శుక్రవారం 03 జూలై 2020
Khammam - Jun 15, 2020 , 00:21:50

పత్రికల్లో ఫొటోల కోసమే కాంగ్రెస్‌ నాయకుల పోజులు

పత్రికల్లో ఫొటోల కోసమే కాంగ్రెస్‌ నాయకుల పోజులు

  • ఎమ్మెల్సీ బాలసాని, కొండబాల కోటేశ్వరరావు, తాతామధు 

ఖమ్మం : దేశం గర్వించదగే స్థితిలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుంటే ఓర్వలేని కాంగ్రెస్‌ నాయకులు జలదీక్ష పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని శాసనమండలి సభ్యుడు బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతామధు విమర్శించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ ఎలాంటి సమస్యలు లేకుండా వారు పనుల్లో నిమగ్నమైతే ఏ పనిలేని కాంగ్రెస్‌ నాయకులు వారి ఇండ్లలో కూర్చుని దీక్షలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పత్రికల్లో ఫొటోల కోసం ఫోజులివ్వడం కోసం తాపత్రయ పడుతున్నారన్నారు. జిల్లాకు చెందిన మల్లుభట్టి విక్రమార్క గోళ్లపాడులో దీక్ష చేయడం పనికిమాలిన చర్య అన్నారు.  సీఎం కేసీఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేస్తూ సంక్షేమంలో అగ్రభాగాన నిలిపారన్నారు.

విత్తనాలు లేవని, నీళ్లు లేవని కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు ఎవరైనా అడిగారా అని నిలదీశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వేసవికాలంలో నగరంలో దాదాపు వంద ట్రాక్టర్ల ట్యాంకర్లు నీటిని సరఫరా చేసే విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు మరిచిపోయారా అన్నారు. ఆ రోజుల్లో నామా, పొంగులేటి, పువ్వాడ లాంటి ట్రస్టుల ఆధ్వర్యంలో నీటి సరఫరా జరిగేదన్నారు. ఇందిరా సాగర్‌, రాజీవ్‌సాగర్‌ టెండర్లలో భట్టికి ఉన్న వాటా ఎంత అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారిపోయారని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌ నాయకులకు లేదన్నారు.

ఆ పార్టీలో అంతర్గత ఆదిపత్యం కోసం ప్రతి ఒక్కరూ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు అధికారుల పట్ల, పోలీసుల పట్ల దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని, వారు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని భట్టి విమర్శించడం సరైంది కాదని ధ్వజమెత్తారు. భట్టి తన వ్యాఖలను వెనుకకు తీసుకోకపోతే తీవ్ర చర్యలుంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎండీ.ఖమర్‌, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు, కార్పొరేటర్‌ కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు. logo