మంగళవారం 07 జూలై 2020
Khammam - Jun 15, 2020 , 00:06:17

డెయిరీలో పాలు విక్రయిస్తున్న వారికి ఆర్థిక దన్ను

డెయిరీలో పాలు విక్రయిస్తున్న వారికి ఆర్థిక దన్ను

  • రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం
  • ఉమ్మడి జిల్లాలో 3 వేల మందికి కిసాన్‌ కార్డులు
  • దరఖాస్తులు అందజేస్తున్న లబ్ధిదారులు

పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.. డెయిరీలో పాలు క్రయిస్తున్న వారికి అతి తక్కువ వడ్డీతో రుణాలు అందజేయాలని సంకల్పించింది.. గేదెలు, దాణా, గడ్డి, ఫాంనిర్మాణానికి అవసరమైన పరికరాలు కొనుగోలు చేసుకుని పాల ఉత్పత్తి పెంచేలా ప్రోత్సహిస్తున్నది.. ఇందుకు గాను రూ.3 లక్షల వరకు రుణ పరిమితితో కిసాన్‌ కార్డులు అందజేయనున్నది.. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 3 వేల మందికి పైగా లబ్ధిపొందనున్నారు.. రుణాల అందజేతపై పాడి రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.     

- ఖమ్మం, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం

 కరోనా కారణంగా పాడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఆదుకునే ప్రయత్నాల్లో భాగంగా వారికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆత్మ నిర్మర్‌ అభియాన్‌ కింద ఒక్కో క్రెడిట్‌ కార్డుపై పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు, పాల డెయిరీ ష్యూరిటీపై రూ.3 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. ఈ పథకం కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయ డెయిరీలో సభ్యత్వమున్న మూడువేల మంది పాడి రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ రుణంతో గేదెలు, ఆవులు, దాణా, పాడి సంబంధ పరికరాలను కొనుగోలు చేసుకోవచ్చు. షెడ్లను  నిర్మించుకోవచ్చు.

ఇవీ పరిమితులు..

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులో జమ అయిన మొత్తాన్ని ఒకేసారి తీసుకునేందుకు వీలుండదు. అవసరాలనుబట్టి తీసుకోవాలి. తీసుకున్న మొత్తంలో నెలకు కనీసం ఐదు శాతాన్ని తిరిగి చెల్లించాలి. ఈ రుణానికి సబ్సిడీ ఉండదు. కానీ రెండు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. వాయిదాలను సక్రమంగా చెల్లిస్తే అదనంగా మరో మూడు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇప్పటికే క్రెడిట్‌ కార్డు ఉన్న రైతులకైతే రుణ పరిమితి పెరుగుతుంది. ఏ బ్యాంకులోనైతే రుణాలు తీసుకున్నారో అదే బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

మూడు వేల మందికి లబ్ధి..

ఖమ్మం విజయ డెయిరీ పరిధిలో మొత్తం ఏడు పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం ప్రధాన డెయిరీతోపాటు ముదిగొండ, సత్తుపల్లి, కల్లూరు, కొత్తగూడెం, ఇల్లెందు, కామేపల్లి, ఎర్రుపాలెం, మధిర ప్రాంతాల్లో పాల కేంద్రాలు ఉన్నాయి. 250 గ్రామ పాల సేకరణ కేంద్రాల నుంచి రోజుకు 8000 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఈ వేసవిలో పాల సేకరణ తగ్గింది. ఈ ఏడు కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 2,500 మంది పాడి రైతులు సభ్యులుగా ఉన్నారు. కొత్తగా సభ్యత్వం కోసం మరో 500 మంది దరఖాస్తు చేశారని ఖమ్మంలోని విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ గోపాల్‌సింగ్‌ తెలిపారు. వీరందరికీ సభ్యత్వం ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి రూ.1.60 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు పొందేందుకు వీరందరికీ అర్హత ఉంది. ఈ నెలాఖరు నాటికి వీరికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేసేందుకు డెయిరీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

దరఖాస్తు ఇలా..

ఖమ్మం విజయ డెయిరీ పరిధిలోని పాల సేకరణ కేంద్రాల్లో ఏడాది కాలంగా పాలు పోస్తూ బిల్లులు తీసుకున్న పాడి రైతుల జాబితాను సంబంధిత కేంద్రాల అధ్యక్షులు ఇప్పటికే సిద్ధం చేశారు. రుణం తీసుకునేందుకు అర్హులైన రైతులు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆధార్‌ కార్డు, భూమి పట్టాదారు పాస్‌ బుక్‌, బ్యాంకు పాస్‌ బుక్‌ జిరాక్స్‌ కాపీలు, పాడి రైతు ధ్రువీకరణ పత్రం వంటివన్నింటినీ సూపర్‌వైజర్లకు అందించాలి. వాటిని వారు సంబంధిత పాల కేంద్రం మేనేజర్‌కు అందజేస్తారు. అక్కడ పరిశీలన పూర్తయ్యాక దరఖాస్తులను బ్యాంకులకు పంపుతారు. ఆ తరువాత వారం పది రోజుల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు మంజూరవుతాయి. ఈ మొత్తం ప్రక్రియను జిల్లా పశుసంవర్ధక శాఖ పర్యవేక్షిస్తుంది. తమకు రుణాలు అందుతాయన్న వార్తతో పాడి రైతులంతా సంతోషపడుతున్నారు. పాడి పరిశ్రమకు మంచి రోజులొచ్చాయని సంబురపడుతున్నారు. 

పాల సేకరణ పెరుగుతుంది..

ఖమ్మం విజయ డెయిరీ ద్వారా ప్రతి రోజూ 5000 లీటర్ల పాలను సేకరిస్తున్నాం. ఈ పాలను విజయ పాల ప్యాకెట్లుగా విక్రయిస్తున్నాం. ప్రభుత్వం పాడి రైతులకు అందించే కిసాన్‌ కార్డులు, రుణాల ద్వారా ఖమ్మం జిల్లాలో పాల సేకరణ పెరుగుతుంది. 10 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యాన్ని చేరుకుంటామన్న నమ్మకం కలుగుతున్నది.

-గోపాల్‌సింగ్‌, డిప్యూటీ డైరెక్టర్‌, ఖమ్మం విజయ డెయిరీlogo