గురువారం 09 జూలై 2020
Khammam - Jun 14, 2020 , 02:34:23

స్కూల్‌ కాంప్లెక్సే కీలకం

స్కూల్‌ కాంప్లెక్సే కీలకం

  • u ‘పాఠశాల సముదాయాల’కు   అధికారాల బదిలీ
  • u పర్యవేక్షణ, ఉపాధ్యాయుల జీత   భత్యాలూ వీటి పరిధిలోనే..
  • u విద్యారంగంలో నూతన ఒరవడి

ఖమ్మం ఎడ్యుకేషన్‌: పాఠశాల విద్యలో ఒక నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  పాఠశాలల సముదాయాల(స్కూల్‌ కాంప్లెక్సు)ను బలోపేతం చేసి సేవలను వికేంద్రీకరణ చేసింది. జీత భత్యాలు, పర్యవేక్షణ, సమాచార సరఫరా మునుపటి కంటే మెరుగ్గా కాంప్లెక్సుల ద్వారా జరుగనుంది. గత ఏప్రిల్‌-2020 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా మండలాల ఎంఈవోల పర్యవేక్షణలో జీతాలు పొందేవారు. ఒక్కో మండలంలో 150- 200 మందికి ఉపాధ్యాయులు ఉండటంతో పర్యవేక్షణ, అకడమిక్‌ వ్యవహారాలు, జీత భత్యాల పంపిణీ తదితర అంశాలు కష్టతరంగా ఉండేవి. ఇప్పుడు స్కూల్‌ కాంప్లెక్స్‌ల ద్వారానే జీతాభత్యాలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 8న ప్రభుత్వం జీవో జారీ చేయగా మే నెల జీతాలు ఉపాధ్యాయులకు కాంప్లెక్సుల ద్వారానే అందాయి. 

సరికొత్త ఒరవడి..

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్ల జీత భత్యాలు అందనున్నాయి. సర్వీస్‌ అంశాలు, సమాచార మార్పిడి వంటి అధికారాలు ఇప్పుడు కాంప్లెక్స్‌ల పరిధిలోనే ఉంటాయి. కాంప్లెక్స్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డీడీఓ( డ్రాయింగ్‌ అధికారులు)గా వ్యవహరించనున్నారు. నూతన ఒరవడితో పరిపాన వికేంద్రీకరణ జరుగనుంది. సమాచారం వేగంగా వెళ్లడమే కాకుండా పర్యవేక్షణ కూడా సులువు కానుంది. ఖమ్మం జిల్లాలోని 21 మండలాల పరిధిలో 81 స్కూల్‌ కాంప్లెక్స్‌ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో కాంప్లెక్స్‌ పరిధిలో కనిష్ఠంగా 15 నుంచి గరిష్ఠంగా 45మంది వరకు ఉపాధ్యాయులు ఉంటారు. కాంప్లెక్స్‌ పరిధిలో 8 నుంచి 15 వరకు పాఠశాలలు ఉంటాయి.

బడులు బలోపేతం...

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వికేంద్రీకరణ జరుగుతుంది. ఈ విధానంలో కాంప్లెక్స్‌ పరిధిలోని ఉపాధ్యాయులకు సకాలంలో సేవలందుతాయి. అకడమిక్‌గా పాఠశాలలు బలోపేతం అవుతాయి. అవసరమైనప్పుడల్లా మండల కేంద్రానికి వెళ్లే అవసరం ఉండదు. సమాచారం త్వరగా జిల్లా, రాష్ట్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రకంగా అధికారాల బదిలీ  ప్రయోజనకరమని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి. పాఠశాల సముదాయాలను ఇంకా బలోపేతం చేయాలని, అవసరమైన సరంజామా, పరికరాలు, తగినంత సిబ్బందిని ఇచ్చి నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని కోరుతున్నాయి.

 అధికారికంగా అమలైంది..

ఈ అధికారాల బదిలీ జనవరిలోనే జరిగింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం రావడం, ఆ తర్వాత సుమారు మూడు నెలల పాటు లాక్‌డౌన్‌ రావడంతో బదిలీ ఆలస్యమైంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో శీఘ్ర అమలుకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు డీఈవో కేడర్‌ స్ట్రెంత్‌ వివరాలను జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సమర్పించారు. దీంతో అధికారాల అప్పగింత అధికారికంగా అమలైంది.logo