సోమవారం 06 జూలై 2020
Khammam - Jun 16, 2020 , 02:37:01

‘యాసంగి’ సూపర్‌ హిట్‌

‘యాసంగి’ సూపర్‌ హిట్‌

  • రైతుల ‘పంట’ పండింది..
  • ధాన్యం సేకరణలో ఆల్‌ టైం రికార్డ్‌
  • గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిన సాగు విస్తీర్ణం
  • ఉమ్మడి జిల్లాలో లక్ష్యానికి మించి కొనుగోళ్లు
  • లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ
  • గిట్టుబాటు ధర అందజేతపై హర్షాతిరేకాలు

ధాన్యపు సేకరణలో ఉమ్మడి జిల్లాలు ఆల్‌ టైం రికార్డ్‌  సాధించాయి.. ఈ ఏడాది యాసంగి సాగు సూపర్‌ హిట్‌ అయింది.. సకాలంలో ‘రైతుబంధు’ జమ కావడంతో పాటు సాగునీరు కూడా పుష్కలంగా ఉండడంతో రైతుల ‘పంట’ పండింది.. తెలంగాణ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేసింది.. ఒకవైపు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ  ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది..   ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకుని రైతుల సమస్యలు పరిష్కరించారు.. కొనుగోళ్లలో ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.. అతి తక్కువ సమయంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.. దీంతో రైతాంగం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 -ఖమ్మం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం

తెలంగాణ ఆవిర్భవించిన తొలి ఏడాది 2014-15 లో ఉమ్మడి జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా వానకాలంలో 54 వేల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 57 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో వానకాలంలో 1.81 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 3.29 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. 2019-20లో చరిత్రలోనే అత్యధికంగా రికార్డుస్థాయిలో మొత్తం 5.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాలో 2015-16 వానకాలంలో 1.54 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 15 వేల మెట్రిక్‌ టన్నులు, 2016-17 వానకాలంలో 3.48 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 1.01 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఖమ్మం జిల్లాలో 2017-18 వానకాలంలో 39 వేల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 1.38 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2018-19 వానకాలంలో 1.16 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 1.31 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2019-20 యాసంగిలో 1.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అయితే 2019-20లో యాసంగి ధాన్యం కొనుగోలు కోసం 388 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 3.29 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించారు. 51,484 మంది రైతుల నుంచి 3.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.32.93 కోట్లు చెల్లించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెరిగిన దిగుబడి

కొత్తగూడెం జిల్లాలోనూ ధాన్యం దిగుబడి ఏటేటా పెరుగుతూ వచ్చింది. 2016-17లో 19 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన రూ.45 కోట్లను రైతులకు చెల్లించారు. 2017-18లో 22 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.51 కోట్లను చెల్లించారు. 2018-19లో 32 వేల టన్నులు కొనుగోలు చేయగా రూ.60 కోట్లను చెల్లించారు. 2019-20లో అనూహ్యంగా రెట్టింపు కొనుగోళ్లు జరిగాయి. 60 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొని రైతులకు రూ.110 కోట్ల సొమ్మును చెల్లించారు. నిరుడు వానకాలంలో 19,923 మంది రైతుల వద్ద 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.300 కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేశారు.

సాగు నీరు పుష్కలంగా ఉండడం వల్లే..

మిషన్‌ కాకతీయ పథకం వల్ల చెరువులు పూర్తిగా నిండాయి. భూగర్భ జలాలు పెరిగాయి. రైతులకు వరంలా మారాయి. ఏటికేడాదీ పంటల దిగుబడి పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వం గిట్టుబాలు ధర కల్పించడంతో రైతులకు దళారుల బెడద తప్పింది. రైతులు తమ పంటను ప్రభుత్వానికి విక్రయించిన వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అయింది. ఈ ఏడాది రెండింతల పంట పండింది. దీంతో కేంద్రాలను కూడా పెంచి ప్రతి గింజనూ కొనుగోలు చేశాం. 

-ప్రసాద్‌. జిల్లా సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌.

సమష్టి విజయం..

చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ధాన్యం దిగుబడి కావడం, అదే సమయంలో కరోనా సమస్యతో లాక్‌డౌన్‌ ఎదురుకావడం వంటివి జరిగాయి. అయినా రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేసి ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖాధికారులు, ఇతర సిబ్బంది ప్రక్రియను ముందుండి నడిపించారు. ఇదే సమయంలో ఉచిత రేషన్‌ బియ్యం, రూ.1500 నగదు అందజేయాల్సి వచ్చింది. అయినా రెండు పనులనూ జిల్లా యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేసింది. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలో నిరుడు 32 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి కాగా ఈ ఏడాది 60 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అయింది. కొనుగోళ్లు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. రూ.110 కోట్ల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అయింది.


logo