’కు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు.

ఇలా తయారవుతుంది..

తేనె తయారీ గురించి మనందరికీ తెలుసు. అయినా సరే.. రెండు ముక్కలు చెప్పుకుందాం. పువ్వుల్లోని మకరందం నుంచి తేనెటీగలు సేకరించిన ద్రవ పదార్థాన్నే ‘తేనె’ అంటారు. పుష్పాల్లోని మకరందాన్ని తేనెటీగలు పీలుస్తాయి. వాటి కడుపు నుంచి రంగు రంగుల ద్రవ పదార్థం వెలువడుతుంది. అదే తేనెగా తయారవుతుంది. స్వచ్ఛమైన తేనె ఎన్నటికీ చెడిపోదు. ఎందుకంటే.. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం తక్కువగా ఉంటుంది. 18 శాతానికన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మజీవులు కానీ, ఏ ఇతర జీవులు కానీ తిరగవు. అందుకే ఇది పులవదు, పాడవదు. పంచదారకన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనెలో క్రిమిసంహారక గుణాలెన్నో ఉన్నాయి. మన శరీరంలోని వినాశకర బ్యాక్టీరియాను ఇది చంపేస్తుంది. ఇందులో వ్యాధి నివారణ శక్తి ఎక్కువగా ఉంటుంది. పంచదారను కనిపెట్టక ముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానేనట..! 

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

ఈ దివ్యౌషధం వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ (షుగర్‌) వ్యాధిగ్రస్తులు ప్రకృతి/ఆయుర్వేద వైద్యుల సూచనలకు అనుగుణంగా మాత్రమే తేనెను వాడడం మంచిది. చిన్న పిల్లలకు, మరీ ముఖ్యంగా ఏడాదిలోపు పిల్లలకు తేనె తాగించకపోవడమే మంచిదని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. మసాలా పదార్థాల్లో, మద్యంలో, ఆవనూనె వంటివాటిలో తేనెను కలపకూడదు. వర్షపు నీటితో కలిపి వాడకూడదు. ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లయితే పంచదార స్ఫటికలు తయారవుతాయి. అప్పుడు ఆ తేనె స్ఫటికను ఎండలో ఉంచితో సరిపోతుంది. తేనె సీసాను వేడి నీటిలో పెట్టినా కూడా స్ఫటికం కరిగిపోయి సాధారణ తేనెగా మారుతుంది. తేనెను, నెయ్యిని సమాన భాగాలుగా తీసుకోకూడదు. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. మిరియాలు వంటి వాటితో నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. ఇది ఉష్ణవిహీన పదార్థం కాబట్టి నేరుగా మంటపై వేడి చేయకూడదు. వేడి వాతావరణంలో (ఎండాకాలంలో) దీనిని పరిమితంగా వాడాలి. ఇదంతా చదువుతుంటే& ‘వావ్‌... వండ్రఫుల్‌ నేచురల్‌ మెడిసిన్‌' అనిపిస్తోంది కదూ..!

ఎన్నెన్ని లాభాలో...

తేనె సులభంగా జీర్ణమవుతుంది. దీనిని తీసుకుంటే జీర్ణాశయ సమస్యలు తగ్గిపోతాయి. ఇందులోని షుగర్‌ దాతువులు సులభంగా రక్తంలో కలిసిపోతాయి. మూత్రపిండాలకు, పేగులకు బలాన్నిస్తుంది. అవి చురుగ్గా పనిచేసేలా ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని, అజీర్తిని పోగొడుతుంది. దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి రుగ్మతలను నివారిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తేనె ఎంత పరిమాణంలో తీసుకున్నా మనిషి బరువు పెరగదు. స్థూలకాయం (ఊబకాయం) సమస్య ఉన్న వారు ప్రతి రోజు కొంచెం తేనెను గోరువెచ్చని నీటిలోగానీ, నిమ్మరసంలోగానీ (రెండు చెంచాల రసానికి అర చెంచా తేనె) కలుపుకుని ఉదయమే పరగడుపున తాగితే బరువు క్రమేణా తగ్గుతుంది. గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగితే బరువు పెరుగుతారు. తేనె తాగితే మెదడుకు మంచిది. మనిషి శరీరంలోని షుగర్‌ ఎక్కువగా ఖర్చయ్యేది మెదడు కోసమే. తేనెను మంచినీటితో కలిపి తీసుకున్న ఏడు ఏడు నిమిషాల్లోనే అందులోని చక్కెర (షుగర్‌) ధాతువులు నేరుగా మెదడుకు చేరి దానికి బలాన్నిస్తాయి. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే రక్తం, దాని ప్రసరణ తగినంత ఉండాలి. తేనెను క్రమపద్ధతిలో తీసుకుంటే శరీరంలో తగినంత రక్తం తయారవుతుంది, రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తంలోని మలినాలను శుభ్రపరచడంలో తేనె ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దమనుల్లో కొవ్వు పేరుకుపోయిన గుండెపోటు (స్ట్రోక్‌) వచ్చే ప్రమాదమున్న వారు తేనె తీసుకుంటే ఫలితం ఉంటుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. తేనెకున్న మరో గొప్ప గుణం ఏమిటంటే.. ఇది శరీరంలోకి కొత్త (వినాశకర) బ్యాక్టీరియాలు రాకుండా చూస్తుంది. శారీరక బలహీనతలను దూరం చేసి చురుకుదానాన్ని ఇస్తుంది. తరచుగా తేనెను తీసుకుంటే అనేక రకాలైన వ్యాధులు దరి చేరవని ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్నారు. 
logo