గురువారం 09 జూలై 2020
Khammam - Jun 15, 2020 , 00:18:32

మిడతల ముప్పుపై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్‌

మిడతల ముప్పుపై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్‌

  • రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సరిహద్దులో సమూహం
  • కలెక్టర్లను సన్నద్ధం చేసిన సీఎం కేసీఆర్‌
  • సీఎస్‌ నేతృత్వంలో ప్రత్యేక పర్యవేక్షణ బృందం

అశ్వారావుపేట: మిడతల ముప్పుపై మన దేశం ఎప్పటికప్పుడు పక్కా దేశాల్లో వాటి ఉధృతిని అంచనా వేస్తూ నష్టం రాకుండా తగు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంకూడా అప్రత్తమైంది. తెలంగాణ రాష్ర్టానికి మిడతల ముప్పు పొంచి ఉందా..? ఉంటే ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షలో సరిహద్దు జిల్లాల కలెక్టర్లకు సూచనలిచ్చారు. సీఎస్‌ నేతృత్వంలో పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

ఇప్పటికే రాష్ర్టానికి 200 కి.మీ దూరంలోని మహారాష్ట్ర రాంటెక్‌ వద్దకు చేరిన మిడతల దండు దక్షిణ దిశగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 20 నుంచి జూలై 5వ తేదీలోపు రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించవచ్చని సర్కార్‌ భావిస్తున్నది. వీటివల్ల ఎదురయ్యే ముప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 10న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు ఇస్తూ సరిహద్దు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో మిడతల దండు దాడి చేస్తే తీవ్ర నష్టం వాటిల్లవచ్చని సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లు ఎదుర్కోనేందుకు సన్నద్ధయ్యారు. గత నెలలో మూడు విడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకు చేరుకున్నాయి. అక్కడి నుంచి తెలంగాణలోకి వచ్చి నష్టం కలిగించవచ్చని భావించినా.. రాష్ట్రం వైపు రాకపోవడంతో  రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా రాష్ర్టానికి కేవలం 200 కి.మీ దూరం దండు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ దిశా నిర్దేశం చేశారు.

తొమ్మిది జిల్లాల్లో అప్రమత్తం..

పక్క రాష్ర్టాల సరిహద్దు గ్రామాల నుంచి మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు,మంచిర్యాల, అదిలాబా ద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబా ద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌  అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యవేక్షించేందుకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ప్రవీణ్‌రావు, సీఐపీఎంసీ ప్లాంట్‌ ప్రొడక్షన్‌ ఆఫీసర్‌ సునీత, వ్యవసాయ యూనివర్సిటీ సీనియర్‌ శాస్త్రవేత్త రహమాన్‌తో కూడిన బృందం అదిలాబాద్‌లో పర్యటించనుంది. 

మిడతల దండు జీవిత చక్రం 

మిడతల జీవిత చక్రం గుడ్డు, రెక్కలు లేని అపరిపక్వ దశ, రెక్కలున్న ప్రౌడ మూడు దశలు ఉంటాయి. ఆడ పురుగు తేమగా ఉండే నీళ్లలో, ఖాళీగా ఉండే ఎడారి ప్రాంతాల్లో గుడ్లు పెడతా యి. రెండు వారాల్లో వాటినుంచి పిల్ల పురుగులు (రెక్కలు లేని) తయారవుతాయి. ఇవి ఐదారు వారాల్లో అన్ని రకాల ఆకులు, గడ్డిని తింటూ 5-6 సార్లు కుబుసం (పాత చర్మాన్ని) విడుస్తూ పరిమాణాన్ని విపరీతంగా పెంచుకుంటూ రెక్క లున్న పెద్ద మిడతలుగా మారతాయి. మన దేశంలో ప్రధానంగా 1. డెసర్ట్‌ లోకస్ట్‌, 2. బాంబే లోకస్ట్‌, 3.మైగ్రేటరీ లోకస్ట్‌ అనే మూడు రకాల మిడతల దండు ఉన్నాయి. ప్రస్తుతం మనకు నష్టం కలిగించనున్న మిడతల దండు డెసర్ట్‌లోకస్ట్‌(ఎడారి మిడతల దండు). 

మిడతల వల్ల భారీ నష్టం

మిడతల దండు దాడి చేస్తే పంటలకు భారీ నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం వానకాలంలో పంటలు మొలకెత్తే దశలో ఉండటం వల్ల వాటి దాడిలో పూర్తిగా నాశ నం అవుతాయి. 2003-2005 తర్వాత వీటి ఉధృతి మళ్లీ ఇప్పుడు చూస్తున్నాం. ఇవి పెరగటానికి ముఖ్య కారణం 2018లో ఆరేబియన్‌ మహా సముద్రంలో వచ్చిన రెండు తుపాన్లు వల్ల ఎడారుల్లో లేక్స్‌ (సరస్సులు) ఏర్పడటమే. ఇవి రోజుకు 35 వేల మంది తినే ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌) కూడా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మిడతల కదలికలను గమనిస్తూ అన్ని దేశాలకు సలహాలు      అందిస్తున్నది. 

-డాక్టర్‌ టీ పావని, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంటమాలజీ,      వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేటlogo